17 లక్షల Cashతో బస్సు ప్రయాణం.. టిఫిన్‌ చేసి తిరిగొచ్చే సరికి చోరీ.. ఈ హోటల్ దగ్గరే ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2022-02-08T12:45:22+05:30 IST

ఓ ప్రైవేటు బస్సులో రూ.17లక్షలను చోరీ చేశారు..

17 లక్షల Cashతో బస్సు ప్రయాణం.. టిఫిన్‌ చేసి తిరిగొచ్చే సరికి చోరీ.. ఈ హోటల్ దగ్గరే ఎందుకిలా..!?

చిత్తూరు జిల్లా/బంగారుపాళ్యం : ఓ ప్రైవేటు బస్సులో రూ.17లక్షలను చోరీ చేశారు. గంగవరం రూరల్‌ సీఐ రామకృష్ణాచారి, ఎస్‌ఐ మల్లికార్జున్‌ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఓ వ్యాపారి వద్ద ఆదిబాబు పనిచేస్తున్నారు.  బెంగళూరులో ఎండుకొబ్బరి కొనుగోలు నిమిత్తం ఆదివారం రాత్రి రూ.17 లక్షలను తీసుకుని ఓ ప్రైవేటు బస్సు ఎక్కాడు. నగదును ఓ బ్యాగులో పెట్టుకున్నాడు. దాన్ని లగేజ్‌ క్యారియర్‌లో పెట్టి ప్రయాణం సాగించాడు. సోమవారం ఉదయం బంగారుపాళ్యం మండలంలోని నలగాంపల్లె సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న నందిని ఫుడ్‌ ప్లాజా వద్ద బస్సు ఆగింది.


అల్పాహారం కోసం ఆదిబాబు బస్సు దిగి, హోటల్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి నగదు ఉంచిన బ్యాగు కనిపించలేదు. దాంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ తన సిబ్బందితో వెళ్లి.. హోటల్‌ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. బస్సు బయల్దేరక ముందు కర్ణాటకకు చెందిన ఓ కారులో నలుగురు వ్యక్తులు ఓ బ్యాగుతో వెళుతున్నట్లు గుర్తించారు. వెంటనే జాతీయ రహదారిపై ఉన్న పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. సీఐ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు.


అడ్డుకునే వారు లేరా..?

గతంలోనూ ఈ హోటల్‌ వద్ద ఇదే తరహాలో చోరీలు జరిగాయి. నగదు ఉంచిన బ్యాగులతోపాటు, ల్యాప్‌టాప్‌ వంటి విలువైన వస్తువులు చోరీలకు గురయ్యాయి. జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టకముందు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 7.5కిలోల బంగారం చోరీ కూడా ఇక్కడే జరిగింది. ఈ చోరీలను అడ్డుకునే వారే లేరా.. అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-02-08T12:45:22+05:30 IST