ఒక్క రోజు సీఎంగా కాలేజ్ అమ్మాయి

ABN , First Publish Date - 2021-01-24T18:17:17+05:30 IST

‘సృష్టి గోస్వామి అనే నేను...’ అంటూ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తోంది ఓ కాలేజ్ అమ్మాయి. అదేంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కదా అనుకుంటున్నారా?

ఒక్క రోజు సీఎంగా కాలేజ్ అమ్మాయి

డెహ్రాడూన్: ‘సృష్టి గోస్వామి అనే నేను...’ అంటూ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తోంది ఓ కాలేజ్ అమ్మాయి. అదేంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కదా అనుకుంటున్నారా? అయితే ఈ రోజు మాత్రం ఆయన స్థానంలో సృష్టి గోస్వామి ఉండనున్నారు. 24 ఏళ్ల ఈ కాలేజ్ అమ్మాయి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మూడు గంటల పాటు వివిధ ప్రభుత్వ పథకాలను సమీక్షించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించనున్న బాల విధాన సభలో.. రాష్ట్రంలోని వివిధ శాఖల పూర్తి వివరాలను ఆమె తెలుసుకోనున్నారు. 


జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆమె ఈ అవకాశం దక్కించుకున్నారు. ఆ రాష్ట్ర బాల రక్షణ కమిషన్ నేతృత్వంలో సృష్టి గోస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. బాలికల సాధికారత సాధనలో భాగంగా ఈ సభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్‌కు కమిషన్ తెలిపింది. దీనిలో భాగంగా సృష్టి గోస్వామి అనే అమ్మాయిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశామని కమిషన్ పేర్కొంది. ఆమె అధ్యక్షతన బాల విధాన సభ జరగనుందని తెలిపింది. పలు శాఖల పనితీరును తెలుసుకోవడంతో పాటు, సమీక్షించనున్నట్టు ఆమె తెలిపింది. సృష్టి గోస్వామికి ముఖ్యమంత్రి హోదా దక్కడంపై ఆమె తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబవుతున్నారు. తామెంతో గర్విస్తున్నామని గోస్వామి తల్లిదండ్రులు తెలిపారు. ప్రతి బిడ్డా తను అనుకున్నది సాధించగలదని.. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.  

Updated Date - 2021-01-24T18:17:17+05:30 IST