America లో ఘోరం.. ఇంటి సీలింగ్ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్స్.. 19 ఏళ్ల భారత యువతి మృతి!

ABN , First Publish Date - 2021-11-30T17:52:32+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. 19 ఏళ్ల భారత యువతి దారుణ హత్యకు గురైంది.

America లో ఘోరం.. ఇంటి సీలింగ్ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్స్.. 19 ఏళ్ల భారత యువతి మృతి!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. 19 ఏళ్ల భారత యువతి దారుణ హత్యకు గురైంది. ఆమె నివాసం ఉంటున్న ఇంటి పై అంతస్తులో చోటు చేసుకున్న కాల్పుల కారణంగా కింది ఫ్లోర్‌లో ఉన్న భారతీయురాలు మృతిచెందింది. సీలింగ్ ద్వారా దూసుకొచ్చిన బుల్లెట్లు కింద నిద్రపోతున్న భారత యువతి శరీరం నుంచి దూసుకెళ్లాయి. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అమెరికాలోని అలబామా రాష్ట్రం మోంట్‌గోమెరీ‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని మరియం సుసాన్ మాథ్యూగా మోంట్‌గోమెరీ పోలీసులు గుర్తించారు. ఆమె స్వస్థలం కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లాలోని నిరాణం. 


ఈ ఘటనపై  మోంట్‌గోమెరీ పోలీసు విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారి జాన్సన్ పప్పాచన్ మాట్లాడుతూ సుసాన్ మాథ్యూ తన ఇంటి పై అంతస్తులో ఉండే వ్యక్తి తుపాకీ నుండి వచ్చిన బుల్లెట్ల కారణంగా చనిపోయినట్లు తెలిపారు. సీలింగ్ నుంచి దూసుకు వచ్చిన బుల్లెట్లు సుసాన్ శరీరం నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. అయితే, అసలు ఈ కాల్పులు ఎలా జరిగాయనే విషయం తెలియాల్సి ఉందని జాన్సన్ పేర్కొన్నారు. కాగా, అక్కడి న్యాయపరమైన లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని కేరళకు తరలించేందుకు సుసాన్ తండ్రి బోబెన్ మాథ్యూ ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో ఆమె స్వగ్రామం నిరాణంలో విషాదం అలుముకుంది. సుసాన్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.    

Updated Date - 2021-11-30T17:52:32+05:30 IST