రోజూ 2 లక్షల హోం ఐసొలేషన్‌ కిట్లు

ABN , First Publish Date - 2022-01-19T09:09:17+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. హోం ఐసొలేషన్‌ కిట్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది.

రోజూ 2 లక్షల హోం ఐసొలేషన్‌ కిట్లు

ఇప్పటికే 15 లక్షల కిట్లు జిల్లాలకు 

ఈసారి 5 రోజులకు సరిపడా మందులే 

హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. హోం ఐసొలేషన్‌ కిట్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలకు 15 లక్షల హోం ఐసొలేషన్‌ కిట్లను పంపిణీ చేసింది. తెలంగాణ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ) ఆధ్వర్యంలో రోజూ 2 లక్షల హోం ఐసొలేషన్‌ కిట్లను ప్యాకింగ్‌ చేస్తున్నారు. మరో వారం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే ప్రారంభం కానుంది. ఆలోగా ఆస్పత్రుల స్థాయి నుంచి మొదలుకొని ఏఎన్‌ఎంల స్థాయి వరకు ఈ కిట్లు అందుబాటులో ఉండాలంటూ జిల్లాల డీఎంహెచ్‌వోలకు వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లోని సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ (సీఎంఎ్‌స)లలో లక్ష హోం ఐసొలేషన్‌ కిట్లు, 2 లక్షల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష కిట్లను సిద్ధంగా ఉంచాలని నిర్దేశించింది. రోజూ అంతకు తగ్గకుండా స్టాకు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒకవేళ కిట్లు తగ్గితే ఆమేరకు వెంటనే ఇండెంట్‌ పెట్టాలని డీఎంహెచ్‌వోలకు సూచించారు. కొవిడ్‌ పాజిటివ్‌లతో పాటు లక్షణాలున్న వారికి కూడా కిట్లను పంపిణీ చేయాలని సర్కారు ఆదేశాలిచ్చింది. ఇక సబ్‌ సెంటర్‌ స్థాయి వరకు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష కిట్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు.

 

కిట్లలో 7 రకాల ఔషధాలు..

వైద్య, ఆరోగ్యశాఖ అందిస్తున్న హోం ఐసొలేషన్‌ కిట్‌లలో 7 రకాల ఔషధాలు ఉంటాయి. ఈ జాబితాలో పారాసిటమాల్‌, అజిత్రోమైసిన్‌ లేదా డాక్సిసైక్లిన్‌, ర్యాంటడిన్‌, లివోసిట్రాజిన్‌, విటమిన్‌ బీ, సీ, డీ ఉన్నాయి. ఐదు రోజులకు సరిపడా మొత్తం 65 మాత్రలు ఇస్తున్నారు. రోజూ జ్వరం చూసుకోవాలని, 6 నిమిషాల పాటు సాధారణంగా నడవాలని వైద్యశాఖ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. జ్వరం తగ్గకపోయినా, నడిచినప్పుడు ఆయాసం వస్తున్నా వైద్యుణ్ని సంప్రదించాలని సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఐదు రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉంటే సరిపోతుంది. అందుకు సరిపడా మందులే వాడాలని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కరోనా మూడోవేవ్‌ అంతా ఒమైక్రాన్‌ వేరియంటే ఎక్కువగా ఉంది. దానిపై మోనోక్లోనల్‌ యాంటీబాడీ ఔషధం పనిచేయడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. రెమ్‌డెసివిర్‌ మాత్రమే పనిచేస్తోందన్న వైద్య నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వం పెద్దఎత్తున ఆ ఇంజెక్షన్లను నిల్వ చేసుకుంది. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ వద్ద రెండున్నర లక్షల ఇంజెక్షన్ల స్టాక్‌ ఉంది. అవసరాన్ని బట్టి ఇండెంట్‌ పెట్టుకొని, ఆ ఔషధాన్ని ప్రొక్యూర్‌ చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-01-19T09:09:17+05:30 IST