నివాస భవనాలపై 500 కేజీల బాంబులు వేసిన రష్యా.. ఇద్దరు చిన్నారుల సహా 18 మంది మృతి

ABN , First Publish Date - 2022-03-08T23:32:50+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది

నివాస భవనాలపై 500 కేజీల బాంబులు వేసిన రష్యా.. ఇద్దరు చిన్నారుల సహా 18 మంది మృతి

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య  యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా సుమీ నగరంలోని నివాస భవనాలపై రష్యా దళాలు 500 కేజీల బాంబులు కురిపించాయని, ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది పౌరులు మరణించారని ఉక్రెయిన్ ఆరోపించింది. 


ఈ మేరకు ఆ దేశ సాంస్కృతిక, ప్రసారశాఖ మంత్రి ట్వీట్ చేశారు. రష్యా పైలట్లు గతరాత్రి మానవత్వానికి వ్యతిరేకంగా మరో నేరానికి పాల్పడ్డారని మంత్రి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. వారు 500 కేజీల బాంబులను నివాస భవనాలపై విడిచిపెట్టారని అన్నారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది మరణించారని, అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారని తెలిపారు. 


చెర్నిహివ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అయితే, అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రష్యా జారవిడిచిన బాంబు ఫొటోను ఉక్రెయిన్ విదేశాంగ వ్యవహారాల మంత్రి దిమిత్రో కులేబా షేర్ చేశారు. ఇది చాలా భయంకరమైన ఘటన అని, 500 కేజీల బాంబును రష్యా నివాస భవనాలపై వేసిందని, అయితే అది పేలలేదని అన్నారు.


అమాయకులను మహిళలను, పురుషులు, చిన్నారులను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా అనాగరిక చర్యల నుంచి తమను ప్రజలను రక్షించేందుకు సాయం చేయాలని వేడుకున్నారు. తమ గగనతలాన్ని మూసివేయడంలో సాయం చేయాలని, రష్యాపై యుద్ధం కోసం విమానాలు అందించాలని, ఏదో ఒకటి చేయాలని వేడుకున్నారు. 

Updated Date - 2022-03-08T23:32:50+05:30 IST