తెచ్చింది 18 మృతదేహాలు.. మరణం ఒక్కటేనట!

ABN , First Publish Date - 2021-04-23T10:44:37+05:30 IST

రోజుకు నాలుగైదు మృతదేహాలకు దహనక్రియలు జరిగే శ్మశానవాటికలవి. అలాంటి వాటికల్లో తక్కువలో తక్కువ 15 నుంచి 20 మృతదేహాలు ప్రతిరోజూ

తెచ్చింది 18 మృతదేహాలు.. మరణం ఒక్కటేనట!

విశాఖలో సర్కారు వింత లెక్కలు

శ్మశానవాటికల్లో రోజంతా దహనాలే


విశాఖపట్నం, గుంటూరు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రోజుకు నాలుగైదు మృతదేహాలకు దహనక్రియలు జరిగే శ్మశానవాటికలవి. అలాంటి వాటికల్లో తక్కువలో తక్కువ 15 నుంచి 20 మృతదేహాలు ప్రతిరోజూ తగలబడుతున్నాయి. కరోనా ఉధృతి పెరిగిన నేపథ్యంలో చితులు ఆరకుండా మండుతున్నాయి. విశాఖ నగరంలో ఎక్కడ కరోనా రోగి మరణించినా జ్ఞానాపురం శ్మశాన వాటికలోనే దహనం చేస్తారు. ఇక్కడికి రోజూ 16 నుంచి 22 వరకు ఇలాంటి మృతదేహాలు వస్తున్నాయి. ఒక దగ్గర వేసిన చితిమంట ఆరక ముందే మరో మృతదేహం అంబులెన్స్‌లో వస్తోంది. కాటికాపరులు కరోనా మృతదేహాలను పక్కపక్కనే వరుసగా పెట్టి దహనం చేస్తున్నారు.


గురువారం ఒక్కరోజే సుమారు 18 మృతదేహాలను ఇక్కడ దహనం చేశారు. అయితే, అధికారులు మాత్రం ఒక్కరే చనిపోయారని ప్రకటించడం గమనార్హం. గుంటూరు సిటీలోని బొంగరాలబీడు శ్మశానవాటిక గురువారం కూడా ఆరకుండా మండుతూనే ఉంది. రోజంతా కరోనా మృతదేహాలు వచ్చిపడుతూనే ఉన్నాయి. ఆరని చితులతో నిండిన శ్మశానవాటికలోని దృశ్యాలను వాటిక గోడలపైకి ఎక్కి యువకులు చూడటం కనిపించింది.

Updated Date - 2021-04-23T10:44:37+05:30 IST