24న Metturu Dam నుంచి సాగు జలాలు

ABN , First Publish Date - 2022-05-22T13:01:33+05:30 IST

డెల్టా రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మేట్టూరు డ్యాం నుంచి సాగు జలాలను ఈ నెల 24న విడుదల చేయాల్సిందిగా ఇరిగేషన్‌ అధికారు

24న Metturu Dam నుంచి సాగు జలాలు

- 19 రోజులు ముందుగానే విడుదలకు సీఎం స్టాలిన్‌ ఆదేశం  

-  డైల్టా  రైతుల హర్షం 


అడయార్‌(చెన్నై): డెల్టా రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మేట్టూరు డ్యాం నుంచి సాగు జలాలను ఈ నెల 24న విడుదల చేయాల్సిందిగా ఇరిగేషన్‌ అధికారులకు ఉత్తర్వులిచ్చారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల డెల్టా ప్రాంత రైతులు హర్షం ప్రకటిస్తున్నారు. పైగా ఆనవాయితీ కంటే 19 రోజులు ముందుగానే మేట్టూరు డ్యాం నుంచి సాగుజలాలను విడుదల చేయాలని సీఎం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నారు. కర్ణాటక నుంచి మేట్టూరు జలాశయంలోకి ప్రవేశిస్తున్న జలాల పరిమాణం అధికంగా ఉండటంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. మేట్టూరు జలాశయం నుంచి గత ఏడాది జూన్‌ 12వ తేదీన సీఎం స్టాలిన్‌ నీటి విడుదలకు ఆదేశించారు. ఫలితంగా గత ఏడాది వరి సాగులో దిగుబడి అత్యధికంగా వచ్చింది. ప్రస్తుతం కావేరి నది పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మేట్టూరుకు నీరు అధికంగా వచ్చి చేరుతోంది. తాజా లెక్కల ప్రకారం  జలాశయంలో నీటి మట్టం 115.35 అడుగులుగాను, నీటి నిల్వ 86.25 టీఎంసీలుగా ఉన్నాయి. జలాశయంలోకి ప్రవేశించే జలాల పరిమాణం అధికంగా ఉండటంతో వేగంగా డ్యాం నిండే అవకాశం ఉంది. అందువల్ల కావేరీ డెల్టా ప్రాంత రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వరి సాగు కోసం జూన్‌ 12వ తేదీ కంటే ముందుగానే ఈ నెల 24వ తేదీ నుంచి మేట్టూరు జలాలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ డ్యామ్‌ నుంచి జూన్‌ 12 లేదా అంతకంటే ముందుగా సాగుజలాలను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 19 రోజుల ముందుగానే నీటిని విడుదల చేయడంతో డెల్టా జిల్లాల్లో రైతులు అధిక మొత్తంలో కురువై సాగుచేసే అవకాశం ఉంది. అదేసమయంలో కురువై సాగుకు ప్రభుత్వం తరపున అందించాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు, సహకార రుణాల మంజూరుకు అవసరమైన చర్యలను తక్షణం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ శాఖలకు, కలెక్టర్లకు ఆదేశాలు అం దాయి. మేట్టూరు జలాలను వృథా చేయకుండా, పంట సాగుకు ఉపయోగించి, రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చేలా కృషి చేయాలని రైతులకు పిలుపునిస్తూ వారికి సీఎం స్టాలిన్‌ అభినందనలు తెలిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 


ఇప్పటివరకు 11 సార్లు

మేట్టూరు జలాలను కావేరి డెల్టా పంట పొలాల కోసం నిర్ణీత తేదీ కంటే ముందుగానే 11 సార్లు విడుదల చేయడం జరిగింది. ఇది 12వ సారి. ఈ డ్యాం నుంచి తొలిసారి 1934లో నీటిని విడుదల చేశారు. సాధారణంగా ఏటా జూన్‌ 12వ తేదీన నీటిని విడుదల చేసి జనవరి 28వ తేదీన నిలిపివేస్తారు. అయితే, గత 86 ఏళ్ళ చరిత్రలో నిర్ణీత తేదీలో 16 సార్లు నీటిని విడుదల చేశారు. చివరిసారి 2008లో జూన్‌ 12న డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత 11 ఏళ్ళ తర్వాత 2020, 2021లో నీటిని విడుదల చేశారు. అయితే, ఇప్పటివరకు 1936, 1937, 1938, 1940, 1941, 1942, 1943, 1944, 1945, 1947, 2011 సంవత్సరాల్లో నిర్ణీత తేదీ కంటే ముందుగానే మేట్టూరు జలాలను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి నీటిని ముందే విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2022-05-22T13:01:33+05:30 IST