జిల్లా పోలీసు శాఖకు 2 ఏబీసీడీ అవార్డులు

ABN , First Publish Date - 2020-08-09T10:30:26+05:30 IST

జిల్లా పోలీసుశాఖకు రాష్ట్రస్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. జిల్లాలో రెండు కీలక కేసుల దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసుల ..

జిల్లా పోలీసు శాఖకు  2 ఏబీసీడీ అవార్డులు

ఈనెల 12న అందజేయనున్న డీజీపీ


అనంతపురం క్రైం, ఆగస్టు8: జిల్లా పోలీసుశాఖకు రాష్ట్రస్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. జిల్లాలో రెండు కీలక కేసుల దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసుల సేవలను రాష్ట్ర పోలీసుశాఖ గుర్తించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి అందించే ఏబీసీడీ అవార్డుల్లో జిల్లాకు ఈ సారి రెండు ప్రకటించింది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ఏబీసీడీ అవార్డులను ప్రకటించగా.. జిల్లాను రెండు వరించటం గమనార్హం. వీటిని ఈనెల 12వ తేదీన డీజీపీ చేతుల మీదుగా ఆయా కేసులలో ప్రతిభ కనబరిచిన పోలీసులు అందుకోనున్నారు.


జిల్లాలో తనకల్లు మండలం కొర్తికోట గ్రామంలోని శివాలయంలో గతేడాది ట్రిపుల్‌ మర్డర్‌ (పూజారితో పాటు మరో ఇద్దరిని) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం జోడించి, కేసును ఛేదించారు. ఈ కేసులో కదిరి డీఎస్పీ షేక్‌లాల్‌ అహ్మద్‌, కదిరి రూరల్‌ సీఐ తమ్మిశెట్టి మధు, తనకల్లు ఎస్‌ఐ రంగుడు యాదవ్‌, టెక్నికల్‌ ఎస్‌ఐ క్రాంతికుమార్‌, కానిస్టేబుళ్లు మూర్తి, యాసర్‌ఆలీ ప్రతిభ కనబరిచారు. బుక్కపట్నం మండలం సిద్దరాంపురంలో గతేడాది ఓ గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు చాకచక్యంగా హత్య చేసి, పోలీసులకు ఆనవాళ్లు దొరకకుండా కాల్చేశారు. నెలలోగా ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌, పుట్టపర్తి రూరల్‌ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, బుక్కపట్నం ఎస్‌ఐ విజయకుమార్‌, టెక్నికల్‌ సిబ్బంది కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి కేసును ఛేదించారు. ఆయా కేసుల్లో ప్రతిభ కనబరిచిన వారిందరినీ జిల్లా ఎస్పీసత్యఏసుబాబుతోపాటు రాష్ట్ర స్థాయిలో రెండు ఏబీసీడీ అవార్డులను ప్రకటించి, ప్రశంసించారు.

Updated Date - 2020-08-09T10:30:26+05:30 IST