2025 జూన్‌లో కోడంబాక్కం- పోరూర్‌ Metro rail సేవలు

ABN , First Publish Date - 2022-05-20T16:15:06+05:30 IST

నగర శివారు ప్రాంతాలైన పోరూర్‌, పూందమల్లి నుంచి లైట్‌ హౌస్‌ వరకు 2025లో మెట్రోరైలు సేవలు ప్రారంభించాలనే లక్ష్యంతో పనులను వేగవంతం చేశారు. నగరంలో

2025 జూన్‌లో కోడంబాక్కం- పోరూర్‌ Metro rail సేవలు

పెరంబూర్‌(చెన్నై): నగర శివారు ప్రాంతాలైన పోరూర్‌, పూందమల్లి నుంచి లైట్‌ హౌస్‌ వరకు 2025లో మెట్రోరైలు సేవలు ప్రారంభించాలనే లక్ష్యంతో పనులను వేగవంతం చేశారు. నగరంలో తొలిదశలో 55 కి.మీ మేర మెట్రోరైళ్లు అందుబాటులో ఉన్నాయి. రెండో దశలో 118.0 కి.మీ దూరానికి మెట్రోరైలు మార్గం, రైల్వేస్టేషన్ల నిర్మాణం జరుగుతోంది. ముఖ్యంగా, మాధవరం నుంచి సిరుచ్చేరి వరకు 45.8 కి.మీ కలిగిన మూడో మార్గంలో 19.1 కి.మీ వరకు స్తంభాలపై ఏర్పాటుకానున్న రైలు మార్గంలో 20 రైల్వేస్టేషన్లు, 26 కిలో మీటర్ల సొరంగమార్గంలో 30 రైల్వేస్టేషన్లు నిర్మించనున్నారు. అలాగే, లైట్‌ హౌస్‌ నుంచి పూందమల్లి వరకు 26.1 కి.మీ మేర నిర్మిస్తున్న నాలుగో మార్గంలో 18 కి.మీ వరకు స్తంభాలపై ఏర్పాటుకానున్న రైలు మార్గంలో 18 రైల్వేస్టేషన్లు, 10.1 కి.మీ సొరంగమార్గంలో 12 రైల్వేస్టేషన్లను నిర్మించనున్నారు. అలాగే, మాధవరం నుంచి షోలింగనల్లూర్‌ వరకు 47 కి.మీల ఐదో మార్గంలో 41.2 కిలోమీటర్లు స్తంభాలపై  రైలు మార్గంలో 42 రైల్వేస్టేషన్లు, 5.8 కి.మీ సొరంగమార్గంలో ఆరు రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు.


2025 జూన్‌ నుంచి...

ప్రస్తుతం 26.1 కి.మీ మూడో మార్గం (లైట్‌ హౌస్‌-పూందమలి)లో కోడంబాక్కం పవర్‌హౌస్‌ నుంచి పూందమల్లి వరకు 2025 జూన్‌ నుంచి రైలు సేవలు ప్రారంభించాలనే లక్ష్యంతో నిర్మాణపనులు వేగవంతం చేశారు. తర్వాత 2026లో లైట్‌ హౌస్‌ నుంచి పూందమల్లి వరకు రైళ్లు నడుపనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం నజరేత్‌పేట, పోరూర్‌, పూందమల్లి బైపాస్‌ రోడ్డులో నిర్మాణపనులు జరుగుతున్నాయి. అలాగే, కోడంబాక్కం పవర్‌ హౌస్‌ నుంచి పోరూర్‌ జంక్షన్‌ వరకు 7.9 కి.మీ దూరానికి స్తంభాలపై దిమ్మెలు అమర్చే పనులు జరుగుతున్నాయి. ఇక, పోరూర్‌-పూందమల్లి మధ్య 7.9 కి.మీ దూరానికి చెన్నై బైపాస్‌ జంక్షన్‌, రామచంద్రా ఆస్పత్రి, అయ్యప్పన్‌తాంగళ్‌ బస్టాండ్‌, కాట్టుపాక్కం, కుమనన్‌ చావిడి, ములై గార్డెన్‌, పూందమల్లి బస్టాండ్‌, పూందమల్లి బైపాస్‌ తదితర ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు, పూందమల్లి సమీపంలో గ్యారేజి నిర్మాణపనులు జరుగుతున్నాయి. ఇందుకోసం పలు మార్గాల్లో ట్రాఫిక్‌ మార్పులు చేపట్టారు. 

Updated Date - 2022-05-20T16:15:06+05:30 IST