కేరళలో కొండ చరియలు విరిగిపడి 18 మంది మృతి

ABN , First Publish Date - 2020-08-08T07:32:52+05:30 IST

వారంతా బతుకుదెరువు కోసం పొట్టచేతబట్టుకుని తమిళనాడు నుంచి పొరుగు రాష్ట్రమైన కేరళకు వచ్చిన వలస కూలీలు. తేయాకు తోటల్లో పని. అయితే, భారీ వర్షాల వల్ల విరిగిపడిన కొండ చరియలు...

కేరళలో కొండ చరియలు విరిగిపడి  18 మంది మృతి

  • కేరళ, కర్ణాటకల్లో భారీ వర్షాలు
  • శిథిలాల్లో 50 మంది తేయాకు తోటల వలస కార్మికులు
  • పరిహారం ప్రకటించిన ప్రధాని
  • కర్ణాటకలో పూజారి కుటుంబమంతా గల్లంతు
  • కకావికలం చేస్తున్న వరదలు

ఇడుక్కి, ఆగస్టు 7: వారంతా బతుకుదెరువు కోసం పొట్టచేతబట్టుకుని తమిళనాడు నుంచి పొరుగు రాష్ట్రమైన కేరళకు వచ్చిన వలస కూలీలు. తేయాకు తోటల్లో పని. అయితే, భారీ వర్షాల వల్ల విరిగిపడిన కొండ చరియలు.. ఆ పేదల జీవితాలను ఛిద్రం చేశాయి. ఇడుక్కి జిల్లా పెట్టిముడిలోని రాజమలై తేయాకు తోటల వద్ద 80మంది నివాసం ఉంటున్నారు. వర్షాల వల్ల భారీ మట్టి పెళ్లలు ఆ నివాస సముదాయంపై విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు, ఐదుగురు మహిళలతో సహా 18మంది తేయాకు కార్మికుల బతుకులు తెల్లారిపోయాయి. బండరాళ్లు, బురద మట్టి కింద చిక్కుకోవడం లేదా గల్లంతైన వారి సంఖ్య మరో 50మందికి పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. వరదల వల్ల వంతెన కొట్టుకుపోవడంతో మూడు రోజు నుంచి ఆ ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. అటవీ సిబ్బంది సమాచారంతో ప్రమాద విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. దీంతో జాతీయ విపత్తు స్పందన దళాన్ని(ఎన్‌డీఎర్‌ఎఫ్‌) ప్రభుత్వం రంగంలోకి దించింది. ఎడతెరిపి లేని వర్షాల వల్ల రక్షణ చర్యలకు ఆటంకం కలుగుతోందని, భారత వైమానికదళ సహాయాన్ని కూడా కోరామని సీఎం కార్యాలయం తెలిపింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి రూ.2లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు. కాగా, కేరళతోపాటు పలు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి.


కర్నాటకలోని మల్నాడుతోపాటు పలు సముద్రతీర ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. మహారాష్ట్రలోని వరదల వల్ల డ్యాంల నుంచి నీటిని వదలడంతో సరిహద్దు ప్రాంతమైన కర్నాటకలోని బెళగావిలో వరదలు ఉప్పొంగుతున్నాయి. దక్షిణకన్నడ, ఉడుపి, ఉత్తరకన్నడ, హాసన్‌, శివమొగ్గ, గదగ్‌, ధార్వాడ, యాదగిరి, బెళగావి, రాయచూరు జిల్లాల్లో 10 మంది మృతి చెందారు. తుంగభద్ర, కావేరీ, భద్ర, నేత్రావతి, కుమారధార, కృష్ణా నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కొడగులో కొండ చరియలు విరిగి పడడంతో ప్రఖ్యాత తలకావేరీ ఆలయ ప్రధాన పూజారి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పూజారి నా రాయణ ఆచారితోపాటు.. ఐదుగురు కుటుంబ సభ్యులు గల్లంతయ్యారు.  




Updated Date - 2020-08-08T07:32:52+05:30 IST