20 ఏళ్లుగా విడాకుల కోసం భర్త ప్రయత్నాలు.. నో చెబుతున్న భార్య.. సుప్రీంకోర్టులో 27 ఏళ్ల కొడుకు చెప్పిన నిజాలు విని..

ABN , First Publish Date - 2022-04-12T21:30:07+05:30 IST

ఆ భార్యాభర్తలకు 1988లో వివాహం జరిగింది.. వారిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు..

20 ఏళ్లుగా విడాకుల కోసం భర్త ప్రయత్నాలు.. నో చెబుతున్న భార్య.. సుప్రీంకోర్టులో 27 ఏళ్ల కొడుకు చెప్పిన నిజాలు విని..

ఆ భార్యాభర్తలకు 1988లో వివాహం జరిగింది.. వారిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు.. 14 ఏళ్ల వైవాహిక జీవిత తర్వాత ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి.. దాంతో 2002లో భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు.. అయితే విడాకులు ఇచ్చేందుకు భార్య అంగీకరించడం లేదు.. భర్త నుంచి విడిపోయి తను జీవించలేనని వాదిస్తోంది.. అంతేకాదు తన కొడుకుతో మాట్లాడనివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్ వేసింది.. దాంతో కోర్టు తల్లికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 


తల్లితో మాట్లాడాలని కొడుకుని అడిగింది. కోర్టు విజ్ఞప్తిని తిరస్కరించిన 27 ఏళ్ల కొడుకు తన తల్లి పెట్టిన టార్చర్ గురించి కోర్టుకు వివరించాడు. `నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు నా తల్లి నన్ను రోజూ కొడుతుండేది. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు నన్ను బాత్రూమ్‌లో ఉంచి తలుపు వేసేది. గంటల కొద్దీ నేను బాత్రూమ్‌లోనే ఉండేపోయేవాణ్ని. ఆమెతో మాట్లాడడం నాకు ఇష్టం లేద`ని ఆ కొడుకు కోర్టు ఎదుట చెప్పాడు. కాగా, కొడుకు చేత భర్త నాటకం ఆడిస్తున్నాడని, అతని మాటలను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టులో ఆ మహిళ తరఫు లాయర్ వాదించాడు. 


భార్యాభర్తలు విడిపోయిన నాటి నుంచి కొడుకు తండ్రితోనే కలిసి ఉంటున్నాడని, 20 ఏళ్లలో ఎప్పుడూ ఆమె తన కొడుకు తనకు కావాలని కోరలేదని, ఇప్పుడు ఎందుకు అడుగుతోందో అర్థం చేసుకోవాలని భర్త తరఫు లాయర్ వాదించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం నెల రోజుల తర్వాత యువకుడితో, అతని తల్లిదండ్రులతో మాట్లాడతామని కేసును వాయిదా వేసింది.   

Updated Date - 2022-04-12T21:30:07+05:30 IST