ఆగిన ఊపిరి

ABN , First Publish Date - 2021-04-22T07:31:31+05:30 IST

వారంతా కరోనా బాధితులు! పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో... వెంటిలేటర్‌పై ఉన్నారు. వైద్యులు వారికి నిరంతరం ఆక్సిజన్‌ అందిస్తూ చికిత్స చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం... ఉన్నట్టుండి ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయింది. రోగులంతా ఊపిరాడక విలవిల్లాడారు. నిమిషాల వ్యవధిలోనే... 24 మంది తుది శ్వాస వదిలారు...

ఆగిన ఊపిరి

  • ట్యాంక్‌ నుంచి ఆక్సిజన్‌ లీక్‌.. రోగులకు అందని ప్రాణవాయువు
  • 24 మంది కొవిడ్‌ రోగుల మృతి
  • అంతా వెంటిలేటర్లపై ఉన్నవారే.. నాసిక్‌లో ఘోర దుర్ఘటన
  • ట్యాంక్‌ నాబ్‌ దెబ్బతినడమే కారణం.. అరగంట ఆగిన సరఫరా
  • విచారణకు ఠాక్రే ఆదేశం.. హృదయం ద్రవించిపోతోంది: మోదీ
  • ఢిల్లీ ఆస్పత్రిలో తప్పిన ముప్పు.. చివరి క్షణంలో ఆక్సిజన్‌ ట్యాంకర్‌
  • ఆస్పత్రిలోని 500 మంది రోగులకు తప్పిన ప్రాణగండం
  • గుజరాత్‌ ఆస్పత్రిలో ప్రాణవాయువు లేక ఇద్దరి మృతి
  • రోగుల ప్రాణాలంటే లెక్కలేదా?.. మండిపడ్డ ఢిల్లీ హైకోర్టు 
  • హన్మకొండ ఆస్పత్రుల్లో సిలిండర్‌ తెచ్చుకుంటేనే చికిత్స 


వారంతా కరోనా బాధితులు! పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో... వెంటిలేటర్‌పై ఉన్నారు. వైద్యులు వారికి నిరంతరం ఆక్సిజన్‌ అందిస్తూ చికిత్స చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం... ఉన్నట్టుండి ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయింది. రోగులంతా ఊపిరాడక విలవిల్లాడారు. నిమిషాల వ్యవధిలోనే... 24 మంది తుది శ్వాస వదిలారు. ప్రాణ వాయువు అందకపోవడంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆస్పత్రి ఆవరణలోని ఆక్సిజన్‌ సిలిండర్‌ నుంచి వాయువు లీక్‌ కావడంతో... వెంటిలేటర్లపై ఉన్న రోగులకు ప్రాణ వాయువు అందకపోవడమే ఈ విషాదానికి కారణం. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఘోర విషాదమిది! 



