నంబర్‌ వర్రీ!

ABN , First Publish Date - 2022-04-06T08:03:07+05:30 IST

జగన్‌ ప్రభుత్వాన్ని నంబర్‌ సెంటిమెంటు భయపెడుతోంది. కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు అయ్యాయి.

నంబర్‌ వర్రీ!

  • 26 అచ్చిరాదన్న భయం
  • కొత్తగా మరో జిల్లా ఏర్పాటు!
  • 27 అయితే కలిసొస్తుందని ఆగమ పండితుల సూచన
  • ప్రభుత్వ పెద్దల పునరాలోచన
  • ముంపు మండలాలు, పోలవరం, గిరిజన ప్రాంతాలతో కొత్త జిల్లా
  • కసరత్తు మొదలుపెట్టిన రెవెన్యూ శాఖ
  • జిల్లా ప్రధానకేంద్రంగా రంపచోడవరం
  • పోలవరం జిల్లాగా పేరు పెట్టే చాన్సు?

(అమరావతి -ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వాన్ని నంబర్‌ సెంటిమెంటు భయపెడుతోంది. కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు అయ్యాయి. అయితే 26లో 2, 6 కలిపితే ఎనిమిది అవుతుందని.. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇది సర్కారుకు శుభసూచకం కాదని ఆగమశాస్త్ర పండితులు చెప్పినట్లు తెలిసింది. 9 వచ్చేలా జిల్లాలను పెంచుకోవాలని..  లేకపోతే అశుభమని వారు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం మరో కొత్త జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మన్యం ప్రాంతంలో మరో కొత్త జిల్లా రాబోతోందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని మంగళవారం మచిలీపట్నంలో ప్రకటించడం దీనికి బలం చూకూర్చుతోంది. గిరిజనుల కోసమే మరో జిల్లాను ఏర్పాటు చేయబోతున్నట్లు బయటకు చెబుతున్నా.. లోగుట్టు మాత్రం నంబర్‌ సెంటిమెంటేనని అధికార పార్టీ వర్గాలే బాహటంగా మాట్లాడుకుంటుండడం విశేషం.


మొదట పాతికే..

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో 13 జిల్లాలు ఉన్నాయి. ఇది సరైన సంఖ్య కాదని, ఎవరు అధికారంలో ఉన్నా వారికి మంచి జరగదని పలువురు మేధావులు అనేక సందర్భాల్లో చె ప్పారు. కానీ నాటి సీఎం చంద్రబాబు వీటిని పట్టించుకోలేదు. తాను అధికారంలోకి వచ్చాక ప్రతి లోక్‌సభ స్థానాన్నీ ఓ జిల్లాగా ప్రకటిస్తానని ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. గద్దెనెక్కాక 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామని తొలుత జీవో ఇచ్చారు. ఆ తర్వాత రెండ్రోజులకు సవరించి 26 జిల్లాలని చెప్పారు. ఇప్పుడు సరిగ్గా 26 జిల్లాలనే ఏర్పాటు చేశారు. నిజానికి మార్చి 30నాటికి ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనల ప్రకారం ప్రాథమిక నోటిఫికేషన్‌లో ప్రకటించిన 26 జిల్లాలకు తోడు అదనంగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. రంపచోడవరం కేంద్రంగా 13 మండలాలను కలిపి ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలన్న అంశంపై పరిశీలన, కసరత్తు కూడా జరిగాయి. అయితే ప్రభుత్వం రాయచోటిని అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రంగా కొనసాగించి తీరాలన్న పట్టుదలతో మిగిలిన ఏ ప్రతిపాదనలనూ పట్టించుకోలేదన్న విమర్శలు వచ్యాయి. 


ముందుగా నిర్ణయించుకున్న కొత్త 13 జిల్లాలను ఎప్పుడు ప్రారంభించాలో మార్చి 30వ తేదీన సీఎం ఓ ముహూర్తాన్ని ప్రకటించారు. దాని ప్రకారమే సోమవారం కొత్త జిల్లాలను ప్రారంభించారు. భవిష్యత్‌ రాజకీయ ప్రయోజనాలకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపకరించబోతోందన్న ఆనందంలో ప్రభుత్వ పెద్దలు మునిగితేలుతుండగా.. పండితులు నంబర్‌ సెంటిమెంటును తెరపైకి తెచ్చారని.. 26 నంబరు శుభసూచకం కాదని హెచ్చరించినట్లు తెలిసింది. 26వ తేదీన లేదా ఆ నంబరు పేరిట అనేక  విపత్తులు, సంక్షోభాలు, ప్రమాదాలు ఉన్నాయని.. 9 వచ్చేలా పెంచుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ నేపఽథ్యంలో కొత్తగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలని పెద్దలు నిర్ణయించారని.. మార్చి 30న రెవెన్యూ శాఖ ప్రతిపాదించిన రంపచోడవరం జిల్లా ప్రతిపాదనను ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారని తెలిసింది. 


కొత్త జిల్లా ఎలా ఉండొచ్చు..?

పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే ఏడు తెలంగాణ మండలాలు.. కుక్కునూరు, వేలేరుపాడు, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం, భద్రాచలం, బూర్గంపాడు లను మోదీ ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసింది. వీటిలో కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలను పశ్చిమ గోదావరిలో.. మిగతావాటిని తూర్పుగోదావరిలో కలిపింది. ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వం ఎటపాక, కుక్కునూరులను ప్రత్యేక రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల సందర్భంగా ఈ రెండు డివిజన్లను రద్దుచేశారు. కుక్కునూరు, వేలేరుపాడులను ఏలూరు జిల్లాలో కలిపారు. మిగతా మండలాలను అల్లూరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌లో కలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు.. అల్లూరి జిల్లాలో ఉన్న రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్‌పురంలతోపాటు పోలవరం మండలాన్ని కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాకు రంపచోడవరం లేదా పోలవరం జిల్లాగా పేరుపెట్టే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. తొలి ప్రతిపాదన సమయంలో రంపచోడవరమే హెడ్‌క్వార్టర్‌గా ఉండేలా ప్రతిపాదించారు. మరి దానికే కట్టుబడి ఉంటారా లేదా అనేది చూడాలి.


మన్యంలో మరో జిల్లా... సీఎం సుముఖం: మంత్రి పేర్ని

మచిలీపట్నం ఏప్రిల్‌ 5: మన్యం ప్రాంతంలో మరో జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సుముఖంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి పేర్ని నాని అన్నారు. మన్యంలో మూడు ప్రాంతాలను కలుపుతూ ఈ జిల్లాను ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరుగుతోందని చెప్పారు. కొత్త జిల్లా ఏర్పాటుపై త్వరలో తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి వద్ద తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 43 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిందన్నారు. 1970ల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కొంతభాగాన్ని తీసుకుని విజయనగరం జిల్లాగా ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 13 జిల్లాలను ఏర్పాటు చేయడం వైఎస్‌ జగన్‌కే సాఽధ్యమైందని, ఇది చారిత్రక నిర్ణయమని చెప్పారు.

Updated Date - 2022-04-06T08:03:07+05:30 IST