1932 నాటి బస్సు!

ABN , First Publish Date - 2022-08-14T15:40:23+05:30 IST

అప్పుడెప్పుడో తొంభై ఏళ్ల క్రితం.. నిజాం జమానాలో హైదరాబాద్‌ రోడ్లపై తిరిగిన బస్సు అది!

1932 నాటి బస్సు!

డ్రైవర్‌, కండక్టర్‌ సహా 19 మంది ప్రయాణించే సామర్థ్యం

‘వజ్రోత్సవం’లో భాగంగా ఆర్టీసీ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణ


హైదరాబాద్‌ సిటీ, కవాడిగూడ, (ఆంధ్రజ్యోతి): అప్పుడెప్పుడో తొంభై ఏళ్ల క్రితం.. నిజాం జమానాలో హైదరాబాద్‌ రోడ్లపై తిరిగిన బస్సు అది! ఇన్నాళ్లకు మళ్లీ రోడ్డు మీద కనిపించి నగరవాసులకు కనువిందు చేసింది. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం ట్యాంక్‌బండ్‌పై టీఎ్‌స-ఆర్టీసీ గ్రాండ్‌ బస్‌ పరేడ్‌ నిర్వహించింది. ఇదో మినీ బస్సు. డ్రైవర్‌, కండక్టర్‌తో కలుపుకొని 19 మంది ప్రయాణించవచ్చు లండన్‌కు చెందిన ఆల్బేనియం కంపెనీ ఈ బస్సును తయారు చేసింది. 1932 ఏప్రిల్‌ 18న హైచ్‌వైజెడ్‌223 అనే నంబరుతో రిజిస్టర్‌ అయింది. బస్సు పై భాగంలో ఎన్‌ఎ్‌సఆర్‌ఆర్‌టీడీ(నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణాశాఖ) పేరు ఉంటుంది. అప్పట్లో తొలిసారిగా నగరానికి ఇలాంటివి 27 బస్సులు లండన్‌ నుంచి ప్రత్యేక ఓడల్లో ముంబైకి తెచ్చారు. వీటిని అక్కడి నుంచి ప్రత్యేక శిక్షణ గల డ్రైవర్లు హైదరాబాద్‌కు తెచ్చారు. అదే ఏడాది జూన్‌ 15న  నాటి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌  ఈ బస్సులను ప్రారంభించారు.


అప్పట్లో ఈ వాహనాలను మూడు డిపోలుగా విభజించి నడిపేవారు.  గుల్జార్‌హౌస్‌ నుంచి రాణిగంజ్‌ సహా పలు రూట్లలో తిప్పేవారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ వాహనానికి సెల్ఫ్‌ లేదు. నెట్టడం ద్వారా స్టార్ట్‌ చేసేవారు. వజ్రోత్సవాల సందర్భంగా పరేడ్‌ కోసం ఇంజన్‌ మార్చారు. పరేడ్‌లో ఈ బస్సును ఆర్టీసీ ఉద్యోగి, ఉప్పల్‌ జోన్‌ వర్కషా్‌పకు చెందిన యాదగిరి నడిపారు. ట్యాంక్‌బండ్‌ మీద అల్లూరి విగ్రహం నుంచి బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం దాకా ఆర్టీసీ నిర్వహించిన ఈ పరేడ్‌లో మరో విశేషం కూడా ఉంది. 1944లో ఆర్టీసీలో పనిచేసిన టీఎల్‌ నర్సింహా అనే ఆర్టీసీ మాజీ ఉద్యోగితో కలిసి పరేడ్‌ను టీఎ్‌సఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రారంభించారు. 

Updated Date - 2022-08-14T15:40:23+05:30 IST