25 ఏళ్ల క్రితం భయం భయంగా Love Marriage.. ఇప్పుడు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా.. అసలు కథ ఇదీ..

ABN , First Publish Date - 2021-12-23T12:25:08+05:30 IST

వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారికి ఇద్దరు యుక్త వయసు పిల్లలు..

25 ఏళ్ల క్రితం భయం భయంగా Love Marriage.. ఇప్పుడు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా.. అసలు కథ ఇదీ..

  • ఇదో ప్రేమ పెళ్లికథ..!
  • 25 వసంతాల దాంపత్య కాంతులు
  • సిల్వర్‌  జూబ్లీ వేడుకల్లో మళ్లీ కల్యాణ వీణ

హైదరాబాద్ సిటీ/నార్సింగ్‌ : వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారికి ఇద్దరు యుక్త వయసు పిల్లలు. ఆ జంట మరోసారి పెళ్లి పీటలు ఎక్కనుంది. 25 ఏళ్ల క్రితం భయం భయంగా పెళ్లిచేసుకోగా ఈ సారి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక జరుపుకోనుంది. చంపాపేటకు చెందిన బిల్డర్‌ నాగిరెడ్డి సంస్కృత దంపతులు తమ 25వ పెళ్లి రోజున  మరోసారి పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుట్లో పెళ్లి స్నేహితుల మధ్య జరిగితే ఈసారి పెళ్లి తన ఇరు కుటుంబాలు, స్నేహితుల, సన్నిహితుల మధ్య ఊరందరినీ పిలుస్తున్నారు.  ఈ నెల 24న శంషాబాద్‌ నర్కూడలోని అమ్మపల్లి రామాలయంలో పెళ్లి ఘనంగా జరగనుంది. ఇందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు.


ఇదీ జరిగింది...

చంపాపేట్‌కు చెందిన నాగిరెడ్డి పీఆర్‌ఆర్‌ లా కళాశాలలో లా కోర్సులో చేరాడు.  ఏడాది తర్వాత జూనియర్‌ బ్యాచ్‌ చేరింది. ఈ  బ్యాచ్‌లో వరంగల్‌కు చెందిన సంస్కృత ఉన్నారు. అక్కడ ఆమెతో నాగిరెడ్డి పరిచయం ప్రేమగా మారి పెళ్లిపీటలెక్కింది. కట్‌ చేస్తే.. యువతి ఇంట్లో ప్రేమ పెళ్లికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే పరిస్థితి లేదు. యువతి కుటుంబంలో ఓ ప్రజాప్రతినిధి, ఓ పెద్ద కుటుంబం అండ ఉంది. దీంతో  నాగిరెడ్డి ఒడిశాలోని స్నేహితుడి వద్దకు సంస్కృతతో చేరాడు. అతడి సాయంతో ఓ ఇంటివాడయ్యారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు చేరవేశారు.


వారం తర్వాత ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో సంతోషం వెల్లివెరిసింది. నగరానికి విచ్చేసిన వారికి రిసెప్షన్‌ నిర్వహించారు. ప్రస్తుతం నాగిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ, వీరి మదిలో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకోలేదన్న క్షోభ ఎప్పుడూ వేధిస్తుండేది.  వేద పండితులను సంప్రదిస్తే ఇలా మరోసారి పెళ్లి చేసుకోవాలంటే పాతికేళ్లు ఆగాలని సిల్వర్‌ జూబ్లీ వేడుకలు సమయంలో మరోసారి చేసుకోవచ్చని వేద పండితులు ఇరుకుటుంబాల పెద్దలు వీరికి సూచించారు.  దీంతో వీరు మరోసారి పెళ్లిపీటలెక్కనున్నారు.

Updated Date - 2021-12-23T12:25:08+05:30 IST