234 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-09T06:46:04+05:30 IST

అక్రమ రవాణా కోసం సిద్ధంగా ఉంచిన 234 బస్తాల రేషన్‌ బియ్యాన్ని శ్రీకాళహస్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

234 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం
పోలీసుల దాడుల్లో పట్టుబడిన రేషన్‌ బియ్యం

శ్రీకాళహస్తి, మే 8: కూలీనాలీ చేసుకుని పొట్ట నింపుకునే పేదల తిండిపైనా అక్రమార్కులు కన్నేశారు. సబ్సిడీ బియ్యాన్ని గుట్టుగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం శనివారం శ్రీకాళహస్తి పోలీసులు నిర్వహించిన దాడులతో వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి పంచాయతీ పరిధిలోని ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన 234 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. శ్రీకాళహస్తి టూటౌన్‌ పోలీసుల కథనం మేరకు... శ్రీకాళహస్తి పట్టణం మంచినీళ్లగుంటకు చెందిన ప్రసాద్‌ మరో ఇద్దరు యువకులతో కలసి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తి-నాయుడుపేట ప్రధాన రహదారి సమీపంలోని పెద్దకన్నలి పంచాయతీ పరిధిలోని పొలాల్లో ఉన్న ఓ గోదామును కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ మేరకు.. పలుప్రాంతాల్లో డీలర్లు తదితర మార్గాల్లో సేకరించిన రేషన్‌ బియ్యాన్ని ఇక్కడ నిల్వ చేస్తున్నారు. అనంతరం సంచులను మార్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయమై శనివారం టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందడంతో ఈ గోడౌన్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ నిల్వ ఉంచిన 234 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసులు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో కొద్దిరోజులుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోక పోవడం విమర్శలకు దారితీస్తోంది. 

Updated Date - 2021-05-09T06:46:04+05:30 IST