ఇతనికి అక్షరం ముక్కరాదు కానీ.. రెండు వేల కోట్లు.. అసలు కథేంటో మీరే చూడండి..!?

ABN , First Publish Date - 2022-05-09T15:46:13+05:30 IST

ఇతనికి అక్షరం ముక్కరాదు.. రెండు వేల కోట్లు కొట్టేశాడు.. అసలు కథేంటో మీరే చూడండి..!?

ఇతనికి అక్షరం ముక్కరాదు కానీ.. రెండు వేల కోట్లు.. అసలు కథేంటో మీరే చూడండి..!?

  • మోసాల మిలీయనీర్‌!
  • పెరుగుతున్న బాధితులు
  • మాయమాటలతో కోట్లు దోచేశాడు

అక్షరం ముక్క రాదు. అయినా సుప్రీంకోర్టు లాయర్‌గా చెలామణి అయ్యేవాడు. కలెక్టర్‌ కార్యాలయంలో గుమస్తాతో కూడా అతడికి పరిచయం లేదు. కానీ.. ప్రధానే తనకు తెలుసని చాలా మందిని నమ్మించాడు. క్రైస్తవ సమాజాన్ని ఉద్దరించడానికి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ప్రతినిధినని చెప్పుకునే వాడు. రెండు వేల కోట్ల ఆస్తి ఉన్న మిలీయనీర్‌నని బిల్డప్‌ ఇచ్చేవాడు. నకిలీ ఐడీలు, పత్రాలను చూపించి బుట్టలో వేసుకున్నాడు. రూ. కోట్లు సేకరించి జారుకున్నాడు. అతడే మిలీయనర్‌ రఘరాం. అతడి మోసాలు రోజురోజుకూ వెలుగుచూస్తూనే ఉన్నాయి.


హైదరాబాద్‌ సిటీ : మై ఫౌండేషన్‌, చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవ పేరుతో  జనాలను ముంచిన మిలియనీర్‌ లీలలు మరిన్ని వెలుగు చూశాయి. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బ్లాంక్‌ చెక్కులతో బ్లాక్‌మెయిల్‌ దేశంలో క్రిస్టియన్ల అభివృద్ధి కోసం విదేశాల నుంచి కోట్ల డబ్బు వస్తోందని, స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకుంటే ఆ డబ్బును ఆ సంస్థల్లో డిపాజిట్‌ చేయిస్తానని ప్రజలను నమ్మించాడు నెల్లూరుకు చెందిన రఘరాం. మిలీయనర్‌లా ప్రచారం చేసుకుంటూ స్వచ్ఛంద సంస్థలను రిజిస్టర్‌ చేయించేవాడు. బాధితుల నుంచి కొంత డబ్బుతో పాటు రెండు బ్లాంక్‌ చెక్కులను తీసుకునేవాడు.


అతడి మోసాలను గుర్తిం చి ప్రశ్నించిన వారిని బెదిరించేవాడు. ఇప్పుడు తాజాగా కొం దరు చెక్‌ బౌన్సింగ్‌ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మరోవైపు తన సంస్థలో ఉద్యోగాలు అంటూ హడావిడి చేసిన రఘురాం కోట్లు కొల్లగొట్టాడు. అమీర్‌పేట్‌లోని కార్యాలయం వేదికగా ఇంటర్వూలు చేసి సెలెక్ట్‌ అయిన వారికి రూ. 8 లక్షల జీతం, విల్లా, లగ్జరీ కారు ఆశ పెట్టాడు. డైరెక్టర్‌, కోర్‌ కమిటీ మెంబర్‌గా నియమించేవాడు. అయితే.. నియమితులైన వారు పెద్ద ఎత్తున డబ్బు కాంట్రిబ్యూషన్‌ వచ్చేలా చేయాలని షరతు విధించేవాడు. నెలకు లక్షల్లో జీతం వస్తోందన్న ఆశతో జిల్లా స్థాయిలో ఉండే కమిటీల నుంచి రూ. కోట్లు వసూలు చేసి అతడికి ఇచ్చారు.


రెండు వేల కోట్లు?

తన వద్ద అక్షరాలా రెండు వేల కోట్లు ఉన్నాయని గొప్పలు చెప్పుకున్న రఘురాం తనను క్రిస్టియన్‌ కమ్యూనిటీకి సేవ చేయమని ఆస్ట్రేలియా నుంచి ప్రతినిధులు ఇక్కడికి పంపారని నమ్మించాడు. నకిలీ డాక్యుమెంట్లు తన వద్దకు వచ్చే వారికి చూపించేవాడు. సంస్థలో పని చేసే ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు అంటూ సీఎస్‌ సంతకం ఫోర్జరీ చేసి బాధితులకు చూపించి డబ్బు వసూలు చేశాడు. అంతేకాకుండా ఆర్‌బీఐ వద్ద నిధులు స్టక్‌ అయ్యాయని, ఈ మేరకు ప్రధానికి లేఖ రాశానని నకిలీ పత్రాలు చూపించి జనాలను బురిడీ కొట్టించాడు. టోలిచౌకికి చెందిన డాక్యుమెంట్‌ రైటర్‌ ఫోర్జరీ చేయడంలో మిలియనీర్‌కు సహకరించాడని సమాచారం.


గొప్పలు చెప్పుకుంటూ మోసాలు

హైటెక్‌ సిటీలో అంత్యత విలువైన స్థలంలో ఆరు అంతస్తుల లగ్జరీ భవనాన్ని నిర్మించబోతున్నానని, భవనం ప్రారంభానికి ప్రధాని రాబోతున్నారని ప్రచారం చేసేవాడు. అతని హంగు ఆర్భాటం చూసి నిజం అని నమ్మిన కొందరు స్వచ్ఛం ద సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా సేకరించిన డబ్బును అతడికి ఇచ్చారు. అతడు పెద్ద మోసగాడు అని తెలిసి ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 

Read more