చిన వెంకన్న సన్నిధిలో..

ABN , First Publish Date - 2022-10-01T09:21:50+05:30 IST

అమరావతి రాజధానిని ఆకాంక్షిస్తూ రైతులు ఆరంభించిన మహా పాదయాత్ర చిన తిరుపతికి చేరుకుంది. గురువారం సాయంత్రం నుంచీ చిరు జల్లులు కురుస్తుండటంతో పాదయాత్రికులు బస చేసిన ప్రాంతం చిత్తడిగా మారింది.

చిన వెంకన్న సన్నిధిలో..

ద్వారకా తిరుమలకు చేరిన మహా పాదయాత్ర 

ఇతర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు 

దారి పొడవునా స్థానికుల ఆత్మీయ స్వాగతం 

పెరుగుగూడెం నుంచి ద్వారకాతిరుమల వరకు ... 19వ రోజు 16 కిలోమీటర్లు సాగిన యాత్ర 

నేడు పాదయాత్రకు విరామం 


ఏలూరు/ద్వారకాతిరుమల, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిని ఆకాంక్షిస్తూ రైతులు ఆరంభించిన మహా పాదయాత్ర చిన తిరుపతికి చేరుకుంది. గురువారం సాయంత్రం నుంచీ చిరు జల్లులు కురుస్తుండటంతో పాదయాత్రికులు బస చేసిన ప్రాంతం చిత్తడిగా మారింది. శుక్రవారం యాత్ర సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమైనా ఏలూరు జిల్లా దెందులూరు మండలం పెరుగుగూడెం నుంచి ఉదయం 9గంటలకు రైతులు యథావిధిగా ముందుకు కదిలారు. గోపాలపురం నియోజకవర్గంలో స్థానికులు పూల వర్షం కురిపించారు. చిరు జల్లులు కురుస్తున్నా ఖాతరు చేయకుండా రైతులు చిన్నతిరుపతి వైపు కదిలారు. వీరికి వందలాది మంది తోడయ్యారు. దారి పొడవునా వివిధ గ్రామ కూడళ్లల్లో మహిళలు ఎదురేగి వచ్చి సూర్యరథం ముందు పసుపు నీళ్లు పోసి మొక్కుకున్నారు. వయోభారాన్ని లెక్క చేయకుండా వృద్ధులు 19వ రోజు 16కిలోమీటర్ల మేర నడక సాగించగా చిన్నారులు సైతం వీరికి తోడయ్యారు. ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం నుంచి తిమ్మాపురం వరకు దాదాపు 11కిలోమీటర్ల మేర రహదారులు కిక్కిరిశాయి. కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులు సంఘీభావం ప్రకటించారు. దారి పొడవునా రోడ్లపై వాననీటితో నిండి ఉన్న గోతులను దాటుతూనే పాదయాత్ర ముందుకు సాగింది. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేలా తమ కోరిక తీర్చమంటూ చిన్న తిరుపతి పొలిమేరల్లో రైతులు మోకాళ్ల మీద నిలబడి చేతులెత్తి వేడుకున్నారు. తిరుమాపురం కుంకుళ్లమ్మ ఆలయం సమీపాన రోడ్డుపైనే సాష్టాంగ నమస్కారాలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. 19వ రోజు శుక్రవారం రాత్రి చిన్నతిరుపతిలోనే బస చేస్తారు. శనివారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి ఆదివారం ఉదయం యాత్ర ప్రారంభించి ద్వారకాతిరుమల మీదుగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోకి ప్రవేశిస్తారు. 

పైశాచికత్వానికి చరమగీతం: బుచ్చయ్య 

‘కేసీఆర్‌, తెలంగాణ నాయకులతో కుమ్మక్కైన జగన్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. ఆయన పైశాచిక విధానానికి చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి విరుచుకుపడ్డారు. కాగా, రైతుల పాదయాత్ర వల్ల ప్రభుత్వానికి, మంత్రులకు వచ్చిన ఇబ్బందేమిటని జేఏసీ కో-కన్వీనర్‌ తిరుపతిరావు ప్రశ్నించారు. ‘‘ఇప్పటి వరకు అమరావతి పాదయాత్రపై మగ మంత్రులే ఇష్టానుసారం మాట్లాడారు. ఇప్పుడు వారి స్థానంలో రోజాలాంటి వారు విమర్శలు చేస్తున్నారు’’.. అని జేఏసీ సభ్యురాలు రాయపాటి శైలజ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర వస్తే నరికేస్తామంటున్నారు అదేమైనా మీ జాగీరా అని ఆమె ప్రశ్నించారు.


అమరావతే కావాలనేవారి 

చొక్కాలు పట్టుకోండి: మంత్రి అప్పలరాజు 

పలాస, సెప్టెంబరు 30: అమరావతే రాజధాని కావాలని అడిగే దౌర్భాగ్యులు కొంతమంది ఈ ప్రాంతంలో ఉన్నారని, అలాంటి వారిని గ్రామాల్లో చొక్కాలు పట్టుకుని నిలదీయాలని మంత్రి అప్పలరాజు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో శుక్రవారం వైఎ్‌సఆర్‌ చేయూత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశాఖ రాజధాని అయితే అన్ని పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగ అవకాశాలు, ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ప్రజలు విశాఖ రాజధాని కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్‌ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని, ఆయన్ను మళ్లీ సీఎం చేయాలని మహిళలతో మంత్రి అప్పలరాజు ప్రమాణం చేయించారు. 

Updated Date - 2022-10-01T09:21:50+05:30 IST