రేషనో.. జగనన్న!

ABN , First Publish Date - 2021-03-01T08:37:04+05:30 IST

డోర్‌ డెలివరీ విధానం ప్రజాపంపిణీ వ్యవస్థను 20 ఏళ్లు వెనక్కి నెట్టింది. ఈ విధానంలో పేదలు ఒక్కరోజు కూలి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదని జగన్‌ ప్రభుత్వం ఆర్భాటం చేసింది. కా

రేషనో.. జగనన్న!

కూలి మానుకుని ఇంటివద్ద పడిగాపులు

నెల మారినా 20 లక్షల కార్డులకు సరుకుల్లేవ్‌ 

పట్టణాల్లోనూ అసంపూర్తిగానే పంపిణీ 

తొలిసారిగా ఇన్ని రోజుల ఎదురుచూపులు 

పంపిణీలో అడుగడుగునా అవాంతరాలు

ఆసక్తి చూపని వాహనాల డ్రైవర్లు 

సరుకులు ఇవ్వాలని డీలర్లపై అధికారుల ఒత్తిళ్లు 


డోర్‌ డెలివరీ విధానం ప్రజాపంపిణీ వ్యవస్థను 20 ఏళ్లు వెనక్కి నెట్టింది. ఈ విధానంలో పేదలు ఒక్కరోజు కూలి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదని జగన్‌ ప్రభుత్వం ఆర్భాటం చేసింది. కానీ, వారు మాత్రం రోజుల తరబడి ఇళ్ల వద్దే ఉంటూ సరుకుల కోసం పడిగాపులు కాస్తున్నారు. గడప వద్దకే రేషన్‌ అని పాలకులు చెప్పినా... సందు చివర్లలో కార్డుదారులు బారులు తీరుతున్నారు. చివరికి పంట పొలాల్లోనూ రేషన్‌ కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. మొన్నటి వరకూ డీలర్‌ వద్దకు ఇలా వెళ్లి... అలా సరుకులు తెచ్చుకునేవారు. ఇప్పుడు రేషన్‌ అసలు ఎప్పుడిస్తారో కూడా తెలియడం లేదు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో రేషన్‌ సరుకుల పంపిణీ ఓ ప్రహసనంలా మారింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమంటూ వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్‌ డోర్‌ డెలివరీ విధానంలో నెల మారినా పంపిణీ మాత్రం పూర్తికాలేదు. అడుగడుగునా అవాంతరాలతో ఇంకా దాదాపు 20 లక్షల కార్డులకు ఫిబ్రవరి సరుకులు అందనేలేదు. మార్చి వస్తున్నా ఇంకా ఫిబ్రవరి రేషన్‌ అందకపోవడంపై కార్డుదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.


ప్రజాపంపిణీ వ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక నెలలో అందాల్సిన రేషన్‌ను తర్వాత నెలలో అందుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్‌ కార్డులున్న కుటుంబాలుంటే ఇప్పటివరకూ 1.05 కోట్ల కుటుంబాలకు మాత్రమే సరుకులు అందాయి. ఇంకా 40 లక్షల కుటుంబాలకు రేషన్‌ అందాలి. ప్రతినెలా  సరుకులు తీసుకునేవారి సగటు ప్రకారం చూసినా 20 లక్షల కుటుంబాలు సరుకులు అందుకోవాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభమైనందున జాప్యం జరిగిందని అధికార వర్గాలు చెబుతున్నా... పట్టణాల్లోనూ ఇప్పటికీ పంపిణీ పూర్తి కాలేదు. ఫిబ్రవరిలో చివరి రోజైన ఆదివారం కూడా రేషన్‌ బండి వస్తుందని అనేకమంది ఎదురుచూసినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం తీసుకొచ్చిన డోర్‌ డెలివరీతో దాదాపు 1.2 కోట్ల మంది పేదలు రాయుతీ సరుకులకు దూరమయ్యారు. 


