కేబుల్ కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-04-11T20:18:57+05:30 IST

ఝార్ఖండ్‌లో జరిగిన కేబుల్ కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఝార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లా, త్రికూట్ హిల్స్‌లో ఏర్పాటు చేసిన రోప్‌వే కేబుల్ కార్లకు ప్రమాదం జరిగింది.

కేబుల్ కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఝార్ఖండ్‌లో జరిగిన కేబుల్ కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఝార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లా, త్రికూట్ హిల్స్‌లో ఏర్పాటు చేసిన రోప్‌వే కేబుల్ కార్లకు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు అధికారులు చెప్పారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరు కేబుల్ కార్ల నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరగడంతో మిగతా కార్లు కూడా రోప్‌వేలపైనే నిలిచిపోయాయి. దాదాపు 18 కేబుల్ కార్లు ప్రమాదంలో చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు చేపట్టి 18 మందిని రక్షించారు. ప్రస్తుతం 12 కేబుల్ కార్లలో దాదాపు 30 మంది ఇంకా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కార్లు ఢీకొనేందుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అక్కడ్నుంచి పారిపోయారు. కాగా, బాధితులను రక్షించేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కూడా సాయపడుతోంది. రెండు హెలికాప్టర్లలో బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐఏఎఫ్‌తోపాటు పోలీసులు, స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. త్రికూట్ హిల్స్‌ రోప్‌వే దాదాపు 766 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ పర్వతం 392 మీటర్ల ఎత్తులో ఉంటుంది. రోప్‌వేలో 25 కేబుల్ కార్లు ఉన్నాయి. ఒక్కో కార్‌లో నలుగురు ప్రయాణించవచ్చు. 

Updated Date - 2022-04-11T20:18:57+05:30 IST