ఊరికి 20 పనులే..!

ABN , First Publish Date - 2022-08-09T05:11:44+05:30 IST

ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.

ఊరికి 20 పనులే..!

  • ఉపాధి హామీలో కొత్త షరతులు
  • హరితహారం మినహాయింపు
  • 20 పనులకు మించి చేయాలంటే కమిటీ ఆమోదం తప్పనిసరి
  • ఉదయం, సాయంత్రం రిజిస్టర్‌లో కూలీలు సంతకం చేయాలి
  • ఉపాధి పథకం సాఫ్ట్‌వేర్‌, మస్టర్‌ యాప్‌లో మార్పులు


ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఏడాదిలో ఒక గ్రామంలో 20కి మించి పనులు చేయరాదని పేర్కొంది. దీనికిగాను ఉపాధి హామీ పథకం సాఫ్ట్‌వేర్‌, మస్టర్‌ యాప్‌లో మార్పులు చేసింది. కొత్త నిబంధనలు తీసుకురావడంతో పనిదినాలు తగ్గి కూలీలు ఉపాధి కోల్పోయే అవకాశముంది. అంతేకాకుండా కూలీలు పనిచేసేచోట రోజూ ఉదయం, సాయంత్రం సంతకం పెట్టడం.. కొత్తగా బ్యాంక్‌ అకౌంట్లు తీయాలన్న నిబంధనలతో కూలీలు అవస్థలు పడుతున్నారు.


రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 8 : గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలకు ఉపాధి కల్పించి, వలసలను అరికట్టేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఇబ్బందికరంగా మారడంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఆమోదం తెలిపిన పనులే చేయడం, పనిచేసే ముందు... చేశాక రెండుసార్లు రిజిస్టర్‌లో సంతకం చేయాలనడం... దీనికితోడు గతంలో ఇచ్చిన జీరో బ్యాంకుఖాతాలు చెల్లవంటూ.. కొత్త బ్యాంకులో గానీ.. పోస్టాఫీసులో మళ్లీ ఖాతా తెరవాలని సూచించడమే సమస్యగా మారిందని కూలీలు వాపోతున్నారు. 

రంగారెడ్డి జిల్లాలో మొత్తం జాబ్‌కార్డులు 1,77,629 ఉండగా.. 3,1028 మంది కూలీలు ఉన్నారు. 2022-23 సంవత్సరంలో 46.75 లక్షలు పనిదినాలు కల్పించడం లక్ష్యం కాగా.. ఈఏడాది జూలై వరకు 21.74 లక్షల పనిదినాలు కల్పించారు. అందులో ప్రధానంగా నీటి కుంటలు, భూమి చదును, మట్టి రోడ్ల నిర్మాణం, డంపింగ్‌ యార్డుల నిర్మాణం, కందకాలు తవ్వడం, శ్మశాన వాటికల ఏర్పాటు, రైతు పొలాల్లో కల్లాలు, రైతు వేదికల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంకా 5,057 పనులు పురోగతిలో ఉన్నాయి. ఇక నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అవసరాలకు అనుగుణంగా ఒక గ్రామంలో ఎక్కువ, తక్కువ పనులు చేసేందుకు అవకాశం లేకుండా ఏడాదిలో ఒక గ్రామంలో 20కి మించి పనులు చేయరాదని పేర్కొంది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడాన్ని మినహాయింపు ఇస్తూ ఉపాధి హామీ ద్వారా గ్రామంలో చేపట్టే డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక, ఇంకుడు గుంతలు, గొర్రెలు, బర్రెల షెడ్లు, కల్లాలు, కిచెన్‌ షెడ్లు వంటి పలురకాల అభివృద్ధి పనుల సంఖ్య 20కి మించి అనుమతి లేదు. దీనికిగాను ఉపాధి హామీ పథకం సాఫ్ట్‌వేర్‌, మస్టర్‌ యాప్‌లో మార్పులు వచ్చాయి. అలాగే గ్రామానికి 20పనులకు మించి చేయాలంటే కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఆమోదంతో పనులు చేపట్టాల్సి ఉంటుంది. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను క్షేత్రస్థాయిలో ఉన్న పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్‌ అసిస్టెంట్లు, అధికార యంత్రాంగం కృషి చేయాలి.

 

పనిదినాలు కోల్పోయే అవకాశం

గతంలో పెద్దఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టడంతో ఎక్కువ మంది కూలీలకు పనులు దొరికేవి. కానీ, ప్రస్తుతం ఒక్కో గ్రామంలో 20 పనులు చేయాలని నిబంధనతో కూలీలకు నష్టం జరిగే అవకాశాలున్నాయంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ ప్రవేశ పెట్టడంతోపాటు కొత్త నిబంధనలు తీసుకురావడంతో పనిదినాలు తగ్గి కూలీలు ఉపాధి కోల్పోయే అవకాశముంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టగా, ప్రస్తుతం నిర్దేశించిన పనులను మాత్రమే చేయాల్సి ఉందంటున్నారు. 


