మూడు దశాబ్దాల ‘మండల్’

ABN , First Publish Date - 2020-08-07T05:59:39+05:30 IST

1990 దశకంలో మండల్, మందిర్ ఉద్యమాలు రెండూ ఒకేసారి ప్రారంభమయ్యాయి. 2020 ఆగస్టు 5న అయోధ్యలో జరిగిన ఒక కార్యక్రమంలో రామ మందిరానికి ఘనంగా శంకుస్థాపన జరిగింది.

మూడు దశాబ్దాల ‘మండల్’

1990 దశకంలో మండల్, మందిర్ ఉద్యమాలు రెండూ ఒకేసారి ప్రారంభమయ్యాయి. 2020 ఆగస్టు 5న అయోధ్యలో జరిగిన ఒక కార్యక్రమంలో రామ మందిరానికి ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఓబీసీల విషయంలో అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి కొరవడింది. తత్ఫలితంగా ఓబీసీ సమస్యల పరిష్కారానికి ఆస్కారం లేకుండా పోయింది.


విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1990 ఆగస్టు 7న మండల్ కమీషన్ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అదొక చరిత్రాత్మక రోజు. తదాది ఆ రోజును అనగా ఆగస్టు 7ని వెనుకబడిన తరగతుల ప్రజలు ‘మండల్ దివస్’ లేదా ‘భారత సామాజిక న్యాయ దినం’గా జరుపుకుంటున్నారు.

మండల్ కమిషన్ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం 1993లో ఉద్యోగాలలో, 2007నుంచి ఉన్నత విద్యాసంస్థలలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. మండల్ కమిషన్ సిఫారసుల అమలు ప్రారంభమై దాదాపు 27 సంవత్సరాల గడుస్తున్నా, ఓబీసీల సమస్యలు తీరడం లేదు, తగ్గడంలేదు సరి కదా, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఓబీసీల సమస్యలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. వాటిని వివరంగా చూద్దాం. 

l నిరాకరణ (Denial): 2013 నుంచి జాతీయస్థాయిలో జరిగే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష ‘నీట్’ (National Eligibility cum Entrance Test -NEET)లో ప్రతి రాష్ట్రం 15% ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లని, పీజీలో 50% సీట్లని ఆల్ ఇండియా కోటా (AIQ) క్రింద ఉంచడం జరుగుతుంది. అయితే ఈ జాతీయ కోటాలో ఎస్సి, ఎస్టీ కోటాని అమలు చేస్తున్నా, ఓబీసీ రిజర్వేషన్ని మాత్రం 2013 నుండి అమలు చేయడం లేదు. దాదాపు 72,491 సీట్లలో (సాధారణ వైద్య, దంత వైద్య కోర్సులు) అఖిల భారత కోటా క్రింద ఓబీసీకి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఇందులో రిజర్వేషన్ అమలు కాకపోవడమే కాకుండా, తిరస్కరణకు గురయింది. ఈ ఏడాది జాతీయ కోటా కింద తెలంగాణలో 230 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 468 సీట్లు కేటాయించగా ఓబీసీలకు భారత ఆరోగ్య మండలి ఒక్క సీట్ కూడా కేటాయించలేదు. అలాగే డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ మొదలగు విశ్వవిద్యాలయాలలో ఎంఫిల్, పిహెచ్డీ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు పెట్టినా ఓబీసీలకు మాత్రం రిజర్వేషన్ పెట్టలేదు. ఇది మరో రకమైన తిరస్కరణ.

l కుదింపు (Deprivation): ఓబీసీ రిజర్వేషన్ 27% ఉన్నా కూడా పూర్తిగా నింపకపోవడం ఇంకో సమస్య. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్/ సిబ్బంది క్యాడర్లలో మొత్తం కలిపి 5% కూడా భర్తీ చేయలేదు. కొన్ని విశ్వవిద్యాలయాలలో ఓబీసీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 8% నుంచి 13% వరకే పరిమితమైన ఘోరమైన పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ విశ్వవిద్యాలయంలోనూ కనీసం ఒక్క ప్రొఫెసర్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్ కూడా ఓబీసీ రిజర్వేషన్ల పరిధిలో లేరు. అలాగే భారత ప్రభుత్వ సర్వీసుల్లో గ్రూప్-–ఏలో 13.01%, గ్రూప్-–బీలో 14.78%, గ్రూప్–-సీలో 22.65% మేరకు మాత్రమే ఓబీసీలు ఉన్నారు. మొత్తం 32,58,663 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 7,03,017- అంటే 21.57% మాత్రమే- ఉద్యోగాలలో ఓబీసీలు ఉన్నారు. 

