మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు అమరులయ్యారు: ఎస్పీ

ABN , First Publish Date - 2021-04-04T18:30:08+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో

మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు అమరులయ్యారు: ఎస్పీ

బీజాపూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారని బీజాపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కమలోచన్ కాశ్యప్ ఆదివారం చెప్పారు. 15 మృత దేహాలను ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనలో 30 మంది గాయపడినట్లు, 21 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు తెలిపారు. 


బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని టెర్రం అడవుల్లో శనివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు  జరిగాయి. ఆ తర్వాత ఆచూకీ తెలియకుండాపోయిన భద్రతా సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు  ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థి తెలిపారు. 


ఇదిలావుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్‌కు ఫోన్ చేశారు. బీజాపూర్ జిల్లాలోని టర్రెం సమీపంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ ఘటనపై ఆరా తీశారు. ఈ ఎన్‌కౌంటర్లో భద్రతా సిబ్బంది అమరులుకావడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


అమిత్ షా ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో జరిగిన పోరాటంలో అమరులైన భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలకు, త్యాగాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. వీరి పరాక్రమాన్ని దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని తెలిపారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాంతి, అభివృద్ధిలకు శత్రువులుగా వ్యవహరిస్తున్నవారితో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 


Updated Date - 2021-04-04T18:30:08+05:30 IST