Gujarat: ఫ్యాక్టరీ గోడ కూలి 12 మంది కూలీలు దుర్మరణం

ABN , First Publish Date - 2022-05-18T20:36:30+05:30 IST

గుజరాత్‌లోని మోర్బిలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. హల్వాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని..

Gujarat: ఫ్యాక్టరీ గోడ కూలి 12 మంది కూలీలు దుర్మరణం

అహ్మదాబాద్: గుజరాత్‌లోని మోర్బిలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. హల్వాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక సాల్ట్ ఫ్యాక్టరీ గోడ కూలి 12 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే స్థానిక యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు కాగా, సాల్ట్ ఫ్యాక్టరీ గోడ కూలిపడిన దుర్ఘటనలో 12 మంది మృతి చెందిన విషయాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా ధ్రువీకరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని చెప్పారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు.


ప్రధాని మోదీ సంతాపం

మోర్బీలో జరిగిన దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని, క్షతగాత్రులు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. స్థానిక యంత్రాగం అవసరమైన సహాయసహకారాలు అందిస్తుందని చెప్పారు.

Updated Date - 2022-05-18T20:36:30+05:30 IST