ఉదయం, సాయంత్రం సంతకం తప్పనిసరి

ఉపాధిహామీ పథకంలో కూలీలు పనిచేసేచోట రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం సంతకం పెట్టాలి. లేకపోతే కూలీ డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. దీంతోపాటు పనిచేసేచోట 20 మంది కూలీల కంటే ఎక్కువగా ఉంటే ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలనే నిబంధనతో ఆందోళన చెందుతున్నారు.


అకౌంట్‌ అవస్థలు

గతంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్‌ ఉండాలని పేదలకు ఎలాంటి డిపాజిట్‌ లేకుండానే కేంద్ర ప్రభుత్వం జీరో అకౌంట్‌ తీసింది. ఈ అకౌంట్‌ సేవింగ్‌ అకౌంట్‌ మాదిరిగా పనిచేస్తుందని అప్పట్లో అధికారులు తెలిపారు. దీంతో పల్లెల్లో ప్రజలు ఇబ్బడిముబ్బడిగా జీరో అకౌంట్లను ఓపెన్‌ చేశారు. ఇదే అకౌంట్‌ ద్వారా ఉపాధి కూలీలకు బిల్లులు సైతం ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఆ అకౌంట్‌ పనిచేయదని, ప్రతీ కూలీ సేవింగ్‌ అకౌంట్‌ను ఇవ్వాలనడంతో ఇబ్బంది పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు పనిచేసిన అకౌంట్‌ ఇప్పుడు ఎందుకు పనిచేయదని, వేయి రూపాయలు ఖర్చు చేసి అకౌంట్‌ తీయమనడం సరైంది కాదని కొందరు కూలీలు మండి పడుతున్నారు. మరి కొంతమంది కూలీలు తప్పని పరిస్థితుల్లో వేయి చెల్లించి సేవింగ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తున్నారు. డబ్బులు లేని కూలీలు పోస్టాఫీస్‌ ద్వారా అకౌంట్‌ తెరుస్తున్నారు. 


ఊరికి 20 పనులే చేయాలి 

అవసరాలకనుగుణంగా ఒక గ్రామంలో ఎక్కువ, తక్కువ పనులు చేసేందుకు అవకాశం లేదు. ఊరికి 20 పనులే చేయాల్సి ఉంటుంది. హరితహారం పథకాన్ని మినహాయింపు ఇవ్వడం జరిగింది. కూలీలు పనిచేసేచోట ఉదయం, సాయం త్రం రిజిస్టర్‌లో సంతకం చేయాల్సి ఉంటుంది. జీరో అకౌంట్‌ ఖాతాలకు బదులుగా కొత్తగా పోస్టాఫీసులో కూలీలు ఖాతాలు ఓపెన్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 10వేల మందికి పైగా ఖాతాలు తెరిచారు. 

- నీరజ, జిల్లా ఉపాధిహామీ అధికారి 


పోస్టాఫీసులో ఖాతా ఓపెన్‌ చేశాను

కెనరా బ్యాంకులో అకౌంట్‌ ఉంది. అందులోనే ఉపాధి హామీ కూలీ డబ్బులు జమ అయ్యేవి. ఆ అకౌంట్‌ పనిచేయదని చెప్పారు. మళ్లీ అకౌంట్‌ తెరవమన్నారు. అకౌంట్‌ కోసం వేయి రూపాయలు లేక పోవడంతో పోస్టాఫీసులో ఖాతా ఓపెన్‌ చేశాను. గతంలో పనిచేసిన డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. అవి వస్తాయో రావోనని భయంగా ఉంది. 

- ఉమాదేవి, ఉపాధి కూలీ, కొండారెడ్డిపల్లి 


ఉదయం, సాయంత్రం సంతకాలతో ఇబ్బందిగా ఉంది

ఉపాధిహామీ పథకంలో ఉదయం, సాయంత్రం సంతకాలు చేయాల్సి వస్తుంది. ఫొటో అప్‌లోడ్‌ చేయాలంటున్నారు.  నిబంధనలు మారుతున్నాయి. బ్యాంక్‌ అకౌంట్‌ తీయమన్నారు. పోస్టాఫీసులో అకౌంట్‌ తీశాను. అకౌంట్‌ కోసం రెండు మూడు రోజులు తిరగాల్సి వచ్చింది. 

- కృష్ణ, ఉపాధి కూలీ, కాకునూరు 


Updated Date - 2022-08-09T05:11:44+05:30 IST