అదేవిధంగా ఓబీసీలకు జాతీయ స్థాయిలో పిహెచ్‌డీ వెయ్యి జాతీయ ఓబీసీ విశిష్ట సభ్యత్వాలు ఇస్తుంది. మన దేశంలో 945 పైచిలుకు జాతీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మరి ఓబీసీ విద్యార్థులకు ఈ వెయ్యి ఫెలోషిపులు ఎంఫిల్ లేదా పిహెచ్డీ చేయడానికి ఏ మాత్రమైనా సరిపోతాయా? ఒక్కో విశ్వవిద్యాలయానికి కేవలం ఒక్క ఓబీసీ విశిష్ట సభ్యత్వం మాత్రమే కేటాయించడంవల్ల ఆర్థిక ప్రోత్సాహం లేనందువలన ఓబీసీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు. అలాగే పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇచ్చి, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోవడంవల్ల ఓబీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. అదే విధంగా పీజీ, ఎంఫిల్, పిహెచ్డీ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష రుసుము చెల్లించే క్రమంలో ఓబీసీలను సాధారణ వర్గంగా ఎంచడం వల్ల ఓబీసీలు అధిక రుసుము చెల్లించాల్సి వస్తున్నది. దీని ద్వారా కూడా ఓబీసీలకు అన్యాయం జరుగుతున్నది.

l మళ్లింపు (Diversion): ఓబీసీ కేటగిరిలోని సీట్లను ఓబీసీలకు కాకుండా సాధారణ కేటగిరి సీట్లుగా మార్చే పద్ధతిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలలో ఒక ఓబీసీ పోస్టుకు మూడుసార్లు నోటిఫికేషన్ విడుదల చేసి ఆ నోటిఫికేషన్లలో పేర్కొన్న అర్హత కలిగిన అభ్యర్థులు లేరని ధ్రువీకరిస్తూ ఆయా ఉద్యోగ ఖాళీలను జనరల్ కేటగిరీలోకి మారుస్తున్నారు. అందువల్ల ఓబీసీ విద్యార్థులు రిజర్వేషన్ ఫలాలు అందక ఉద్యోగావకాశాన్ని కోల్పోతున్నారు. 1990 దశకంలో మండల్, మందిర్ రెండూ ఒకేసారి తెరపైకి వచ్చాయి. 27 సంవత్సరాల తరువాత అన్ని పార్టీల మద్దతు ద్వారా 2020 ఆగస్టు 5న అయోధ్యలో జరిగిన ఒక కార్యక్రమంలో రామ మందిరానికి ఘనంగా శంకుస్థాపన జరిగింది. కానీ ఓబీసీల పట్ల అదే చిత్తశుద్ధి అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాజకీయ పార్టీలకు లేకపోవడం వల్ల ఓబీసీ సమస్యల పరిష్కారానికి ఆస్కారం లేకుండా పోయింది. జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలకి మండల్ కమిషన్ సిఫారసులను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా మన సమాజంలోని అతిపెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అసంఖ్యాక ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది.


