‘అర్ధ’మే ప్రామాణికం!

ABN , First Publish Date - 2021-12-14T05:24:52+05:30 IST

జిల్లాలో ఈ ఏడాది అర్ధ సంవత్సరం పరీక్షలే ప్రామాణికంగా తీసుకుని పాఠశాల, ఇంటర్‌ విద్య అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

‘అర్ధ’మే ప్రామాణికం!

17 నుంచి ఆర్నెల్ల పరీక్షలు

27 నుంచి ఇంటర్‌కు..

షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం

కట్టుదిట్టమైన ఏర్పాట్లు


పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన విద్యార్థులకు ఈ ఏడాది కఠిన పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గత రెండేళ్లలో కొవిడ్‌ కారణంగా విద్యాసంస్థలు లేకపోవడం, విద్యార్థులకు పరీక్షలను నిర్వహించకపోవడంతో నిర్మాణాత్మక ముదింపు పరీక్షల మార్కుల ఆఽధారంగానే ఉత్తీర్ణతలను నిర్ణయించారు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో నిర్మాణాత్మక ముదింపులోని లఘు పరీక్షలను వార్షిక పరీక్షల్లా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యాశాఖ అధికారులు అర్ధ సంవత్సరం పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


నెల్లూరు (విద్య), డిసెంబరు 13 : జిల్లాలో ఈ ఏడాది అర్ధ సంవత్సరం పరీక్షలే ప్రామాణికంగా తీసుకుని పాఠశాల, ఇంటర్‌ విద్య అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాల విద్యా శాఖకు సంబంధించి ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన ప్రశ్నపత్రాలనే ఈ పరీక్షలకు వినియోగిస్తున్నారు.   ఫలితాలను సీఎ్‌ససీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్యా కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు నిర్మాణాత్మక ముదింపు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 17వ తేదీన  8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఉదయం వేళల్లో పరీక్షలు నిర్వహిస్తారు. వీరిలో కూడా ఉదయం 9.30 నుంచి 10.45 గంటల వరకు 8వతరగతికి, 10.30 నుంచి 11.15 గంటల వరకు 9వతరగతికి, 11.30 నుంచి 12.15 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. అలాగే మధ్నాహం 2 నుంచి 2.45 గంటల వరకు 6వతరగతి, 3 నుంచి 3.45 గంటల వరకు 7వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించునున్నట్లు విద్యాశాఖ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. 17వతేదీన అన్ని తరగతుల వారికి తెలుగు, మ్యాథ్స్‌, 18న హిందీ, ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌, 20వతేదీన ఇంగ్లీష్‌, సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు ఉంటాయి. 21న ఓరియంటల్‌ లాంగ్వేజ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. దీని కనుగుణంగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని, డిప్యూటీ డీవోలు, ఎంఈఓలు వీటిని పర్యవేక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 


ఇంటర్మీడియట్‌లో...

ఇంటర్‌ విద్యార్థులకు ఈ నెల 27 నుంచి జనవరి 3వ తేదీ వరకు అర్ధ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. కొవిడ్‌ అత్యవసర పరిస్థితి తలెత్తితే ఈ పరీక్షలను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రశ్నపత్రం రూపకల్పన జిల్లాస్థాయిలోనే జరిగేది. ఈ ఏడాది ప్రత్యేక సిలబ్‌సను బోర్డు నుంచి నిర్ధేశించి ప్రశ్నపత్రాన్ని కూడా బోర్డు రూపొందించి ఇవ్వనుంది. మార్కులను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  ఈ ఏడాది జులై 11న ద్వితీయ సంవత్సరం, సెప్టెంబరు 29న ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆలస్యంగా తరగతులు ప్రారంభమయ్యాయి. దీనికితోడు అన్ని కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ఇంటర్‌ బోర్డు అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం లేదని విద్యార్థి సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి. అతిథి బోధకులను కూడా కొనసాగించకపోవడంతో ఫ్యాకల్టీ సమస్య తీవ్రంగా ఉంది. దీన్ని అధిగమించకుండా పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.  



Updated Date - 2021-12-14T05:24:52+05:30 IST