ప్రభుత్వ పథకాలతో 2.50లక్షల మంది రైతులకు లబ్ధి

ABN , First Publish Date - 2021-10-27T04:45:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ, వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకాలతో జిల్లాలో సుమారు 2.50లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలతో 2.50లక్షల మంది రైతులకు లబ్ధి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జేసీ, జడ్పీ చైర్మన్‌, తదితరులు

జేసీ హరేందిరప్రసాద్‌

నెల్లూరు(వ్యవసాయం), అక్టోబరు 26 : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ, వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకాలతో జిల్లాలో సుమారు 2.50లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా మూడో ఏడాది రెండో విడత నగదును మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణం నుంచి జేసీతోపాటు వ్యవసాయశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 2,40,454 మంది రైతుల ఖాతాల్లో రెండో విడత నగదు జమైందని తెలిపారు. అదేవిధంగా వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాల రాయితీ కింద 6661 మంది రైతులకు రూ.123.2లక్షలు, వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా 111 గ్రూపులకు రూ.2,70,08,163లు సబ్సిడీ నగదు రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ ఆనం అరుణమ్మ, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ ఆనందకుమారి, డీడీ ప్రసాదరావు, ఏడీలు అనిత, ధనుంజయరెడ్డి, నర్సోజి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T04:45:55+05:30 IST