ఈ ఫ్యామిలీ ధైర్యం చూసి పెట్టేబేడా సర్దుకుని పారిపోయిన కరోనా..!

ABN , First Publish Date - 2020-07-07T06:45:05+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లో కూడా రోజురోజుకూ...

ఈ ఫ్యామిలీ ధైర్యం చూసి పెట్టేబేడా సర్దుకుని పారిపోయిన కరోనా..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లో కూడా రోజురోజుకూ వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. కరోనా వైరస్ దెబ్బకు అంతా దూరం దూరం.. భౌతిక దూరం అన్న మాటే వినిపిస్తోంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఆ కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్‌కు పంపిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా 17 మందితో కూడిన ఓ కుటుంబంలో 11 మందికి కరోనా సోకినా ఆ కుటుంబం తట్టుకొని నిలబడిందంటే నమ్మగలరా..? 3 నెలల పసికందు నుంచి 90 ఏళ్ల వృద్ధులు కూడా ఉన్న ఆ ఉమ్మడి కుటుంబం కరోనాను ఎలా జయించింది ? ఢిల్లీలో కరోనాను జయించిన ముకుల్ గార్గ్ కుటుంబం గురించి ప్రత్యేక కథనం..


ఢిల్లీలోని లీఫీ లూటెన్స్‌లో ముకుల్ గార్గ్ కుటుంబం నివాసముంటోంది. వీరిది 17 మందితో కూడిన ఉమ్మడి కుటుంబం. కరోనా వల్ల లాక్‌డౌన్ విధించడంతో కొన్ని వారాల పాటు ఈ కుటుంబమంతా ఇంటికే పరిమితమైంది. వీరి కుటుంబంలో 3 నెలల పసికందు నుంచి 90 ఏళ్ల వృద్ధులు కూడా ఉన్నారు. వీరంతా లాక్‌డౌన్ సమయంలో కలిసే ఉన్నారు. కలిసే తిన్నారు. కలిసే ఆడుకున్నారు. అయితే.. కరోనా మహమ్మారి ఈ కుటుంబాన్ని కమ్మేసింది. తొలుత ఈ కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరికొద్ది రోజులకు గార్గ్ కుటుంబంలోని 11 మందికి కరోనా సోకింది. 90 ఏళ్ల వయసున్న ముకుల్ తాతయ్య, 87 ఏళ్ల వయసున్న ముకుల్ నానమ్మ, 62 ఏళ్ల వయసున్న ముకుల్ తండ్రి 60 ఏళ్ల వయసున్న ముకుల్ అంకుల్ కూడా కరోనా సోకిన ఆ 11 మందిలో ఉన్నారు. వీరిలో కొందరు మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్తులు కూడా. గార్గ్ ఇంటికి క్వారంటైన్ స్టిక్కర్ వేశారు. బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. 


అయితే.. కరోనా బారిన పడ్డ గార్గ్ కుటుంబంలోని 11 మందిలో కొందరు తీవ్ర అనారోగ్యానికి లోనవగా, కొందరికి అసలు కరోనా లక్షణాలే లేవు. అయితే.. కరోనా పాజిటివ్‌గా తేలగానే కుటుంబ సభ్యులంతా అప్రమత్తమయ్యారు. ఎవరికి వారు వేర్వేరు గదుల్లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆ కుటుంబంలో కరోనా బారిన పడని వారిలో ఒకరు బయటకు వెళ్లి నిత్యావసరాలు తీసుకొచ్చేవారు. బయటి నుంచి రాగానే శానిటైజ్ చేసుకునేవారు. అయితే.. ఈ కుటుంబంలోని అనిత అనే మధ్య వయస్కురాలి పరిస్థితి విషమించడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందారు. పది రోజుల తర్వాత ఆమె కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు. మిగిలిన వారంతా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడిన వారు కావడంతో గార్గ్ కుటుంబం ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు పాటించి.. తగిన చికిత్స తీసుకుని కరోనాను జయించింది.


ఏప్రిల్‌లో ఈ కుటుంబంలోని 11 మంది కరోనా బారిన పడగా.. జూన్ మొదటి వారంలో 11 మందికీ నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం మీద.. ఈ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. గతంలో మాదిరిగానే.. అందరూ కలిసి ఉంటున్నారు. కలిసి తింటున్నారు. కలిసి జీవిస్తున్నారు. కరోనా దెబ్బకు హడలెత్తిపోతున్న వారికి.. కరోనాను జయించిన గార్గ్ కుటుంబ సక్సెస్ స్టోరీ కొండంత ధైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహమే లేదు. పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే.. భయపడకుండా ధైర్యంగా ఉంటూ.. పౌష్టికాహారం తీసుకుంటూ.. తగిన చికిత్స తీసుకుంటే కరోనాను జయించడం పెద్ద విషయమేమీ కాదని గార్గ్ కుటుంబ విజయ గాథ చెప్పకనే చెబుతోంది.

Updated Date - 2020-07-07T06:45:05+05:30 IST