-జి. కిరణ్ కుమార్

అధ్యక్షుడు, అఖిలభారత ఓబీసీ విద్యార్థుల సంఘం 




బీసీల దండాల్‌


సామాజిక న్యాయం, సహజన్యాయం, చట్టబద్ధ న్యాయం మెజారిటీ ప్రజలకు దక్కాలనే ఆలోచనలనుండి వచ్చిందే మండల్‌ కమిషన్‌. 1990లో ప్రధానమంత్రి వీపీ సింగ్‌ మండల్‌ కమిషన్‌ అమలు చేస్తామని ప్రకటించటంతో, రిజర్వేషన్‌ అనుకూలురు, వ్యతిరేకులుగా దేశం రెండుగా చీలిపోయింది. మంచివాడి బుద్ధి మాంసంకాడ తెలిసినట్లు ఆర్‌.ఎస్‌.యు. నుంచి ఆర్‌.ఎస్‌.ఎస్‌. దాక తమ పాలక కుల ఆధిపత్య స్వభావాన్ని చాటుకున్నాయి. దేశంలోని మెజారిటీ పార్టీల నాయకుల అధినాయకులందరూ రిజర్వేషన్లపై విషం కక్కటంతో పెద్దఎత్తున అల్లర్లు జరిగాయి. మండల్‌ కమిషన్‌కు అనుకూలంగా శరద్ యాదవ్‌, ములాయమ్‌ సింగ్‌ యాదవ్, లాలుప్రసాద్‌ యాదవ్‌లు ఓబీసీలకు నాయకత్వం వహించి అగ్రభాగాన నిలిచి, ‘మండలేట్స్‌’గా పేరుగాంచారు. ఆగస్టు 7, 1990లో మండల్‌ కమిషన్‌ అమలైంది. ఓబీసీల అభివృద్ధి కోసం విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించటం గురించి సమగ్రంగా, నలభై డిమాండ్లతో 27శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్‌ కమిషన్‌ నివేదిక యిచ్చింది. కాని కేవలం విద్యా, ఉపాధి అవకాశాలకు మాత్రమే అది పరిమితం కావడంతో దేశవ్యాప్తంగా ఓబీసీలు అసంతృప్తిగా ఉన్నారు.


చట్టసభలలో వీరికి రిజర్వేషన్లు లేకపోవటం వల్ల పాలకకులాల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడవలసి వస్తున్నది. పార్లమెంట్‌లో 275కు పైగా ఉండాల్సిన ఓబీసీ ఎంపీలు పదుల సంఖ్యకే పరిమితమైనారు. పాలకులు ఈ వర్గాలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప క్షేత్రస్థాయి వాస్తవాన్ని గుర్తించడం లేదు. ఓబీసీల సామాజిక, ఆర్థిక వెనకబాటుతనంతో పాటు, పదుల సంఖ్యలో ఉన్న పాలక కులాలకే దశాబ్దాలుగా అధికారం హస్తగతం కావటం, ఈ కులాలచేతిలోనే సంపద కేంద్రీకృతం కావటం, ఓటు కొనుగోలు శక్తి వీరికే ఉండటం, ఈ పరిస్థితికి కారణం. నిర్మాణం లేని బీసీ ఉద్యమాలు, ప్రజల్లో కాకుండా పత్రికల్లోనే ఉద్యమాలు చేసి ఆ పబ్లిసిటీని మార్కెటింగ్‌ చేసుకుని, సంపన్నులుగా మారి సామాన్యులుగా నటించే కొంతమంది బీసీ నాయకులు కూడా ఈ దుస్థితికి కారణమే. మండల్‌ స్ఫూర్తితో దేశ జనాభాలో 55 శాతం ఉన్న ఓబీసీలకు వారెంతో వారికంత వాటా దక్కాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించాలి. పరిణామక్రమంగా వారిలో వస్తున్న చైతన్యం, సామాజిక మార్పులు పరిగణనలోకి తీసుకోవాలి. సత్యంకోసం, న్యాయంకోసం, ధర్మంకోసం అని పలికే బీజేపీ నాయకులు ఈ దేశంలో 55 శాతం పైగా ఓబీసీలు ఉన్న సత్యాన్నీ, వారికి సకల రంగాలలో దామాషా ప్రకారం వాటా దక్కాల్సిన ధర్మాన్నీ గుర్తించాలి. ఓబీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేకపోవటం అన్యాయం కాదా? చెట్లకు, పుట్టలకు, గుట్టలకు కూడా లెక్కలున్నాయి. సమాజంలో 55శాతం ఉన్న ఓబీసీలకు ఎస్సీ, ఎస్టీలలాగ జనాభా లెక్కలు, నరేంద్ర మోదీ ఓబీసీ ప్రధానిని అని చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు. తమ ప్రభుత్వ విధానాల ద్వారా రాజకీయ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేస్తేనే బీజేపీ ఓబీసీల వ్యతిరేకి అనే ముద్ర ఆ పార్టీకి పోతుంది.



సాధం వెంకట్‌

Updated Date - 2020-08-07T05:59:39+05:30 IST