పెళ్లయిన కొద్ది గంటలకే ఆత్మహత్య చేసుకున్న 18 ఏళ్ల యువకుడు.. చనిపోయే ముందు రాసిన లేఖలో దారుణ నిజాలు!

ABN , First Publish Date - 2021-09-07T00:24:51+05:30 IST

ఆ యువతినే పెళ్లి చేసుకోవాలంటూ 18 ఏళ్ల యువకుడిపై ఊరి పెద్దలు ఒత్తిడి తెచ్చారు. ఆపై.. పోలీసులు కూడా ఊరి పెద్దలకే మద్దతు పలికారు. తప్పనిసరి పరిస్థితుల్లో అతడు వివాహానికి అంగీకరించాడు. కానీ..

పెళ్లయిన కొద్ది గంటలకే ఆత్మహత్య చేసుకున్న 18 ఏళ్ల యువకుడు.. చనిపోయే ముందు రాసిన లేఖలో దారుణ నిజాలు!

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతినే పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువకుడి(18)పై ఊరి పెద్దలు ఒత్తిడి తెచ్చారు. ఆపై.. పోలీసులు కూడా ఊరి పెద్దలకే మద్దతు పలికారు. తప్పనిసరి పరిస్థితుల్లో అతడు వివాహానికి అంగీకరించాడు. కానీ.. మనసులోని వ్యధ అతడిని స్థిమితంగా ఉండనివ్వలేదు. తన తప్పేమీ లేకపోయినా శిక్ష పడిందంటూ అతడు లోలోపలే కుమిలిపోయాడు. మరణంతోనే తనకు విముక్తి కలుగుతుందనుకున్నాడు. చివరికి.. పెళ్లై కొద్ది గంటలకే ఊరి బయట ఉన్న అడవిలో ఓ చెట్టుకు ఉరిపోసుకుని ప్రాణాలు వదిలాడు. 18 ఏళ్ల వయసులోనే బలవంతంగా ప్రాణాలు తీసుకున్న వికాస్ మల్లిక్ ఉదంతం ఇది. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో సెప్టెంబర్ 5న జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపుతోంది. 


వికాస్ మృతదేహం పక్కనే పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆ లేఖలో వికాస్ పలు సంచలన విషయాలు బయటపెట్టాడు.  అత్యాచారం చేశాడంటూ తనపై తప్పుడు కేసు పెట్టేందుకు ప్రయత్నించిన యువతితోనే తన వివాహం జరగడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వికాస్ స్పష్టం చేశాడు. ‘‘నాకు చాలా అన్యాయం జరిగింది. ఇష్టం లేకపోయిన నాకు ఆమెతో బలవంతంగా పెళ్లి చేసేశారు. ఆమె నాపై తప్పుడు కేసు పెట్టింది. అంతేకాదు.. ఆమెకు తన అక్క భర్తతోనూ ఎఫైర్‌ ఉంది. ఓ రోజు ఆమె నన్ను తన ఇంటికి ఆహ్వానించింది. ఆ తరువాత.. తన నుదిటిపై సింధూరం దిద్దమని నాకు చెప్పింది. నేను ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె తన నుదుటిపై తానే స్వయంగా సింధూరం ధరించి..ఆపై రభస ప్రారంభించింది. అందరి ముందు పంచాయితీ పెట్టింది. యువతి అక్కబావా ఆమెనే వెనకేసుకొచ్చారు.  నీకు పెళ్లైపోయింది...ఇక ఆమె నీ భార్య అని అంటూ వారు తేల్చిచెప్పారు.’’  అని తనకు జరిగిన దారుణం గురించి వికాస్ రాసుకొచ్చాడు. 


సెప్టెంబర్ 3న ఈ వివాదం గ్రామపంచాయితీ ముందుకు వచ్చింది. అక్కడ కూడా వికాస్‌కు చుక్కెదురైంది.  వివాహం చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించిన యువతి.. వికాస్‌పై అత్యాచారం కేసు పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో.. వికాస్, యువతి కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిర్చిన పంచాయితీ పెద్దలు ..వికాస్ ఆ యువతిని వివాహం చేసుకోవాల్సిందేనని తీర్పు ఇచ్చారు.  ఇందుకు అతడు నిరాకరించడంతో వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది.  యువతీయువకుల కుటుంబసభ్యులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇరు వర్గాల వాదనలూ విన్న పోలీసులు శనివారం నాడు వికాస్‌కు ఆ యువతితో అక్కడే వివాహం జరిపించి ఇంటికి పంపించారు. ఈ ఘటనతో కుమిలిపోయిన వికాస్ చివరికి ఆదివారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామపంచాయితీ పెద్దలు, యువతి కుటుంబసభ్యులే తన కుమారుడిని ఆత్మహత్యకు పురిగొల్పారంటూ  వికాస్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. వికాస్ మరణానికి అతడి కుటుంబసభ్యులే కారణంమంటూ ఆ యువతి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - 2021-09-07T00:24:51+05:30 IST