పాకెట్‌ మనీగా రూ.14కోట్లు ఇస్తామంటే.. ఎగిరి గంతేసి తీసుకోవాల్సిందిపోయి.. వద్దంది!

ABN , First Publish Date - 2021-06-16T17:54:54+05:30 IST

టీనేజ‌ర్ల‌కు త‌ల్లిదండ్రులు పాకెట్ మనీ ఇవ్వ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ఇక ఎంత ఇచ్చినా ఏదో ఒక సాకుతో మ‌ళ్లీ మ‌ళ్లీ పెరేంట్స్‌ను పిల్ల‌లు పాకెట్ మ‌నీ కోసం ఇబ్బంది పెట్ట‌డం కూడా చూస్తూనే ఉంటాం.

పాకెట్‌ మనీగా రూ.14కోట్లు ఇస్తామంటే.. ఎగిరి గంతేసి తీసుకోవాల్సిందిపోయి.. వద్దంది!

ఆమ్స‌స్ట‌ర్‌డామ్‌: టీనేజ‌ర్ల‌కు త‌ల్లిదండ్రులు పాకెట్ మనీ ఇవ్వ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ఇక ఎంత ఇచ్చినా ఏదో ఒక సాకుతో మ‌ళ్లీ మ‌ళ్లీ పెరేంట్స్‌ను పిల్ల‌లు పాకెట్ మ‌నీ కోసం ఇబ్బంది పెట్ట‌డం కూడా చూస్తూనే ఉంటాం. అలాంటిది ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.14కోట్లు పాకెట్ మ‌నీగా ఇస్తామంటే.. ఎవ‌రైనా ఏం చేస్తారు? ఎగిరి గంతేసి మ‌రి తీసుకుంటారు. కానీ, డ‌చ్‌ ప్రిన్సెస్ అమాలియా మాత్రం సున్నితంగా తిర‌స్క‌రించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కొన్ని దేశాల్లో రాజవంశీయులకు అక్క‌డి ప్రభుత్వాలు ప్రత్యేక అల‌వెన్సుల కింద యేటా కొంత డ‌బ్బును ఇస్తుంటాయి. ఇలాగే నెదర్లాండ్స్‌ చక్రవర్తి విలియమ్‌ అలెగ్జాండర్ ఫ్యామిలీకి కూడా ఆ దేశ స‌ర్కార్‌ యేటా అల‌వెన్సుల కోసం భారీ మొత్తంలో న‌గ‌దు ఇస్తోంది. ఇక వచ్చే డిసెంబర్‌లో చక్రవర్తి అలెగ్జాండర్‌ పెద్ద కుమార్తె ప్రిన్సెస్‌ అమాలియా 18వ యేటా అడుగు పెట్ట‌బోతుంది. దీంతో రాచ‌రిక‌పు నిబంధ‌న ప్ర‌కారం ఆమెకు కూడా డ‌చ్‌ స‌ర్కార్‌ యేటా 1.9మిలియన్ అమెరిక‌న్‌ డాలర్లు(సుమారు రూ.14కోట్లు) పాకెట్‌ మనీగా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. 


దీనిపై స్పందించిన రాకుమారి అమాలియా.. నెద‌ర్లాండ్స్ ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ను సున్నితంగా తిర‌స్క‌రించింది. ఆ పాకెట్‌ మనీ తీసుకోవడం త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్పేసింది. క‌ష్ట‌ప‌డ‌కుండా వ‌చ్చే ఆ న‌గ‌దు త‌న‌కు వ‌ద్దంటూ నెద‌ర్లాండ్స్ ప్ర‌ధానమంత్రికి ఓ లేఖ‌ కూడా రాసింది. "2021 డిసెంబ‌ర్ 7తో నేను 18వ యేటా అడుగుపెట్ట‌బోతున్నాను. దాంతో రాచ‌రిక‌పు రూల్ ప్ర‌కారం నాకు అల‌వెన్స్ వ‌ర్తిస్తుంది. ఈ అల‌వెన్స్ కింద‌ ఇంత భారీ మొత్తంలో న‌గ‌దు తీసుకోవడం నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. పైగా తీసుకున్న డబ్బుకు న్యాయం చేసేలా ఇప్పట్లో నేను ఏ సేవలు చేయలేను. క‌ష్ట‌ప‌డ‌కుండా వ‌చ్చే డ‌బ్బు నాకొద్దు. అలాగే క‌రోనా సంక్షోభం కార‌ణంగా నా తోటి విద్యార్థులు ఎంతో కష్టపడుతున్నారు. ఇలాంటి క‌ఠిన‌ సమయంలో నేను ఆ డబ్బు తీసుకోవ‌డం క‌రెక్ట్ కాదు" అని ప్రిన్సెస్ అమాలియా త‌న‌ లేఖలో పేర్కొంది. ఇక రాకుమారి అమాలియా నిర్ణ‌యం ప‌ట్ల నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. చాలా మంచి నిర్ణ‌య‌మంటూ ప్రిన్సెస్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. 


Updated Date - 2021-06-16T17:54:54+05:30 IST