ప్రజాపంపిణీ 20 ఏళ్లు వెనక్కి 

రేషన్‌ పంపిణీ ప్రారంభించిన తొలినాళ్లలో కార్డుదారులకు సరైన అవగాహన లేకపోవడంతో నాలుగైదు రోజులకే సరుకులు అయిపోయాయని డీలర్లు ఆపేసేవారు. దీంతో తొలిరోజు నుంచే పేదలు క్యూలు కట్టేవారు. తర్వాత 1నుంచి 15వ తేదీ వరకు సరుకులు ఇచ్చే విధానం అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి నెలలో మొదటి పదిరోజుల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్లి సరుకులు తీసుకుంటున్నారు. తర్వాత ఐదు రోజుల్లోనూ ఎవరైనా మిగిలిపోతే వారికీ సరుకులు అందుతున్నాయి. కూలీ పనులు చేసుకునే పేదలు ఉదయమో, సా యంత్రమో తమకు వీలైనప్పుడు సరుకులు తీసుకునేవారు. అయితే డోర్‌ డెలివరీ విధానం ప్రజాపంపిణీ వ్యవస్థను మళ్లీ 20 ఏళ్ల వెనక్కు నెట్టింది. సరిగ్గా బండి వచ్చే సమయానికి కార్డుదారు ఇంటి వద్ద ఉంటే తప్ప రేషన్‌ ఇస్తారన్న గ్యారెంటీ లేదు. ఫలానా రోజు రేషన్‌ వాహనం వీధిలోకి వస్తుందన్న సమాచారం ఉండదు. ఒకట్రెండు చోట్ల సమాచారం ఇచ్చినా అంతకుముందు రోజు ఇచ్చిన వీధిలో కార్డులు మిగిలిపోతే, ఇక బండి కోసం ఎదురుచూస్తూ కూర్చోవాల్సిందే. ఈ తతంగం అంతా దాటుకుని రేషన్‌ చేతికి అందాలంటే ఇంట్లో ఎవరో ఒకరు పనులు మానుకుని నాలుగైదు రోజులు ఇంటి వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇంతచేసినా కనీసం ఇంటి ముందుకే రేషన్‌ వస్తుందా అంటే అదీ లేదు. సందు చివరికో, పక్క వీధికో వెళ్లి సరుకులు మోసుకొచ్చుకోవడం కార్డుదారులకు తప్పడం లేదు. ప్రశాంతంగా రేషన్‌ షాపునకు వెళ్లి సరుకులు తెచ్చుకొనే విధానాన్ని సర్కారు పెద్ద తలనొప్పిగా మార్చిందన్న ఆరోపణలొస్తున్నాయి. 


ఇప్పటికీ డ్రైవర్ల అనాసక్తి 

వాహనాల డ్రైవర్లకు వేతానాన్ని రూ.16వేల నుంచి ఒకేసారి రూ.5వేలు పెంచి రూ.21వేలు చేసినా వారు పంపిణీపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇదేదో పది, పదిహేను రోజుల్లో అయిపోతుందని భావించామని, నెలంతా ఇవ్వాలంటే తమవల్ల కాదంటూ ఎక్కడికక్కడ పంపిణీ నిలిపివేస్తున్నారు. తాము కట్టిన నగదు వెనక్కిస్తే ఈ ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతామంటూ పలువురు డ్రైవర్లు తేల్చిచెబుతున్నారు. మరికొందరు సమయం కుదిరినప్పుడే రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. ఇలాగైతే రెండు నెలలైనా పంపిణీ పూర్తికాదని భావించిన అధికారులు వారం రోజుల నుంచి డీలర్లపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ నెలకు మిగిలిన కార్డులకు పంపిణీ పూర్తిచేయాలని టార్గెట్లు విధించారు. డీలర్లు చొరవ తీసుకోవడంతోనే ఈ మాత్రం అయినా పంపిణీ జరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 


డీలర్ల సమస్యలు పరిష్కరించాలి 

రాష్ట్రంలో డీలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, తమకు న్యాయం చేయాలని రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంఘం కోరింది. తమకు న్యాయం చేసేలా చూడాలంటూ ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌కు ఆ సంఘం ప్రతినిధులు లీలా మాధవరావు, అడపా వెంకటరమణ, ఉమాగౌరీ తదితరులు ఆదివారం విజయవాడలో వినతిపత్రం సమర్పించారు. డీలర్లకు వృత్తి భద్రత కల్పించాలని, గతంలో పంపిణీ చేసిన కమీషన్‌ బకాయిలు విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. 


పొలాల్లోనూ పంపిణీ

మార్చి రావడంతో మరో ఒకట్రెండు రోజుల్లో ఫిబ్రవరి నెల రేషన్‌ పంపిణీ ముగియబోతోంది. దీంతో సరుకులు అందని పేదల్లో ఆందోళన మొదలైంది. ఇక సరుకులు అందవేమోనన్న భయంతో శని, ఆదివారాల్లో పలు చోట్ల రేషన్‌ వాహనాల ఎదుట కార్డుదారులు బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా పంట పొలాల్లోనే పంపిణీ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. రేషన్‌ వాహనాల సామర్థ్యం చాలకపోవడంతో పలుచోట్ల మెరక ప్రాంతాల్లోకి వెళ్లేందుకు మొరాయిస్తున్నాయి. దీంతో బళ్లు ఎక్కడ ఆగితే అక్కడే డ్రైవర్లు పంపిణీ చేస్తున్నారు. కార్డుదారులు వాటికోసం వెతుక్కుంటూ వెళ్లిన ఘటనలు ఆదివారం కనిపించాయి. 

Updated Date - 2021-03-01T08:37:04+05:30 IST