రెండు జిల్లాల్లో 291 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-19T05:45:39+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 164 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 232 మందికి కరోనా సోకింది.

రెండు జిల్లాల్లో 291 మందికి పాజిటివ్‌
హవేళీఘణపూర్‌లో మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్న ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి

సంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 18 : సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 164 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 232 మందికి కరోనా సోకింది. ఇందులో భాగంగా పటాన్‌చెరులో 53, నారాయణఖేడ్‌లో 35, జహీరాబాద్‌లో 25, సదాశివపేటలో 24, సంగారెడ్డిలో 18, జోగిపేటలో 22, అమీన్‌పూర్‌లో 14, మొగుడంపల్లిలో 3, రాయికోడ్‌లో 3, మామిడ్గిలో 2, కోహీర్‌లో 2, మనూర్‌లో 2, ఈరక్‌పల్లిలో 2, కంగ్టిలో 2, బొల్లారంలో 2, తాలెల్మలో 2, ఆర్సీపురంలో 21 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌ వచ్చిన అందరూ హోంఐసోలేషన్‌లో ఉన్నారు. అలాగే 4,955 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేశారు.  కాగా ఆదివారం జిల్లాలోని ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నమోదైన కొవిడ్‌ కేసుల వివరాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. స్థానిక వైద్యాధికారుల సమాచారం మేరకు 164 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇంద్రానగర్‌ యూపీహెచ్‌సీలో 57, పటాన్‌చెరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో 53, అమీన్‌పూర్‌  మున్సిపాలిటీ పరిధిలో 14, సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో 38, ఝరాసంగంలో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిమిత్తం సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి నుంచి 165, పటాన్‌చెరు ఆస్పత్రి నుంచి 140 శాంపిళ్లను సేకరించి కొవిడ్‌ నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపామని వైద్యాధికారులు తెలిపారు. 

కొవిడ్‌తో మరొకరు మృతి

మెదక్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 18: జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజుకు వందకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం తాజాగా జిల్లా వ్యాప్తంగా 762 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 127 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. గడిచిన 24 గంటల్లో తూప్రాన్‌ మండలంలోని ఘణపూర్‌ గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులను పరిశీలిస్తే... రామాయంపేటలో 32, మెదక్‌లో 29, రెడ్డిపల్లిలో 29, పాపన్నపేటలో 14, తూప్రాన్‌లో 8, పెద్దశంకరంపేటలో 8, టేక్మాల్‌లో 3, రంగంపేటలో 3, రేగోడ్‌లో ఒకటి చొప్పున కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య 6,527కి చేరింది. 4,198 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 52 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా 2,094 యాక్టివ్‌ కేసులున్నాయి.

మాస్కులు ధరించకుంటే జరిమానా విధిస్తాం

హవేళీఘణఫూర్‌, ఏప్రిల్‌ 18: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని, లేకుంటే జరిమానా విధిస్తామని హవేళీఘణపూర్‌ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం మండలకేంద్రంలో మాస్కులు ధరించని వాహనదారులకు, ప్రజలకు జరిమానా విధించారు. కాగా  ఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు.

గడిపెద్దాపూర్‌లో స్వచ్ఛంద బంద్‌!

-పది రోజుల పాటు ఆంక్షలు

అల్లాదుర్గం, ఏప్రిల్‌ 18 : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంలోని గడిపెద్దాపూర్‌ గ్రామస్థులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలుకు తీర్మానం చేశారు. ఈ నెల 17న ఒకేరోజు 20 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో ఆదివారం గ్రామపెద్దలు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకే కొవిడ్‌ నిబంధనలతో వ్యాపారాలు నిర్వహించుకోవాలని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. పది రోజుల పాటు స్వచ్ఛందబంద్‌ అమలులో ఉంటుందన్నారు. కరోనా వైరస్‌ కట్టడికి గ్రామస్థులు సహకరించాలని దండోరా వేయించారు. అనంతరం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారి చేయించారు. 

Updated Date - 2021-04-19T05:45:39+05:30 IST