ఒక్కరోజే 21..దడపుట్టిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-07-06T10:32:42+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులను కరోనా దడపుట్టిస్తోంది. ఇరుజిల్లాల్లో ఆదివారం మరో

ఒక్కరోజే 21..దడపుట్టిస్తున్న కరోనా

ఖమ్మం జిల్లాలో 19మందికి, భద్రాద్రిలో ఇద్దరికి పాజిటివ్‌ 

రఘునాథపాలెం మండలం వీవీపాలెంలో ఓ వృద్ధుడి మృతి


ఖమ్మంసంక్షేమవిభాగం/కొణిజర్ల/బూర్గంపాడు/దుమ్ముగూడెం, జూలై 5: ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులను కరోనా దడపుట్టిస్తోంది. ఇరుజిల్లాల్లో ఆదివారం మరో 17మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. ఖమ్మం జిల్లాలో 19మంది, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇద్దరు ‘కొవిడ్‌-19’ బారిన పడగా.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీవెంకటాయపాలేనికి చెందిన 62ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. ఖమ్మం జడ్పీ కార్యాలయంలో పనిచేసే రెండోస్థాయి అధికారికి పాజిటివ్‌ నిర్ధారణైంది. సదరు అధికారి ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో ఆయనకు పాజిటివ్‌ ఉన్నట్టు ఆదివారం రాత్రి తెలసింది. అలాగే ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయనకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.


ఈ క్రమంలో ఆయనతో పాటు ఆయనకు తోడుగా వెళ్లిన ఆయన భార్య నమూనాలు కూడా సేకరించారు. అయితే భర్త ఆరోగ్యం కొంత మెరుగవడంతో ఇద్దరూ కలిసి శనివారం రాత్రి స్వగ్రామమైన కొణిజర్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ వచ్చిందని రాష్ట్ర వైద్యాధికారుల నుంచి సమాచారం అందింది. దీంతో ఆ ఇద్దరిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌కు తరలించారు. వీరితో పాటే హైదరాబాద్‌ వెళ్లి వేంసూరు మండలానికి చెందిన వారి అల్లుడికి కూడా పాజిటివ్‌ నిర్ధారణైంది. అలాగే ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న వైరా మండలం శాంతినగర్‌కు చెందిన ఓ కుటుంబంలోని వ్యక్తి కరోనా బారిన పడ్డారు. బోనకల్లు మండలం రావినూతల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఎర్రుపాలెం మండలానికి చెందిన ఓ వ్యక్తికి, కల్లూరు మండలంలో ఒకరికి కరోనా నిర్ధారణ జరిగింది.


వీరితో పాటు ఖమ్మంనగరంలోని బుర్హాన్‌పురంలో ముగ్గురికి, మామిళ్లగూడెంలో ఒకరికి, వరంగల్‌ క్రాస్‌రోడ్డులో ఓ మహిళకు, పాండురంగాపురానికి చెందిన ఓ వ్యక్తికి, పాకబండబజార్‌లో ఒకరికి ఇలా మొత్తం 15 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు ప్రైవేట్‌ ఆర్థో వైద్యులున్నారు. ఇక జిల్లా ఆసుపత్రిలోనూ మరో నలుగురికి పాజిటివ్‌ ఉన్నట్టు ఆదివారం రాత్రి నిర్ధారణ అయ్యింది. వీరిలో ల్యాబ్‌ ఉద్యోగులు ఇద్దరు, సెక్యూరిటీ ఉద్యోగి ఒకరు, రడ్రైవర్‌ ఒకరు ఉన్నారు. కానీ ఈ కేసుల వివరాలను రాష్ట్ర వైద్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో చూపకపోవడం గమనార్హం.


భద్రాద్రి జిల్లాలో.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాకపట్టీనగర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పదిహేను రోజులు క్రితం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం ఏలేరు గ్రామంలో గల సమీప బంధువుల ఇంటికి వెళ్లి నాలుగు రోజులు ఉండి వచ్చాడు. ఈ క్రమంలో వారం క్రితం జ్వరం రావడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లగా.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని అక్కడి వైద్యులు సూచించడంతో ఈ నెల 2న హైదారాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లి నమూనాలు ఇచ్చి ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు ఆదివారం గాంధీ వైద్యుల నుంచి జిల్లా ఆదికారులకు సమాచారం అందింది.


దుమ్ముగూడెం మండలంలో తొలి కరోనా కేసు నమోదైంది. రేగుబల్లిలో నివాసముంటున్న 60ఏళ్ల వృద్ధుడు గత నెల 30న న్యుమోనియా లక్షణాలతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా.. కరోనాగా అనుమానించిన అక్కడి వైద్యులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియాకు పంపగా.. పరీక్షలు నిర్వహించి శనివారం రాత్రి పాజిటివ్‌గా నిర్ధారించారు. అయితే అతడిని హోమ్‌ ఐసోలేషన్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మణుగూరులోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. కాగా సదరు వృద్ధుడు ఇటీవల సూర్యాపేటలోని ఓ శుభకార్యానికి వెళ్లగా, అక్కడ వైరస్‌ వ్యాప్తి జరిగినట్టు అనుమానిస్తున్నారు.


ఈ నేపథ్యంలో ఆయా మండలాల, గ్రామాల అధికారులు అప్రమత్తమయ్యారు.  పాజిటివ్‌ వచ్చిన వారితో కాంటాక్టు అయిన వారి వివరాలను సేకరించడంతో పాటు వారి నివాస ప్రాంతాలు, గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపడుతున్నారు. 


ఖమ్మం జిల్లాలో వృద్ధుడి కన్నుమూత

రఘనాధపాలెం మండలం వి.వెంకటాయపాలేనికి చెందిన ఓ వృద్ధుడు (62) పదిహేనురోజులుగా జలుబు, దగ్గు తదితర లక్షణాలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా శనివారం పాజిటివ్‌గా నిర్ధారణైందని అధికారులు ప్రకటించారు. జిల్లా ఆసుపత్రిలోని ఐసోలేషన్‌లో ఉన్న సదరు వృద్ధుడు ఆదివారం మృతిచెందారు. ఆయనకు పలు దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉన్నట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-07-06T10:32:42+05:30 IST