25 మంది విద్యార్థులు.. 15 రోజుల పాటు సర్వే.. ఎంపీకి నివేదిక..

ABN , First Publish Date - 2022-05-23T20:43:09+05:30 IST

25 మంది విద్యార్థులు.. 15 రోజుల పాటు సర్వే.. ఎంపీకి నివేదిక..

25 మంది విద్యార్థులు.. 15 రోజుల పాటు సర్వే.. ఎంపీకి నివేదిక..

  • పొదుపు పాయె.. అప్పులాయె!
  • ఎంపీకి విద్యార్థుల సమ్మర్‌ యాక్టివ్‌ ప్రోగ్రాం నివేదిక

హైదరాబాద్‌ సిటీ : పెరుగుతున్న ఇంధన, నిత్యావసరాల ధరలతో పేద, దిగువ మధ్య తరగతికి చెందిన వారి ఆహార కొనుగోళ్లు తగ్గాయని, పొదుపు 40 నుంచి 60 శాతం దాకా తగ్గిందని ఓ నివేదిక స్పష్టం చేసింది. కోవా ఫౌండేషన్‌ సమ్మర్‌ యా క్టివ్‌ ప్రోగ్రాంలో భాగంగా నగరంలోని వివిధ స్కూళ్లు, కాలేజీలకు చెందిన 25 మంది విద్యార్థులు 15 రోజుల పాటు సర్వే (Survey) చేశారు. వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌, నీరు, మురుగు, చెత్త, వీధికుక్కల సమస్యతో పాటు పెరుగుతున్న ధరలు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలపై ప్రభావం అంశంపై ఈ సర్వే కొనసాగింది. ఆ వివరాలతో పాటు పరిష్కార మార్గాలను చూపుతూ నివేదిక రూపొందించారు.


నివేదికను ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్సీ అమీన్‌ ఉల్‌ హసన్‌ జాఫ్రీ, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌, జీహెచ్‌ఎంసీ ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ ఇర్షాద్‌లకు అందజేశారు. పేద, దిగువ మధ్యతరగతికి చెందిన వారిలో 75 శాతం మంది అప్పుల పాలయ్యారని, 55 శాతం మంది తమ అవసరాల కోసం నగలను విక్రయించారని, మరో 33 శాతం మంది ఫైనాన్స్‌ సంస్థలో తనఖా పెట్టారని నివేదికలో పొందుపరిచారు. పండగల సమయంలో కూడా చాలా మంది కొత్త దుస్తులు కొనలేకపోతున్నారన్నారు.


మధ్య తరగతి వారిలో 75 శాతం, పేదల్లో 45 శాతం, దిగువ మధ్యతగతి వారిలో 30 శాతం మంది బ్యాంకులు లేదా ప్రైవేటు సంస్థల్లో అప్పు తీసుకున్నట్లు సర్వేలో వెల్లడైంది. మధ్యతరగతికి చెందిన వారు ఖర్చులను నియంత్రించుకున్నప్పటికీ, పొదుపులో 40 నుంచి 60 శాతం తగ్గిందని తేల్చారు. సమస్యల పరిష్కారానికి తక్షణం ఇంధనంతో పాటు నిత్యావసర ధరలు తగ్గించాలని, స్కూల్‌ ఫీజులపై నియంత్రణ ఉండాలని సూచించారు. జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర శాఖలకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు యాప్‌ లేదా టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఉన్న విషయం దాదాపు 80 శాతం మందికి తెలియదని సర్వేలో తేలింది. 

Updated Date - 2022-05-23T20:43:09+05:30 IST