పెట్రోల్‌లో 20% ఇథనాల్‌

ABN , First Publish Date - 2022-05-19T08:03:26+05:30 IST

చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

పెట్రోల్‌లో 20% ఇథనాల్‌

లక్ష్యం గడువును ఐదేళ్లు తగ్గించిన కేంద్రం


2025-26 నాటికే అమలుచేయాలని నిర్ణయం

పీఎస్‌యూ యూనిట్లపై డైరెక్టర్ల బోర్డులకు అధికారాలు.. కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు


న్యూఢిల్లీ, మే 18 (ఆంధ్రజ్యోతి): చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌లో 20శాతం వరకు ఇథనాల్‌ను కలపడానికి లక్ష్యంగా పెట్టుకున్న గడువును ఐదేళ్లు తగ్గించింది. తాజా నిర్ణయాన్ని అనుసరించి 2025-26 నాటికే ఈ లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకొస్తారు. అంతకుముందు దీనికి గడువును 2030గా కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ జీవ ఇంధన విధానంలో ప్రతిపాదించిన సవరణలను బుధవారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. ప్రస్తుతం పెట్రోల్‌లో 10శాతం వరకు ఇథనాల్‌ను కలపడానికి అనుమతిస్తున్నారు. అలాగే... దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజడ్‌) ద్వారా జీవ ఇంధనాల ఉత్పత్తిని ప్రోత్సహించాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రస్తుతం భారత్‌ 85శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా తాజా నిర్ణయాలను అమలుచేస్తారు. అదేవిధంగా... కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జీవ ఇంధనాల ఎగుమతులను అనుమతించడానికి క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 2047 నాటికి ఇంధన రంగంలో స్వావలంబన సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ నిర్ణయాలు తోడ్పడతాయని కేంద్రం పేర్కొంది. క్యాబినెట్‌ నిర్ణయంతో మేకిన్‌ ఇండియా కార్యక్రమం ఊపందుకుంటుందని, జీవ ఇంధన రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు.


పీఎ్‌సయూ డైరెక్టర్ల బోర్డులకు మరిన్ని అధికారాలు

ప్రభుత్వరంగ సంస్థల యూనిట్లు, వాటి అనుబంధ కంపెనీల అమ్మకం, పెట్టుబడుల ఉపసంహరణ విషయాల్లో ఆయా సంస్థల మాతృ లేదా హోల్డింగ్‌ కంపెనీల డైరెక్టర్ల బోర్డుకు నిర్ణయాధికారం కల్పించాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. దీన్ని అనుసరించి ఆయా యూనిట్లు, అనుబంధ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ, కంపెనీలను మూసివేయటం, జాయిం ట్‌ వెంచర్లలో వాటాలను సిఫారసు చేయడం, మైనారిటీ వాటాలను అమ్మడం వంటి అంశాల్లో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు విస్తృత అధికారాలు లభిస్తాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పెట్టుబడుల ఉపసంహరణ, మూసివేత ప్రక్రియలు పారదర్శంగా, కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ సూత్రాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది.

ఈ విషయంలో కేంద్ర విభాగాలు రూపొందించిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. తాజా నిర్ణయాలతో పీఎ్‌సయూల పనితీరు మెరుగవుతుందని, వేగంగా నిర్ణయాలు తీసుకుని నష్టాలను నివారించవచ్చని క్యాబినెట్‌ అభిప్రాయపడింది. కాగా.. కేంద్ర నిర్ణయంతో ప్రైవేటీకరణ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. అలాగే పీఎ్‌సయూల ఆస్తుల అమ్మకాలు యధేచ్చగా కొనసాగనున్నాయి. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండి యా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థల కీలకేతర ఆస్తులను ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక కంపెనీలకు బదిలీ చేసింది. ఇక ఆయా కంపెనీల బోర్డులు ఈ ఆస్తులను బిడ్డింగ్‌ ద్వారా త్వరలో అమ్మకానికి పెట్టే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్‌ సహా అనేక నగరాల్లో ఉన్న పలు పీఎ్‌సయూల భూములనూ బిడ్డింగ్‌ ద్వారా అమ్మే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated Date - 2022-05-19T08:03:26+05:30 IST