ఒక్క రోజే 19 కేసులు

ABN , First Publish Date - 2022-07-06T05:12:09+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కలకలం ప్రారంభమైంది. కొద్దిరోజుల కిందట వరకూ జీరోగా ఉన్న నమోదు శాతం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ప్రతీరోజూ ఒకటి, రెండు కేసులు నమోదవుతుండగా.. మంగళవారం ఏకంగా 24 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రెండెంకలు దాటడంతో కలవరం

ఒక్క రోజే 19 కేసులు


జిల్లాలో మళ్లీ కొవిడ్‌ కలవరం!

నిబంధనలు పాటించని ప్రజలు

నిర్థారణ పరీక్షలు పెంచని అధికారులు

మేల్కొనకుంటే ముప్పే

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ కలకలం ప్రారంభమైంది. కొద్దిరోజుల కిందట వరకూ జీరోగా ఉన్న నమోదు శాతం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ప్రతీరోజూ ఒకటి, రెండు కేసులు నమోదవుతుండగా.. మంగళవారం ఏకంగా 24 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రెండెంకలు దాటడంతో కలవరం ప్రారంభమైంది. మూడో దశ కొవిడ్‌ తరువాత పరిస్థితి సద్దుమణిగిందని అంతా భావించారు. సాధారణ స్ధితికి రావడంతో అంతటా నిర్లక్ష్యం నెలకొంది. కొవిడ్‌ గురించే దాదాపు మరిచిపోయినట్టు ప్రజలు వ్యవహరిస్తున్నారు. వాతావరణంలో మార్పులు సంభవించినప్పడు, చల్లటి వాతావరణం సమయంలో ఒకటి, అరా కేసులు నమోదయ్యాయి. కానీ అధికసంఖ్యలో నమోదైన దాఖలాలు లేవు. మంగళవారం ఏకంగా రికార్డుస్థాయిలో 19 కేసులు నమోదు కావడంతో అటు ప్రజల్లో భయం నెలకొనగా.. యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీకాకుళం నగరంతో పాటు కంచిలి మండలంలో కొవిడ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. వర్షాలు పడుతుండడంతో సీజల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. సాధారణ జ్వరం వచ్చినా కొవిడ్‌ కలవరం వెంటాడుతోంది. నాలుగో దశ హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. గత అనుభవాల నేపథ్యంలో అప్రతమత్తం కాకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ప్రజల్లో నిర్లక్ష్యం

ప్రజలు మాస్కును మరిచిపోయారు. భౌతిక దూరం అనేది పాటించడం మానేశారు. శానిటైజర్‌ వినియోగం తగ్గించేశారు. అసలు కొవిడ్‌తో ఇబ్బందిపడ్డాం... అనారోగ్యానికి గురయ్యామన్న మాటే మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించడం లేదు. గుంపులుగా సంచరిస్తున్నారు. ఒకేచోట గుమిగూడుతున్నారు. శుభకార్యాలు, పండుగలు, మార్కెట్లు, సినిమా థియేటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు..ఇలా అన్నిచోట్ల వందలాది మంది ఒకేచోట గంటల తరబడి గడువుతున్నారు. రాజకీయ సమావేశాలు, కార్యక్రమాల్లో అయితే చెప్పనక్కర్లేదు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్నినెలల పాటు మరిచిపోయిన శానిటైజర్లు, మాస్క్‌లు, ఆవిరి యంత్రాలకు గిరాకీ పెరిగింది. వాటి కొనుగోలు పెరిగినట్టు మందుల షాపు యజమానులు చెబుతున్నారు.

 యంత్రాంగంలో నిర్లిప్తత

మరోవైపు అధికార యంత్రాంగంలో నిర్లిప్తత కొనసాగుతోంది. నిర్థారణ పరీక్షల వేగం పెంచడం లేదు. గత పది రోజులుగా పరీక్షలు జరుపుతుండడంతో కేసులు బయటపడుతున్నాయి. ఆదివారం మాత్రం పరీక్షలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే ఆదివారం సెలవు కావడం వల్లే చేయడం లేదని అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రితో పాటు స్థానికంగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద పరీక్షలు జరిపేవారు. జిల్లా కేంద్రంలో   ఆర్ట్స్‌ కళాశాల మైదానం, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట సంజీవిని బస్సులో పరీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లాలో అన్ని పీహెచ్‌సీల్లో కొవిడ్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. నమూనాలు సేకరించి శ్రీకాకుళం ల్యాబ్‌కు తరలించాలి. నమూనాల తరలింపులో జాప్యం జరుగుతోంది. అటు శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ల్యాబ్‌లో సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో లేరు. ఏడుగురు ఉండాల్సిఉండగా... అక్కడ మైక్రోబయాలజీ సిబ్బందితోనే కానిచ్చేస్తున్నారు.



Updated Date - 2022-07-06T05:12:09+05:30 IST