అధ్యక్ష ఎన్నికలకు ప్రారంభమైన సన్నాహాలు!

ABN , First Publish Date - 2021-04-19T14:46:18+05:30 IST

అమెరికాలోని ఓ ప్రధాన పార్టీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి కనీసం ఆరునెలలైనా గడువకముందే 2024 ఎన్నికల కోసం సదరు పార్టీ నేతలు సిద్ధం అవుతున్నారు. ఏకంగా ఎన్ని

అధ్యక్ష ఎన్నికలకు ప్రారంభమైన సన్నాహాలు!

వాషింగ్టన్: అమెరికాలోని ఓ ప్రధాన పార్టీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి కనీసం ఆరునెలలైనా గడువకముందే 2024 ఎన్నికల కోసం సదరు పార్టీ నేతలు సిద్ధం అవుతున్నారు. ఏకంగా ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకునే పనిలో బిజీ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష పదవికి గత ఏడాది నవంబర్ 3న ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్.. అగ్రరాజ్య అధినేతగా బాధ్యతలు స్వీకరించారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు కావొస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పీఠానికి మళ్లీ ఎన్నికలు జరగాలంటే ఇంకా దాదాపు నాలుగు సంవత్సరాల సమయం ఉంది. అయితే అమెరికాలోని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలో 2024కు సంబంధించి ఎన్నికల సందడి ఇప్పుడే మొదలైంది. 2024ఎన్నిల్లో పోటీ చేస్తానంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. అంతేకాకుండా విరాళాల సేకరించేందుకు దాతలతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీలోని మెజార్టీ సభ్యులు ఆయనకే ‘జై’ కొడుతున్నప్పటికీ.. ట్రంప్ సహచరులు కూడా 2024 అధ్యక్ష బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 



ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభిస్తేనే 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్న నేతలు ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఉపాధ్యక్షడు మైక్ పెన్స్ ఏప్రిల్ చివరన తొలి ప్రసంగాన్ని ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో కూడా ఈ రేసులో ఉన్నారు. రాష్ట్రాల్లో పర్యటించేందుకు ఇప్పటికే ఆయన ప్రణాళికలను రెడీ చేసుకున్నారు. ఈ పోటీలో ఇండియన్-అమెరికన్ నిక్కీ హేలీ కూడా ఉన్నారు. 2024ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయకుంటే.. తాను బరిలో నిలుస్తానని ప్రకటించారు. అంతేకాకుండా ఫ్లోరిడా గవర్నర్ డెశాంటీస్ కూడా పోటీపై ఆసక్తి చూపిస్తున్నారు. అయోవా రాష్ట్రంలో రాజకీయ సందడి మొదలయిందని రిపబ్లికన్ పార్టీ నేత జెఫ్ కౌఫ్‌మ్యాన్ తెలిపారు. బరిలో నిలిచే అభ్యర్థులు తొలుత అయోవా రాష్టానికే వస్తుంటారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-19T14:46:18+05:30 IST