20 వేల యాక్టివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-04-12T08:22:03+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విచ్చలవిడిగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 31,719 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,495 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కరోనాతో 9 మంది మృతి

20 వేల యాక్టివ్‌ కేసులు

కొత్తగా 3,495 కేసులు.. 9 మరణాలు

15 శాతానికి ఎగబాకిన పాజిటివ్‌ రేటు

టెస్టులు 2 వేలకు మించొద్దని ఆరోగ్యశాఖ ఆదేశం

కొవిడ్‌తో తెలుగు జర్నలిస్టు మృతి

హోం క్వారంటైన్‌కు పవన్‌ కల్యాణ్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విచ్చలవిడిగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 31,719 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,495 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కరోనాతో 9 మంది మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 9,25,401కి చేరుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 20 వేల మార్కుని దాటేశాయి. మార్చి 10న రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,064గా ఉండగా.. ఇప్పుడది 20 రెట్లు పెరిగి 20,954కి ఎగబాకింది.


చిత్తూరు జిల్లాలో కొవిడ్‌ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ జిల్లాలో ఒక్కరోజే 719 మందికి వైరస్‌ సోకగా.. గుంటూరులో 501, విశాఖపట్నంలో 405, కృష్ణాలో 306, శ్రీకాకుళంలో 293, ప్రకాశంలో 215, అనంతపురంలో 209 కేసులు నమోదయ్యాయి. ఆదివారం కొత్తగా 1,198 మంది డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం రికవరీల సంఖ్య 8,97,147కి చేరుకుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో నలుగురు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీంతో కరోనా మరణాలు 7,300కి పెరిగాయి. 


కేసులకు తగ్గట్టు టెస్టులేవీ..?

ఒకవైపు కరోనా కేసులు విపరీతంగా దూసుకెళ్తున్నా.. అందుకు తగ్గట్టు కొవిడ్‌ టెస్టులు మాత్రం పెరగడం లేదు. ప్రతి జిల్లాలోనూ రోజుకు రెండు లేదా మూడు వేలకు మించి టెస్టులు చేయవద్దని ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం ఇచ్చిన మౌఖిక ఆదేశాలను కలెక్టర్లు పక్కాగా అమలు చేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి ఏ రోజు కూడా 32 వేలకు మించి కరోనా టెస్టులు చేసిన పరిస్థితి లేదు. గతంలో ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా టెస్టు చేయించుకునే వారిలో కనీసం 30 శాతం మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయేది. ప్రస్తుతం అది 50 శాతానికి పెరిగింది. ప్రభుత్వం చేస్తున్న రోజువారి టెస్టింగ్‌ల్లోనూ పాజిటివ్‌ రేటు 10-15 శాతం పెరుగుతోంది. ప్రతి ఇంటిలోనూ జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచాల్సిన ఆరోగ్యశాఖ ఇంకా కుదించే ప్రయత్నం చేస్తోంది.


కరోనాతో తిరుమలవాసి మృతి

తిరుపతిలోని రుయా కొవిడ్‌ ఆస్పత్రిలో తిరుమలవాసి కరోనాక చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఆస్పత్రి సిబ్బంది ఆ మృతదేహాన్ని ఐసీయూ నుంచి మార్చురీకి తరలించడంలో నిర్లక్ష్యం వహించారు. మృతదేహం రెండు గంటలకుపైగా వార్డులోని బెడ్‌పైనే ఉండటంతో మిగిలిన కరోనా బాధితులు ఆందోళనకు గురయ్యారు. ఆ దృశ్యాన్ని వీడియోతీసి.. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడంతో విషయం వెలుగులోకొచ్చింది. 


సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు తిరుపతిలో జారీ చేసే టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లు సోమవారం నుంచి టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. కాగా, ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, ఆన్‌లైన్‌ వర్చువల్‌ సేవలు పొందిన భక్తులతోనే శ్రీవారి దర్శనాలు కొనసాగనున్నాయి. కేసులు సంఖ్య అధికమైతే వాటిని కూడా రద్దు చేస్తామని టీటీడీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.


వ్యాక్సిన్‌ వేసుకుంటే బిర్యానీ..

కొవిడ్‌ వ్యాక్సిన్‌కు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపడంలేదు. ఈ నేపథ్యంలో విజయనగరం హలో కిచెన్‌ సంస్థ అధినేత ప్రతాప్‌ కోలగట్ల టీకా వేసుకున్న వారికి బిర్యానీ అందిస్తామని ప్రకటించారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా వ్యాక్సిన్‌ వేయించుకున్న వ్యక్తి మొబైల్‌ నంబర్‌కు వచ్చే కన్ఫర్మేషన్‌ మెసేజ్‌, ఆధార్‌ కార్డు తీసుకొని వస్తే బిర్యానీ ఇస్తామని ఆయన ప్రకటించారు. ఈ ఆఫర్‌ రోజుకు వంద మందికే వర్తిస్తుందని పేర్కొన్నారు.

Updated Date - 2021-04-12T08:22:03+05:30 IST