ఇవ్వాల్సింది 2,920 కోట్లే!

ABN , First Publish Date - 2022-08-17T08:38:50+05:30 IST

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది.

ఇవ్వాల్సింది 2,920 కోట్లే!

  • పోలవరంపై మరోసారి తేల్చేసిన కేంద్రం
  • 35,150 కోట్లు రావాలన్న రాష్ట్రప్రభుత్వం
  • అదనంగా కాఫర్‌డ్యాం ఎత్తు పెంపు ఖర్చు
  • గుంతల పూడ్చివేత వ్యయమూ ఇవ్వండి
  • జగన్‌ సర్కారు వినతిని పట్టించుకోని కేంద్రం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం  రూ.55,548.87 కోట్లకు ఆమోదించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదు. 2013-14 ధరల ప్రకారం  కట్టిన లెక్కలకే పరిమితమవుతామని ఇంకోసారి తేల్చేసింది. పాత అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లేనని.. ఇందులో రాష్ట్ర విభజనకు ముందు ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లను తీసేస్తే.. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున ఇంకా 15,667.90 కోట్లను మాత్రమే తాము వ్యయం చేయాల్సి ఉందని వెల్లడించింది. 2014 నుంచి ఇప్పటి వరకూ రూ.12,747.16 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రీయింబర్స్‌మెంట్‌ చేసినందున..మిగిలిన రూ.2,920.74 కోట్లను ఇస్తే సరిపోతుందని తేల్చిచెప్పింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) డ్యాష్‌ బోర్డులో ఈ గణాంకాలను పొందుపరచింది.


రాష్ట్రం కోరిందేంటి..? 

2017-18 అంచనా వ్యయం మేరకు ప్రాజెక్టు అంచనా రూ.55,548.87 కోట్లు అని.. ఇందులో కేంద్రం చెబుతున్న 2013-14 అంచనా వ్యయం తీసేస్తే.. ఇంకా రూ.35,150.26 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని జగన్‌ సర్కారు కోరుతోంది. ఇవిగాక ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు తాజాగా అంచనా వ్యయం పెంచినందున రూ.453 కోట్లను అదనంగా చెల్లించాల్సి ఉందని... వరదల కారణంగా ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు ఇసుకను రప్పించినందున సంబంధిత సరఫరా సంస్థకు రూ.233 కోట్లు, ఇటీవల ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు మీటరు పెంచినందుకు.. వరద కారణంగా ముంపునకు గురైన ప్రాంతంలో నీటిని తోడేసి డయాఫ్రం వాల్‌ మరమ్మతులు చేసేందుకు నిధులు విడుదల చేయాలని అభ్యర్థించింది. 


మందకొడిగా పనులు..

2019లో జగన్‌ సర్కారు కొలువుదీరగానే.. పోలవరం ప్రాజెక్టుపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లింది. దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  అయినా జగన్‌ ముందుకే వెళ్లారు. పనుల వేగం కొనసాగిస్తామని.. 2021 డిసెంబరునాటికి ప్రాజెక్టును పూర్తిచేసి తీరతామని బీరాలు పలికారు. కానీ కేంద్రం చెప్పిందే జరిగింది. మూడేళ్లుగా పనులు మందకొడిగా సాగుతున్నాయి. నిర్మాణంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంది. దిగువ కాఫర్‌డ్యాం పనులు కూడా పూర్తి చేయకపోవడంతో గోదావరి వరద జలాలు ఎగువ నుంచి ప్రవహించి హెడ్‌వర్క్స్‌ పనులు జరుగుతున్న చోట నిలిచిపోయాయి.

 

పునరావాసానికి అతీగతీ లేదు..

హెడ్‌వర్క్స్‌ నిర్మాణం స్థితిగతులు ఇలా ఉంటే.. సహాయ పునరావాస కార్యక్రమాలకు అతీగతీ లేకుం డా పోయింది. నిర్వాసితులను తరలించాలంటే మరో రూ.21,000 కోట్లు కావాలి. కేంద్రం రూ.2,920.74 కోట్లే ఇస్తామంటోంది. ఈ నిధులతో హెడ్‌వర్క్స్‌ పూర్తికావచ్చేమో! సహాయ పునరావాసంలో పదో వంతు కూడా పూర్తికాదు. ఈ నేపథ్యంలో పోలవరం పూర్తవుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి.

Updated Date - 2022-08-17T08:38:50+05:30 IST