విదేశాలకు తరలిపోతున్న భారత అపర కుబేరులు.. ప్రధాన కారణం అదేనట!

Published: Thu, 30 Jun 2022 07:38:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విదేశాలకు తరలిపోతున్న భారత అపర కుబేరులు.. ప్రధాన కారణం అదేనట!

విదేశాల్లో హెచ్‌ఎన్‌ఐలకు బ్రహ్మ రథం

భారత్‌లో ఏటా కొత్త హెచ్‌ఎన్‌ఐల సృష్టి

(సెంట్రల్‌ డెస్క్‌): లక్ష్మీపుత్రులు..! కోట్లకు పడగలెత్తిన వారు..! అపర కుబేరులు..! హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ)..! ఏ పేరుతో పిలిచినా.. ఈ కేటగిరీకి చెందిన యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు భారత్‌ను వీడనున్నారు..! ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఈ ఏడాది చివరికల్లా ఏకంగా 8 వేల మంది లక్ష్మీపుత్రులు విదేశాలకు తట్టాబుట్టా సర్దుకోనున్నారట..! హెన్లీ ప్రై వేట్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ డ్యాష్‌బోర్డ్‌ అనే సంస్థ ‘2018 హెన్లీ గ్లోబల్‌ సిటిజన్‌ రిపోర్ట్‌’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. హెచ్‌ఎన్‌ఐలు భారీగా తరలిపోతున్న దేశాల జాబితాలో రష్యా, చైనా తర్వాత భారత్‌ ఉంది. అయితే.. ఏటా కొత్తగా పుట్టుకొచ్చే హెచ్‌ఎన్‌ఐల వల్ల ఈ వలసలతో భారత్‌కు నష్టం లేదని ఈ రిపోర్ట్‌ తెలిపింది.


పన్ను విధానాలే ప్రధాన కారణం?

అంకుర సంస్థలు, లేదా వ్యాపారాభివృద్ధితో అనతికాలంలోనే ‘యూఎస్‌ డాలర్‌ మిలియనీర్లు/బిలియనీర్లు’గా అభివృద్ధి చెందే యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను హెచ్‌ఎన్‌ఐగా పరిగణిస్తారు. భారత్‌లో ప్రభుత్వాల కఠిన విధానాలు, పన్ను నిబంధనలే హెచ్‌ఎన్‌ఐలు దేశాన్ని వీడేందుకు ప్రధాన కారణాలని ఈ నివేదిక పేర్కొన్నది. టెక్‌ ఆధారిత రంగంలోని హెచ్‌ఎన్‌ఐలు కొత్తఐటీ చట్టాలు/నిబంధనలు, సోషల్‌మీడియా నియంత్రణ వల్ల రిస్క్‌లేని దేశాలవైపు చూస్తున్నట్లు తెలిపింది. పాతతరం హెచ్‌ఎన్‌ఐలు మాత్రం భారత్‌ను వీడేందుకు ఇష్టపడడం లేదని, విదేశాల్లో వ్యాపారాలను విస్తరించిన వారు కూడా భారత్‌కు తిరిగి వస్తున్నారని న్యూ వరల్డ్‌ వెల్త్‌ సంస్థ ప్రతినిధి ఆండ్రూ అమొయిల్స్‌ వెల్లడించారు. భారత్‌లో పన్ను విధానాలను 2020, 2021ల్లో మరింత కఠినంగా మార్చినట్లు అభిప్రాయపడ్డారు. భారత్‌లో స్టార్ట్‌పలు, యువ పారిశ్రామికవేత్తలకు పన్నుచెల్లింపులో వెసులుబాట్లు లేవన్నారు. 


స్వర్గధామంగా యూఏఈ

భారత్‌తో పాటు రష్యా, చైనాకు చెంది న హెచ్‌ఎన్‌ఐల చూపు యునైటెడ్‌ అరబిక్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) వైపు ముఖ్యంగా దుబాయ్‌ వైపు ఉంది. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, సింగపూర్‌, ఇజ్రాయె ల్‌, స్విట్జర్లాండ్‌, అమెరికా ఉన్నాయి. ఈయూ దేశాలైన పోర్చుగల్‌, మాల్టా, గ్రీస్‌ వైపూ హెచ్‌ఎన్‌ఐలు చూస్తున్నారు. 


భారత్‌కు ఢోకా లేదు..!

ఈ ఏడాది భారత్‌ నుంచి 8 వేల మంది హెచ్‌ఎన్‌ఐలు తరలి వెళ్తారని అంచనా. అయినా అది ప్రమాద ఘంటికలకు ఏమాత్రం సంకేతం కాదని హెన్లీ సంస్థ పేర్కొన్నది. 2031 కల్లా భారత్‌లో హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 80శాతం పెరగనుంది. వీరి వల్ల ప్రపంచంలోనే అతి వేగంగా సంపద పెరుగుతున్న దేశంగా భారత్‌ నిలవనుంది. అమెరికాలో హెచ్‌ఎన్‌ఐల పెంపు 20శాతం మాత్రమే ఉం డనుంది. ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, బ్రిటన్‌లలో ఇది 10శాతం మేర ఉండొచ్చు. ఆయా దేశాలతో పోలిస్తే.. భారత్‌ సంపద పెరగడానికి రానున్న పదేళ్లలో హెచ్‌ఎన్‌ఐలు దోహదపడనున్నారు’’ అని హెన్లీ సంస్థ అభిప్రాయపడింది. అప్పటికల్లా భారత్‌లో పన్ను విధానం, జీవన ప్రమాణాలు, హెల్త్‌కేర్‌ మెరుగైతే హెచ్‌ఎన్‌ఐలు విదేశాల వైపు చూడటం తగ్గుతుందయని, విదేశాలకు వెళ్లిన హెచ్‌ఎన్‌ఐలు వస్తారని న్యూ వరల్డ్‌ వెల్త్‌ సంస్థ పేర్కొంది.


తరలి వెళ్లనున్న హెచ్‌ఎన్‌ఐలు

రష్యా 15,000

చైనా 12,000

భారత్‌  8,000


హెచ్‌ఎన్‌ఐల చూపు ఈ దేశాల వైపు 

యూఏఈ 4,000

ఆస్ట్రేలియా 3,500

సింగపూర్‌ 2,800

ఇజ్రాయెల్‌ 2,500

స్విట్జర్లాండ్‌ 2,200

అమెరికా 1,500

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.