భారీ అంచనాల నడుమ 18న బడ్జెట్‌

ABN , First Publish Date - 2022-03-09T13:54:28+05:30 IST

రాష్ట్ర బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఈ నెల 18 నుంచి జార్జ్‌కోటలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్‌ మంగళవారం ప్రకటించారు. 18వ

భారీ అంచనాల నడుమ 18న బడ్జెట్‌

                         - పళనివేల్‌ సామర్థ్యానికి పరీక్ష


చెన్నై: రాష్ట్ర బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఈ నెల 18 నుంచి జార్జ్‌కోటలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్‌ మంగళవారం ప్రకటించారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నివేదికను దాఖలు చేయనున్నట్లు వివరించారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే. గత ఏడాది ఫిబ్రవరిలో అన్నాడీఎంకే ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టగా ఆ తరువాత గద్దెనెక్కిన డీఎంకే పూర్తిస్థాయి బడ్జెట్‌ దాఖలు చేయలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆర్థికమంత్రి వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులతో భేటీ అయి కొత్త పథకాలు, నిధుల అవసరం తదితరాలపై క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం పలుమార్లు ముఖ్యమంత్రితో ఆయన భేటీ అయి ఆయన సూచనలు తీసుకున్నారు. ఆ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ నిపుణులు, కార్యదర్శితో కలిసి బడ్జెట్‌పై రూపొందిస్తున్నారు. దీనిని ఈ నెల 18వ తేదీన అసెంబ్లీలో దాఖలు చేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గృహిణులకు నెలకు రూ.1000 అందజేస్తామని డీఎంకే ప్రకటించింది. ఇప్పటి వరకూ ఆ హామీ అమలులోకి రాకపోవడం పట్ల ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో ఈ బడ్జెట్‌లో ఈ పథకంపై ప్రకటన వుంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ బడ్జెట్‌లో సంక్షేమం కన్నా రాష్ట్రాభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పట్లో ఎన్నికలేవీ లేనందున.. స్టాలిన్‌ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి లేకుండా రాష్ట్రాభివృద్ధి కోసం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు వుంది. అందువల్ల రోడ్లు, గృహ నిర్మాణం, వ్యవసాయం, విద్యారంగాలపైనే ఈ బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-03-09T13:54:28+05:30 IST