నాసిక్‌, ఏప్రిల్‌ 21: నాసిక్‌లోని జాకిర్‌ హుస్సేన్‌ మునిసిపల్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో కొవిడ్‌ చికిత్స కోసం కేటాయించారు. అందులో... సుమారు 150 మంది రోగులు వెంటిలేటర్లపైనా, ఐసీయూల్లో ఆక్సిజన్‌పై ఆధారపడి చికిత్స పొందుతున్నారు. మరీ ముఖ్యంగా... వెంటిలేటర్‌పై ఉన్న వారికి నిరంతరం ఆక్సిజన్‌ సరఫరా చేయాల్సి ఉంది. మెడికల్‌ ఆక్సిజన్‌తో కూడిన ఓ ట్యాంకర్‌ మంగళవారం రాత్రే ఆస్పత్రికి చేరుకుంది. బుధవారం దాని నుంచి ఆస్పత్రిలోని ట్యాంక్‌కు ఆక్సిజన్‌ను లోడ్‌ చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అనూహ్యంగా ఆస్పత్రి ట్యాంక్‌ నుంచి ఆక్సిజన్‌ లీకేజీ మొదలైంది. ట్యాంక్‌కు చెందిన నాబ్‌ ఒకటి దెబ్బతినడంతో... ఆక్సిజన్‌ బయటికి వచ్చి తెల్లటి పొగలా ఆస్పత్రి ఆవరణ అంతా వ్యాపించసాగింది. దీంతో వెంటిలేటర్లు, ఐసీయూల్లోని బెడ్‌లకు సరఫరా అయ్యే ఆక్సిజన్‌లో ప్రెజర్‌ తగ్గిపోయింది. సుమారు 30 నిమిషాలపాటు వెంటిలేటర్లపై ఉన్న రోగులకు ప్రాణవాయువు సరఫరాలో అంతరాయం కలిగింది. దీంతో... ఆస్పత్రి పడకలపైనే ఒక్కొక్కరు ఊపిరికోసం కొట్టుమిట్టాడుతూ తుది శ్వాస వదిలారు. ఆక్సిజన్‌ ట్యాంక్‌ సాకెట్‌ విరగడమే ఈ దుర్ఘటనకు కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో లీకేజీని గుర్తించారు. వెంటనే నాసిక్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు సమాచారం అందించారు. అప్పటికే వెంటిలేటర్లపైనా, ఆక్సిజన్‌పైనా ఆధారపడ్డ 31 మంది రోగులు విలవిల్లాడడం మొదలెట్టారు. మొత్తం 150 మంది పేషెంట్లుండగా వీరి పరిస్థితి విషమంగా ఉంది. వెన్వెంటనే అధికారులు ఆ రోగులను సమీపంలో ఆక్సిజన్‌ ఉన్న ఆసుపత్రులకు తరలించబోయే లోపే 24 మంది తుది శ్వాస వదిలినట్లు జిల్లా కలెక్టర్‌ సూరజ్‌ మంధారే తెలిపారు. కార్పొరేషన్‌ అధికారులు కూడా వెంటనే ఇతర ఆస్పత్రుల నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లను తెప్పించారు. సాంకేతిక సిబ్బంది 4 గంటలపాటు శ్రమించి... లీకేజీని అరికట్టగలిగారు. 




విచారణకు ఆదేశం...

నాసిక్‌ దుర్ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘బాధిత కుటుంబాల్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. ప్రతీ కొవిడ్‌ రోగినీ రక్షించడానికి రేయింబవళ్లు కష్టపడుతున్న తరుణమిది. ఇప్పుడు ఇన్ని ప్రాణాలు పోయాయి. ఇది ప్రమాదమే అయినా దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తాం’ అని ఆయన చెప్పారు.  మృతుల కుటుంబాలకు ఐదేసి లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇది పెద్ద విషాదకరమైన ఘటన అనీ, విషయం తెలియగానే హృదయం ద్రవించిపోతోందని పేర్కొన్నారు. బాధాకరమైన ఘటన అని అమిత్‌ షా అన్నారు. కాగా, ఆక్సిజన్‌ లీకేజ్‌ ఘటనతో జాకిర్‌ హుసేన్‌ ఆస్పత్రిలో పెను విషాదం అలుముకుంది. ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడేందుకు ఆస్పత్రి సిబ్బంది, రోగుల బంధువులు తీవ్రంగా శ్రమించారు. రోగుల ఛాతీపై నొక్కుతూ, కదిలిస్తున్న దృశ్యాలు అందరినీ కలచి వేశాయి. మరోవైపు.. గుజరాత్‌లోని దీసా  పట్టణంలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతవల్ల ఇద్దరు కొవిడ్‌ పేషెంట్లు చనిపోయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. అయితే, మృతుల్లో ఒకరి కుమారుడు మాత్రం.. చనిపోయింది నలుగురు పేషెంట్లు అని చెప్పడం గమనార్హం. 


