20 ఇయర్స్‌ ఇండస్ట్రీ!!

Jul 23 2021 @ 05:12AM

20 ప్లస్‌ 

1997లో మణిరత్నం ‘ఇరువర్‌’ తమిళ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు ఐశ్వర్య రాయ్‌.  మళ్లీ ఇప్పుడు 2021...లో ఆయన  దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలోనూ మెయిన్‌ హీరోయిన్‌గా  కనిపించనున్నారు. కథానాయికగా దాదాపు 23 ఏళ్ల సినీ కెరీర్‌ను ఆమె పూర్తి చేసుకున్నారు. తొలిచిత్రం ‘ఇరువర్‌’ పెద్దగా ఆడకపోయినా కల్పన, పుష్పవల్లి అనే రెండు పాత్రల్లో ఐశ్వర్య మెప్పించారు. అదే సంవత్సరం హిందీలో బాబీడియోల్‌తో చేసిన ‘ఔర్‌ ప్యార్‌ హో గయా’ చిత్రంకూడా పరాజయం పాలైంది. మరుసటి ఏడాది శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జీన్స్‌’తో తొలి కమర్షియల్‌ హిట్‌ అందుకున్నారు. 1999లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో హిందీలో  వచ్చిన ‘హమ్‌ దిల్‌ దే చుకేసనమ్‌’తో కథానాయికగా స్టార్‌డమ్‌ అందుకున్నారు. 2007లో అభిషేక్‌బచ్చన్‌ను వివాహం చేసుకున్నారు. 2011లో ఆరాధ్యకు జన్మనిచ్చారు. అయినా హీరోయిన్‌గా ఐశ్వర్యకు ఇప్పటికీ మంచి  ఫాలోయింగ్‌ ఉంది. 


కరీనా చరిష్మా

అన్నీ కుదిరితే 2000లోనే  హృతిక్‌రోషన్‌ సరసన కరీనాక పూర్‌ ఎంట్రీ ఇచ్చేవారు.  ‘కహో నా ప్యార్‌ హై’ చిత్రంలో తొలుత కథానాయికగా కరీనాకపూర్‌ను తీసుకున్నారు. కొన్ని రోజులు షూటింగ్‌ జరిగాక ఆమెను సినిమా నుంచి తప్పించారు. ఏడాది వెయిట్‌ చేశాక కానీ మళ్లీ ఆమెకు అవకాశం రాలేదు.  2001లో ‘రెఫ్యూజీ’ చిత్రంతో అభిషేక్‌ బచ్చన్‌ సరసన కథానాయికగా వెండితెర అరంగేట్రం చేశారు. ప్రస్తుతం 2021లో ఆమె ఆమీర్‌ఖాన్‌ లాంటి అగ్రహీరో సరసన ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ‘కభీ ఖుషీ కభీ ఘమ్‌’, ‘డాన్‌’, ‘జబ్‌ ఉయ్‌ మెట్‌’, ‘త్రీ ఇడియట్స్‌’ లాంటి చిత్రాలు బాలీవుడ్‌లో కథానాయికగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి. 2012లో కరీనాకపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ వివాహం జరిగింది. ఇద్దరు పిల్లల తల్లి అయునా కరీనాకు ఉన్న పాపులారిటీ వేరు. 


20 ఏళ్లయింది

బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘కహోనా ప్యార్‌ హై’తో 2000 సంవత్సరంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు అమీషా పటేల్‌. అదే ఏడాది పవన్‌ కల్యాణ్‌ ‘బద్రి’ చిత్రంతో తెలుగులోనూ ఘన విజయం అందుకున్నారు. ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’, ‘భూల్‌ భూలయ్య’, ‘రేస్‌ 2’ మంచి గుర్తింపు తెచ్చాయి. కెరీర్‌ ఆరంభంలో దక్కిన స్టార్‌డమ్‌ ఇప్పుడు ఆమెకు లేకపోయినప్పటికీ హీరోయిన్‌గా కొనసాగుతూ   ‘దేశీ మ్యాజిక్‌’, ‘ద గ్రేట్‌ ఇండియన్‌ కేసినో’, ‘తౌబా తేరా జాల్వా’, ‘15 డేస్‌ టు గో’ చిత్రాలు చేస్తున్నారు అమీషా పటేల్‌.  


రెండు దశాబ్దాల కథానాయిక

మెస్మరైజ్‌ చేసే అందంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రియ   20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు.  2001లో ‘ఇష్టం’ చిత్రంతో తెలుగులో కథానాయికగా ఆమె  అరంగేట్రం చేశారు.  అందులో ఆమెకు జోడీగా నటించిన చరణ్‌ మళ్లీ సినిమాలేవి చేయలేదు. కానీ శ్రియ మాత్రం  కథానాయికగా కొనసాగూతూనే ఉన్నారు. తొలి చిత్రం తర్వాత అగ్రకథానాయకులతో  జోడీకట్టి హిట్‌లు అందుకున్నారు. నాగార్జున ‘సంతోషం’, బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’, చిరంజీవి ‘ఠాగూర్‌, ’ ప్రభాస్‌ ‘ఛత్రపతి’ రజనీకాంత్‌ ‘శివాజీ’ తదితర చిత్రాలతో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగారు. దాదాపు దశాబ్దం వరకూ హీరోయిన్‌గా ఆమె స్టార్‌డమ్‌ కొనసాగించారు. ఆ తర్వాత రేసులో వెనుకబడినా సీనియర్‌ హీరోల సరసన కథానాయికగా కొనసాగుతున్నారు. 2018లో రష్యా వ్యాపారవేత్త అండ్రియా కొశ్చేవ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నా సినిమాలు మానలేదు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘గమనం’ చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిళ చిత్రం ‘నరగాసురన్‌’, హిందీ చిత్రం ‘తడ్కా’లో లీడ్‌రోల్‌లో నటిస్తున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.