28న Pmk ప్రత్యేక సర్వసభ్యమండలి

ABN , First Publish Date - 2022-05-22T13:23:29+05:30 IST

పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) యువజన విభాగం అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ అన్బుమణి రాందా్‌సను పార్టీ అధ్యక్షుడిగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 28న జరుగనున్న

28న Pmk ప్రత్యేక సర్వసభ్యమండలి

- అన్బుమణికి అధ్యక్ష పీఠం 

- జీకే మణికి ప్రత్యేక పదవి


చెన్నై: పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) యువజన విభాగం అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ అన్బుమణి రాందా్‌సను పార్టీ అధ్యక్షుడిగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 28న జరుగనున్న పీఎంకే ప్రత్యేక సర్వసభ్య మండలి సమావేశంలో పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ తనయుడిగా ఉన్న అన్బుమణిని పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జీకే మణిని పార్టీలో కొత్తగా రూపొందించనున్న ప్రత్యేక పదవిలో నియమించనున్నారు. రాష్ట్రంలో వన్నియార్ల సంక్షేమం కోసం డాక్టర్‌ రాందాస్‌ ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ వన్నియార్ల సంఘం 1989లో రాజకీయ పార్టీగా అవతరించింది. పార్టీ ఏర్పాటైన రెండేళ్లకే శాసనసభ ఎన్నికల్లో ద్రవిడ పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా ఆ పార్టీ 194 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో లక్షా 45 వేల 982 ఓట్లు సంపాదించుకుంది. ఓ నియోజకవర్గంలో గెలుపొందింది. తొలుత ఏనుగు చిహ్నంపై పోటీ చేసిన ఆ పార్టీకి 1998లో ఎన్నికల సంఘం మామిడి పండు చిహ్నాన్ని కేటాయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మామిడి పండు చిహ్నంపైనే ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తోంది. 1996లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 114 చోట్ల పోటీ చేసి 10 లక్షలకు పైగా ఓటు బ్యాంక్‌ను సంపాదించుకుంది. నాలుగు నియోజకవర్గాలను గెలుచుకుంది. 2001లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని 27 నియోజకవర్గాల్లో పోటీ చేసి 20 చోట్ల గెలవడంతో ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లభించింది. 2006, 2011 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుపెట్టుకుని వరుసగా 18, 3 నియోజకవర్గాలలో గెలిచింది. 2016 శాసనసభ ఎన్నికల్లో పీఎంకే ఒంటరిగా పోటీ చేసి అన్ని చోట్లా ఓటమిపాలైంది. అయితే ఆ ఎన్నికల్లో 23 లక్షలకు పైగా ఓటు బ్యాంక్‌ సంపాదించుకుంది. గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని ఐదో చోట్ల గెలిచింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది.


జీకే మణికి కొత్త పదవి: ఈ నేపథ్యంలో 2024లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించేందుకు గల అవకాశాలపై పార్టీ వ్యూహరచన సాగిస్తోంది. ఇదే విధంగా 2026లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో పీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యం దిశగా ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లోనే పార్టీలో కొత్తవారికి పదవులను కట్టబెట్టి నూతన జవసత్వాలు కల్పించాలని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ నిర్ణయించారు. ఆ మేరకు ఈ నెల 28న పార్టీ ప్రత్యేక సర్వసభ్య మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం తిరువేర్కాడు సమీపంలో జీపీఎన్‌ ప్యాలెస్‌ మహల్‌లో జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా 25 ఏళ్లపాటు సేవలందించిన జీకే మణిని ఘనంగా సత్కరించనున్నారు. 12 సార్లు పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై, మూడు దశాబ్దాలకుపైగా జీకే మణి రాందా్‌సకు కుడిభుజంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి పార్టీలో కొత్త పదవిని రూపొందించి ఆ పదవిలో నియమించనున్నారు.


అన్బుమణి ఎంపిక

ఇక పార్టీకి నూతన జవసత్వాలు కల్పించే దిశగా సర్వసభ్య మండలి సమావేశంలో డాక్టర్‌ అన్బుమణి రాందా్‌సను పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన సర్వసభ్య మండలి సభ్యులే కాకుండా పుదుచ్చేరికి చెందిన సభ్యులు కూడా పాల్గొననున్నారు. సర్వసభ్య మండలి సమావేశానికి సభ్యులందరూ తప్పకుండా హాజరుకావాలని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ విజ్ఞప్తి చేశారు. పార్టీ ప్రారంభించి 33 ఏళ్లు దాటినా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయామని రాందాస్‌ ఆందోళన చెందుతున్నారు. అన్బుమణి రాందా్‌సకు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగిస్తే పార్టీ అభివృద్ధి చెందటంతోపాటు 2026లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించగలమని ఆయన భావిస్తున్నారు.

Updated Date - 2022-05-22T13:23:29+05:30 IST