3 నెలలు.. 30,000 కోట్లు!

ABN , First Publish Date - 2022-06-29T08:01:40+05:30 IST

3 నెలలు.. 30,000 కోట్లు!

3 నెలలు.. 30,000 కోట్లు!

అప్పుల్లో జగన్‌ సర్కారు రికార్డు

తాజాగా రూ.3 వేల కోట్ల రుణం

ప్రతినెలా సగటున 12 వేల కోట్ల ఆదాయం

నెలకు రూ.10 వేల కోట్లదాకా అప్పు

మూడు నెలల్లో ఖజానాకు 66 వేల కోట్లు

అయినా.. అన్నీ పెండింగ్‌లోనే

పథకాల లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత

ఉద్యోగుల బకాయిలన్నీ పెండింగే


అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాలకు కోతలు! ఉద్యోగులకు భారీగా బకాయిలు! పెండింగ్‌లో లక్ష కోట్లకుపైగా బిల్లులు! కనిపించని అభివృద్ధి జాడలు! అయినా... వారం వారం వేల కోట్ల అప్పులు! మంగళవారం రావడమే ఆలస్యం! కొత్త అప్పులకోసం పరుగులు తీయడమే! తాజాగా... ఈ మంగళవారం ఆర్బీఐ నుంచి రూ.3వేల కోట్ల అప్పు తెచ్చారు. మొత్తంపై 7.92 శాతం నుంచి 7.95 శాతం వడ్డీ పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలవుతోంది. ఈ మూడు నెలల్లో జగన్‌ సర్కారు చేసిన అప్పు 30,190 కోట్లకు పైమాటే! ఇదంతా బయటికి తెలిసిన లెక్కలు మాత్రమే! లోలోపల, తప్పుడు మార్గాల్లో చేస్తున్న అప్పులు మరిన్ని ఉన్నాయి.


ఇంతకీ ఏం చేస్తున్నట్లు?

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సగటున రూ.12వేల కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అలాగే... సగటున నెలకు రూ.10 వేల కోట్ల అప్పు చేస్తోంది. వెరసి... ఈ మూడు నెల ల్లో  దాదాపు రూ.36,000 కోట్ల ఆదాయం, రూ.30వేల కోట్లు అప్పు! అయినా సరే... ఖజానా ఎప్పుడూ ఖాళీయే. చేతిలో చిల్లి గవ్వ ఉండదు. అప్పులు, ఆదాయం రూపంలో భారీగా డబ్బులు వస్తున్నా... ‘అమ్మ ఒడి’లాంటి పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను కుదించేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు పేరుకుపోతున్నాయి. రాజధాని నిర్మాణం పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. అభివృద్ధి సాగడంలేదు. మరి... వస్తున్న ఆదాయం, చేస్తున్న అప్పులతో వచ్చే డబ్బులన్నీ ఏమవుతున్నాయన్నది ప్రశ్న. 


ఏ నెలలో ఎంత అప్పంటే..

ఏప్రిల్‌ నెలలో కొత్త అప్పు చేసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి రాలేదు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో చేయకుండా మిగిలిన పరిమితి పేరుతో రూ.4,390 కోట్ల ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని అప్పు చేసింది. మే నెలలో రూ. 9,500 కోట్లు, జూన్‌లో రూ.8,000 కోట్లు తెచ్చారు. తాజాగా మంగళవారం రూ.3,000 కోట్ల అప్పు తెచ్చారు. ఇవి కాకుండా బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా జూన్‌లో రూ.8,300 కోట్ల అప్పు చేశారు. దీనిపై 9.7ు భారీ వడ్డీ పడింది. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.28,000 కోట్లు అప్పు చేసుకునేందు కు అనుమతిచ్చింది. ఈ పరిమితిలో రూ.25,800 కోట్లు అప్పు తెచ్చారు. కానీ, సర్కార్‌ మాత్రం బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వా రా తెచ్చిన రూ.8,300 కోట్లను దీనిలో చూపలేదు. రాష్ట్రం, కార్పొరేషన్లు చేేస అన్ని అప్పులు ఈ పరిమితిలోకే రావాలని కేంద్రం, ఏజీ కార్యాలయం లేఖలు రాస్తున్నా స్పందించడం లేదు. ఈ విషయం తెలిసి కూడా కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం చూసి నా కేంద్రం ఇచ్చిన అనుమతిలో ఇప్పటి వరకు రూ.17,500 కోట్ల అప్పు చేసేశారు. ఆర్థిక సంవత్సరంలో ఇంకా 9 నెలలు మిగిలే ఉన్నాయి. మిగిలిన రుణ పరిమితి రూ.10,500 కోట్లు మాత్రమే!

Updated Date - 2022-06-29T08:01:40+05:30 IST