Air India: యూఎస్, యూకే వెళ్లేవారికి ఎయిరిండియా తీపి కబురు.. ఇకపై వీక్లీ అదనపు విమాన సర్వీసులు!

ABN , First Publish Date - 2022-10-02T16:38:48+05:30 IST

భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) అమెరికా, బ్రిటన్ వెళ్లేవారికి తాజాగా తీపి కబురు చెప్పింది.

Air India: యూఎస్, యూకే వెళ్లేవారికి ఎయిరిండియా తీపి కబురు.. ఇకపై వీక్లీ అదనపు విమాన సర్వీసులు!

న్యూఢిల్లీ: భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) అమెరికా, బ్రిటన్ వెళ్లేవారికి తాజాగా తీపి కబురు చెప్పింది. యూకేలోని రెండు నగరాలు, యూఎస్‌లో ఒక నగరానికి కలిపి వారానికి అదనంగా 20 విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ నగరంతో పాటు రాజధాని లండన్‌కు అదనంగా విమాన సర్వీసులు నడపనుంది. అలాగే అగ్రరాజ్యంలోని శాన్ ఫ్రాన్సిస్కోకు నగరానికి కూడా నడపాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఈ మూడు గమ్యస్థానాలకు ప్రయాణికుల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. అంతేగాక అంతర్జాతీయంగా తమ సర్వీసులను పెంచుకోవడానికి కూడా ఇది దోహదపడుతుందని పేర్కొంది. ఇక ఈ మూడు గమ్యస్థానాలకు అదనపు విమానాలను అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు దశలవారీగా ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టనుంది. 


మొత్తంగా ఈ మూడు నగరాలకు కలిపి వారానికి అదనంగా 20 విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించింది. వీటిలో బర్మింగ్‌హామ్‌కు ఐదు, లండన్‌ (London)కు తొమ్మిది, శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి ఆరు అదనపు విమానాలు నడపనుంది. తద్వారా వారానికి అదనంగా 5వేల సీట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా వెల్లడించింది. దీంతో ప్రయాణికులకు కనెక్టివిటీ, సౌలభ్యం, క్యాబిన్ స్పేస్ పరంగా మరింత ఛాయిస్ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్‌ (Britain)కు ప్రతి వారం 34 విమానాలు నడుపుతున్న ఎయిర్ ఇండియా తాజాగా అదనంగా 14 విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించడంతో ఈ సంఖ్య 48కి చేరుకుంటుంది. అలాగే అమెరికా (America)కు ప్రస్తుతం వీక్లీ 34 విమాన సర్వీసులు ఉండగా.. తాజాగా ప్రకటించిన ఆరు అదనపు విమానాలతో కలిసి ఈ సంఖ్య 40 అవుతుంది.   


ఇక బర్మింగ్‌హామ్‌కు ప్రకటించిన వీక్లీ అదనపు ఐదు విమాన సర్వీసుల్లో మూడు దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయితే, మరో రెండు గోల్డెన్ సిటీ అమృత్‌సర్ (Amritsar) నుంచి వెళ్తాయి. అలాగే లండన్ నగరానికి వీక్లీ వెళ్లే తొమ్మిది అదనపు విమానాల్లో ఐదు దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి, మూడు ఢిల్లీ నుంచి, ఒకటి అహ్మదాబాద్ నుంచి ఉన్నాయి. ఇక శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రకటించిన ఆరు అదనపు విమానాల్లో మూడు ముంబై నుంచి అయితే, మరో మూడు బెంగళూరు నగరం నుంచి వెళ్తాయని ప్రకటించింది.   

Updated Date - 2022-10-02T16:38:48+05:30 IST