కేటీఆర్‌ ఆదేశాలతో.. రూ.200 కోట్లతో వంతెన

Jul 30 2021 @ 14:30PM

  • ఎలివేటెడ్‌ ఎక్స్‌టెన్షన్‌
  • బిడ్‌ దాఖలు చేసిన మూడు సంస్థలు
  • త్వరలో నిర్మాణ సంస్థ ఎంపిక
  • ఉప్పల్‌- నారపల్లి వంతెనకు కొనసాగింపుగా నిర్మాణం
  • పనులు ప్రారంభించేందుకు కసరత్తు
  • ఉప్పల్‌- నారపల్లి వరకు రూ.658 కోట్లతో కారిడార్‌
  • నగరం నుంచి జిల్లాలకు చిక్కులు లేని ప్రయాణం కోసమే

హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌కు కొనసాగింపుగా వంతెన నిర్మాణంపై అడుగులు పడుతున్నాయి. రింగ్‌ రోడ్డు సమీపంలోని శ్మశానవాటిక నుంచి రామంతాపూర్‌ వైపున్న మోడ్రన్‌ బేకరీ వరకు వంతెన నిర్మించనున్నారు. ఈ పనుల కోసం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించగా, తాజాగా మూడు సంస్థలు బిడ్‌ దాఖలు చేశాయని ఇంజనీరింగ్‌ విభాగం అధికారొకరు తెలిపారు. బిడ్‌ల పరిశీలన జరుగుతోందని, నిర్మాణ సంస్థ ఎంపిక త్వరలో పూర్తవుతుందని అన్నారు. నగరం నుంచి వరంగల్‌ వైపు జాతీయ రహదారిపై నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, వైద్య సేవలు, ఇతర పనుల కోసం లక్షలాది మంది హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుంటారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బోడుప్పల్‌ దాటేందుకు 40 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతోంది. 


జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, మియాపూర్‌, మెహిదీపట్నం తదితర ప్రాంతాల రెండు నుంచి రెండున్నర గంటలు పడుతోంది. జాతీయ రహదారిపై బైపాస్‌ రోడ్డు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో బోడుప్పల్‌/చెంగిచెర్ల చౌరస్తా నుంచి రెండు నుంచి రెండున్నర గంటల్లో 140 కి.మీల దూరంలోని వరంగల్‌కు వెళ్తున్నారు. కానీ, వాహనాల రద్దీ నేపథ్యంలో నగరంలో 20 నుంచి 30 కి.మీల దూరం ప్రయాణించేందుకు కూడా రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది. ఆ ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు నగరం నలువైపులా ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఒకటి ఉప్పల్‌ నుంచి నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌. ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని శ్మశానవాటిక నుంచి నారపల్లి వరకు 6.4 కి.మీల ఆరు లేన్ల వంతెనను రూ.658 కోట్లతో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మిస్తోంది. ఆస్తుల సేకరణ పూర్తవడంతో పనులూ జరుగుతున్నాయి.

కేటీఆర్‌ ఆదేశాలతో.. 

ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద నిత్యం భారీగా ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ఉప్పల్‌ బస్టాండ్‌ వైపు శ్మశాన వాటిక ఉండడంతో రహదారి విస్తరణకు అవకాశం లేదు. ఈ మార్గంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ను శ్మశాన వాటిక వద్ద దించితే రింగ్‌ రోడ్డు సమీపంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. స్థానికంగా రాకపోకలు సాగించే వాహనాలతో పాటు వరంగల్‌ వైపు నుంచి వచ్చే వాహనాలతో శ్మశాన వాటిక వద్ద జామ్‌జాటం అధికమవుతుంది. వంతెన అందుబాటులోకి వచ్చినా పూర్తిస్థాయి ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఏఐ వంతెనను ల్యాండ్‌ చేసే చోటు నుంచి రామంతాపూర్‌ వైపు ఫ్లై ఓవర్‌ నిర్మించే బాధ్యతను ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. 


ఇందుకు రూ.200 కోట్లు అవసరమని అంచనా వేసిన అధికారులు టెండర్‌ ప్రకటించారు. రామంతాపూర్‌ వైపు మోడ్రన్‌ బేకరీ వద్ద వంతెన ల్యాండ్‌ కానుండగా, సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనాల కోసం ఉప్పల్‌ స్టేడియం రోడ్‌లో గ్రేట్‌ సెపరేటర్‌ నిర్మించనున్నారు. నారపల్లిలో వంతెన ఎక్కిన వాహనం సికింద్రాబాద్‌ వైపు వెళ్లాలనుకుంటే గ్రేడ్‌ సెపరేటర్‌ ద్వారా వెళ్లే అవకాశముంటుంది. సికింద్రాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు వంతెన ఎక్కేందుకు వీలుగా మరో గ్రేడ్‌ సెపరేటర్‌ నిర్మించనున్నారు. ఈ వంతెన అందుబాటులోకి వచ్చిన పక్షంలో నగరం నుంచి వరంగల్‌ జాతీయ రహదారి వైపు సిగ్నల్‌ చిక్కులు, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగే అవకాశ ముంటుంది.


ఎన్‌హెచ్‌ఏఐ ప్రస్తుతం చేస్తున్న పనుల వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే వంతెన అందుబాటులోకి రావడానికి రెండున్నర నుంచి మూడేళ్లు పట్టవచ్చు. అప్పటి వరకు వేచి చూడకుండా జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న మేర పనులు ప్రారంభించాలని మంత్రి కే తారక రామారావు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో టెండర్‌ ప్రకటించిన అధికారులు పనులు మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. మోడ్రన్‌ బేకరీ వైపు నుంచి లేదా ఉప్పల్‌ రింగ్‌ ఇవతలి వైపు (రామంతాపూర్‌) నుంచి పనులు చేయాలనుకుంటున్నారు.

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.