తల్లుల ఖాతాల్లో రూ.258.16 కోట్లు

ABN , First Publish Date - 2022-06-28T04:36:11+05:30 IST

అమ్మఒడి పథకంలో భాగంగా జిల్లాలోని 1,72,112 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.258.16 కోట్లు జమ చేశామని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ వెల్లడించారు.

తల్లుల ఖాతాల్లో రూ.258.16 కోట్లు
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యేలు

కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ 


నంద్యాల టౌన్‌, జూన్‌ 27 : అమ్మఒడి పథకంలో భాగంగా జిల్లాలోని 1,72,112 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.258.16 కోట్లు జమ చేశామని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ వెల్లడించారు. సోమవారం మున్సిపల్‌ టౌన్‌హాల్‌లో జగనన్న అమ్మఒడి పథకం 2021-2022 విద్యాసంవత్సరానికి 1వ తరగతి నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థు ల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డబ్బు జమ చేసిన  లైవ్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, నందికొట్కూరు ఎమ్మె ల్యే తొగూరు ఆర్థర్‌ వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లల చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిం దని అన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని దాదాపు 27వేల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.40కోట్లు నగదు జమ అయిందని అన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  జగనన్న విద్యా దీవేన, వసతి దీవెన కార్యక్రమాల ద్వారా విద్యారంగానికి పెద్దపీట వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో సత్యనారాయణమూర్తి, ఉర్దూ అకాడమీ రాష్ట్ర డైరెక్టర్‌ అబ్దుల్‌ షుకూర్‌, డిప్యూటీ డీఈవో అనూరాధ, ఎంఈవో బ్రహ్మం, జీసీడీవో లలితకుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 


ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలి: కలెక్టర్‌ 


ప్రజలు సంతృప్తి చెందే రీతిలో స్పందన దరఖాస్తులను పరిష్కరించాలని  కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ వైఎస్‌ఆర్‌ సెంటినరీ హాల్‌లో స్పందన నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య, డీఆర్వో పుల్లయ్య, పలువురు జిల్లాస్థాయి అధికారులు జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన దరఖాస్తులకు సరైన రీతిలో ఎండార్స్‌మెంట్‌ ఇవ్వకపోవడం వల్లే మళ్లీ రీ ఓపన్‌ అవుతున్నాయని అన్నారు. ప్రతి గురువారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రత్యేకంగా స్పందన దరఖాస్తులపై సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు.  స్పందనకు 166 దరఖాస్తులు రాగా, వాటిని సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 


ఆస్తి తీసుకొని ..


తండ్రిని ఇబ్బంది పెడుతున్న కొడుకులు 

స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు


నంద్యాల (నూనెపల్లె), జూన్‌ 27 : తన ముగ్గురు కొడుకులు ఆస్తి తీసుకొని ఇబ్బంది పెడుతున్నారని మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన సూర్య నాయక్‌ ఎస్పీ రఘువీర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోమవారం నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 109 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంపై అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. నంద్యాలలోని వైఎస్‌ఆర్‌ నగర్‌లో తక్కువ ధరకు ప్లాట్‌ ఇప్పిస్తామని చెప్పి పాణ్యం మండలం కొణిదేడు గ్రామానికి చెందిన ముద్దవరం మద్దిలేటి నమ్మించి, నకిలీ పట్టా ఇచ్చి మోసం చేశాడని నంద్యాల పట్టణం సరస్వతీ నగర్‌కు చెందిన మానస, చిన్నమ్మ ఫిర్యాదు చేశారు. హైకోర్టులో రికార్డ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బేతంచర్ల మండలానికి చెందిన గుండాల ప్రసాద్‌బాబు మోసం చేశాడని నంద్యాలకు చెందిన నాగేంద్రకుమార్‌ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులను సంబంధిత పోలీసుస్టేషన్‌ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-28T04:36:11+05:30 IST