ఢిల్లీలో తప్పిన పెనుముప్పు

ఆక్సిజన్‌ నిల్వ లేకపోవడంతో దాదాపు 500 మంది కొవిడ్‌ రోగులు చనిపోయే పరిస్థితి ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో తలెత్తింది. అయితే ఆక్సిజన్‌ నిల్వలు మరో అరగంటలో అడుగంటుతాయనగా.. ఓ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ఆస్పత్రికి చేరుకుంది. వెంటనే ఫిల్లింగ్‌, సిలిండర్లలోకి ఎక్కించడం, వెంటిలేటర్లకూ సరఫరా కావడంతో ఈ 500 మంది రోగులూ ‘ఊపిరి’ పీల్చుకున్నారు. జీటీబీ ఆస్పత్రిలో వెంటిలేటర్లపై ఐసీయూలో ఉన్న ఈ రోగులకు ఆక్సిజన్‌ సరిపడా లేదని ఆస్పత్రి యాజమాన్యం రెండ్రోజుల నుంచీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తూనే ఉంది. దాంతో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ వెంటనే ఆదుకోవాలని, తక్షణం ఆక్సిజన్‌ సరఫరా జరిగేట్లు చూడాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞాపనలు పంపారు. ‘‘మెడికల్‌ ఆక్సిజన్‌ ప్రధాన ఉత్పత్తిదారైన ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్ట్స్‌కు మా అవసరాన్ని తెలియపరిచాం. అయితే ఇతర రాష్ట్రాలకు ఈ ట్యాంకులను తమంత తాముగా పంపలేమని, కేంద్ర సాధికారిక బృంద పర్యవేక్షణలో ఈ ఆక్సిజన్‌ సరఫరా జరుగుతోందని ఐనాక్స్‌ తెలియజేసింది. ఈ ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లను బయటకు పంపబోమని జిల్లా కలెక్టరు, ఎస్పీ మాకు తెలియజేశారు.  ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని జీటీబీ ఆస్పత్రికి అత్యవసరంగా ఆక్సిజన్‌ పంపకపోతే మహా విలయమే జరుగుతుంది... ఆదుకోండి’’ అని జైన్‌  రైల్వే శాఖ మంత్రి పీయూశ్‌ గోయెల్‌కు పంపిన అత్యవసర సందేశాల్లో పేర్కొన్నారు. ఈ విషయమై ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సహా అనేక సామాజిక, విద్యా సంస్థలు కూడా కేంద్రానికి ఎస్‌ఓఎ్‌సలు పంపి ఒత్తిడి పెంచాయి. చివరకు తెల్లవారుఝామున 2 గంటలకు- అంటే ఆక్సిజన్‌ మరొక అరగంట మాత్రమే సరిపోతుందన్న టైములో ఓ ట్యాంకరు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనేక మంది ఈ ట్యాంకర్‌ ఫోటోను జతచేస్తూ పెద్ద ప్రాణనష్టం తప్పిందని ట్వీట్‌ చేశారు. ఈ ట్యాంకర్‌ రావడంపై ఢిల్లీ ప్రభుత్వం తన కృతజ్ఞతలు తెలియజేసింది. పడ్పడ్‌గంజ్‌లోని మాక్స్‌ ఆస్పత్రిలోనూ, శ్రీగంగారామ్‌ ఆస్పత్రిలోనూ కూడా తగిన నిల్వలు లేవని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలియజేయడంతో వాటికి బుధవారం ఉదయం రెండు ట్యాంకర్లు పంపారు. మాక్స్‌ ఆస్పత్రిలో కూడా రాత్రి 2 గంటలకు రావాల్సిన ట్యాంకరు ఉదయం 8 గంటలకు రావడంతో వైద్య సిబ్బంది నానా హైరానా పడ్డారు. ప్రఽభుత్వ ఆధ్వర్యంలోని దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో అక్కడికి కూడా ఆఖరి నిమిషంలో ట్యాంకర్‌ పంపారు. సెయింట్‌ స్టీఫెన్‌, మణిపాల్‌, హోలీ ఫ్యామిలీ ఆసుపత్రులతో పాటు రాజధానిలోని అనేక ద్వితీయ శ్రేణి ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు నిండుకున్నాయని, మరో పది గంటల పాటు మాత్రమే వస్తాయని, కేంద్రం అత్యవసరంగా స్పందించాలని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. రాజ్‌కోట్‌లో కూడా ఒక ఆస్పత్రికి ఇలాగే చివరి నిమిషంలో ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రావడంతో పలువురికి ప్రాణాపాయం తప్పింది. అత్యవసరం కావడంతో సగం నిండిన ట్యాంకరే వచ్చినట్టు సమాచారం. 


