మృత్యు ఘోష

ABN , First Publish Date - 2022-09-26T07:55:33+05:30 IST

తిరుపతి జిల్లా రేణిగుంటలో మూడంతస్తుల భవనంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వైద్యుడు, ఆయన ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు.

మృత్యు ఘోష

రాష్ట్రంలో 2 ఘోర ప్రమాదాలు

‘అనంత’లో రోడ్డుపక్క సేఫ్టీ గార్డును ఢీకొన్న కారు

కారు ముందు నుంచి వెనక్కి చొచ్చుకుపోయిన రేకు

తల్లీ బిడ్డ దుర్మరణం.. రెండుగా చీలిన చిన్నారి శరీరం

అదుపుతప్పిన కారులోకి దూసుకెళ్లింది

రేణిగుంటలో మూడంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం


తిరుపతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా రేణిగుంటలో  మూడంతస్తుల భవనంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వైద్యుడు, ఆయన ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన డాక్టర్‌ రవిశంకర్‌ రెడ్డి(47) తిరుపతిలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రిలో రేడియాలజి్‌స్టగా పనిచేస్తున్నారు. రేణిగుంటలో కొత్తగా మూడంతస్తుల ఇల్లు నిర్మించుకున్నారు.


గ్రౌండ్‌ ఫ్లోర్‌లో భార్యతో కలసి చిన్నపాటి క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మొదటి అంతస్తులోని వంట గదిలో మంటలు చెలరేగాయి. క్లినిక్‌లో ఉండే వాచ్‌మన్‌ సమీప బంధువు  చూసి వాచ్‌మన్‌కు చెప్పాడు. వాచ్‌మన్‌ వెంటనే వైద్యుని భార్య డాక్టర్‌ అనంతలక్ష్మికి ఫోన్‌ చేసి సమాచారం అందించాడు.  ఆమె కేకలు వేస్తూ భర్త, పిల్లలు ఉన్న గదుల వైపు పరుగులు తీశారు. అప్పటికే మంటలు పెరిగిపోయాయి. స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టి అనంతలక్ష్మిని బయటకు తీసుకొచ్చారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పొక్లెయిన్‌ సాయంతో ఓ పడకగది కిటికీని తొలగించి అందులో ఉన్న వైద్యుని తల్లి సుబ్బమ్మను బయటకు తీసుకొచ్చారు. పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో తండ్రి వారి పడకగది బయటే అగ్నికి ఆహుతై కనిపించాడు. గదిలో పొగచూరుకుని ఊపిరాడక డాక్టర్‌ కుమారుడు సిద్ధార్థ రెడ్డి (12), కుమార్తె కార్తీక (6) మృతి చెందారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు.  





రోడ్డుపక్క సేఫ్టీ గార్డు యమపాశమైంది’


గార్లదిన్నె, సెప్టెంబరు 25: ఆనందంగా సాగుతున్న వారి జీవన ప్రయాణం విషాదాంతమైంది. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం రోజే ఓ తండ్రికి కూతురు దూరమైంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి, ఐరన్‌ సేఫ్టీ గార్డును ఢీకొనడంలో తల్లి, కూతురు దుర్మరణం పాలయ్యారు.


హైదరాబాద్‌లో రామ్‌కోఠి ప్రాంతానికి చెందిన రఘువరన్‌ రాజు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతని భార్య జయంతి (42) అమెజాన్‌ కంపెనీలో పని చేస్తున్నారు. వీరి ఇద్దరు పిల్లలు సంకీర్తన (10) ఏడు, సంకల్ప్‌ ఐదో తరగతి చదువుతున్నారు. వీరు శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రఖ్యాత లేపాక్షి దేవాలయాన్ని దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం కారులో హైదారాబాద్‌ నుంచి బయల్దేరారు. గార్లదిన్నె వద్ద జాతీయ రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న కారు ఆదుపుతప్పి పక్కనే ఉన్న ఐరన్‌ సేఫ్టీ గార్డును ఢీకొంది. దీంతో గార్డు రేకు కారు ఎడమ భాగంలోకి చొచ్చుకుపోయి, వెనుక వైపు నుంచి బయటకు వచ్చింది. ఫలితంగా కారులో ఎడమవైపు ముందు, వెనుక సీట్లలో కూర్చున్న సంకీర్తన, జయంతి శరీరాల్లో నుంచి రేకు చొచ్చుకుపోగా.. చిన్నారి దేహం రెండు భాగాలుగా విడిపోయింది. వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవింగ్‌ చేస్తున్న రఘువరన్‌ రాజు, ఆయన వెనుక సీటులో కూర్చున సంకల్ప్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. గార్లదిన్నె ఎస్‌ఐ సాగర్‌ ప్రమాద స్థలానికి చేరుకుని క్రేన్‌, ఎక్స్‌కవేటర్‌ సాయంతో కారును పక్కకు తీశారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2022-09-26T07:55:33+05:30 IST