రంగంలోకి వైమానిక దళం

ఢిల్లీలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) రంగంలోకి దిగింది. ఆక్సిజన్‌ కంటెయినర్లను, సిలిండర్లను, అత్యవసర ఔషధాలను, వైద్య  పరికరాలను, వైద్య సిబ్బందిని ఐఏఎఫ్‌ దళాలు ఢిల్లీకి తరలిస్తున్నాయి. ముఖ్యంగా.. ఢిల్లీలో డీఆర్‌డీవో ఏర్పాటు చేసిన (మేక్‌ షిఫ్ట్‌) ఆస్పత్రికి కొచ్చి, ముంబై, వైజాగ్‌, బెంగళూరు నుంచి వైద్య సిబ్బందిని, బెంగళూరు నుంచి ఆక్సిజన్‌ కంటెయినర్లను ఢిల్లీలోని కొవిడ్‌ చికిత్సా కేంద్రాలకు తరలించినట్టు ఐఏఎఫ్‌ అధికారులు తెలిపారు. 


ఢిల్లీకి కోటా పెంపు

ఆక్సిజన్‌ లేక ఆసుపత్రులు విలవిల్లాడుతుండడంతో కేంద్రం ఢిల్లీకి ఇచ్చే కోటాను 480 మెట్రిక్‌ టన్నులకు పెంచింది. ఢిల్లీ ప్రభుత్వం ఇది చాలదని కనీసం రోజుకు 700 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరమని తెలిపింది. ‘‘బెంగాల్‌, ఒడిసాల నుంచి 100 మెట్రిక్‌ టన్నుల్ని తెప్పిస్తున్నాం. అది రావడానికి మరో 72 గంటలు పడుతుంది. హరియాణ నుంచి 140 ఎంటీ రావాలి.. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం అది వెళ్లకుండా అడ్డుపడుతోంది’ అని ఓ అధికారి వివరించారు. ఒక్క మంగళవారం రోజునే ఢిల్లీలో 277 మంది మరణించగా 29 వేల మందికి కరోనా సోకింది. 


రాఠీ ఆస్పత్రిలో నిండుకున్న ప్రాణవాయువు

ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతున్న ఢిల్లీ ఆస్పత్రుల్లో మరొక చోట నిల్వలు నిండుకున్నాయి. 78 మంది పేషెంట్లు ఆక్సిజన్‌ చికిత్స పొందుతున్న రాఠీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ప్రాణవాయువు అయిపోవడంతో వైద్యులు  చేతులెత్తేశారు. నిల్వలు కొద్దిసేపట్లో అయిపోతాయనగా.. ఆ 78 మంది పేషెంట్లనూ వేరే ఆస్పత్రులకు తీసుకెళ్లాలని వారి కుటుంబసభ్యులకు సూచించారు. ఆక్సిజన్‌ కోసం తాము ఎంతగా ప్రయత్నించినా ఉపయోగం లేకపోయిందని.. నిస్సహాయంగా మిగిలిపోవాల్సి వచ్చిందని ఆ ఆస్పత్రి మార్కెటింగ్‌ హెడ్‌ కౌస్తుభ్‌ తివారీ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-22T07:31:31+05:30 IST