యేటా 3 టీఎంసీల నీరు వృథా

ABN , First Publish Date - 2022-07-07T05:28:13+05:30 IST

ప్రతి యేటా వర్షాకాలంలో సంగారెడ్డి జిల్లాలోని నల్లవాగు ప్రాజెక్టు నుంచి సుమారు 3 టీఎంసీల నీరు వృథాగా పోతుంది. నల్లవాగు ప్రాజెక్టు నిండి నీరంతా మంజీరలో కలుస్తుంది

యేటా 3 టీఎంసీల నీరు వృథా
నల్లవాగు నుంచి కిందకు వృథాగా వెళ్తున్న నీరు (ఫైల్‌)

నల్లవాగు ప్రాజెక్టు నుంచి మంజీర ద్వారా గోదావరిలోకి!

అడ్డుకట్ట వేస్తే 5 వేల ఎకరాలకు నీరందే అవకాశం

రూ.86 కోట్ల ప్రతిపాదనలు బుట్టదాఖలు


ఆంధ్రజ్యోతిప్రతినిధి,సంగారెడ్డి, జూలై6: ప్రతి యేటా వర్షాకాలంలో సంగారెడ్డి జిల్లాలోని నల్లవాగు ప్రాజెక్టు నుంచి సుమారు 3 టీఎంసీల నీరు వృథాగా పోతుంది. నల్లవాగు ప్రాజెక్టు నిండి నీరంతా మంజీరలో కలుస్తుంది. ఆ నీరు అక్కడి నుంచి కందకుర్తి త్రివేణి సంగమం ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో చేరి గోదావరి నదిలో చేరుతుంది. నల్లవాగు ప్రాజెక్టు నుంచి వృథాగా వెళ్లే నీటికి అడ్డుకట్ట వేస్తే కల్హేర్‌, సిర్గా పూర్‌ మండలాల్లోని సుమారు 5వేల ఎకరాల సాగుకు నీరందే అవకాశమున్నది. 


నల్లవాగు కెపాసిటీ 0.6 టీఎంసీలు

సిర్గాపూర్‌ మండలం నల్లవాగు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థం 0.6 టీఎంసీలే. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 5,178 ఎకరాల సాగుకు నీళ్లు ఇస్తున్నారు. ఇందులో ప్రాజెక్టు కుడికాల్వ ద్వారా సిర్గాపూర్‌ మండలం సుల్తానాబాద్‌, గోసాయిపల్లి, పోచాపూర్‌, కల్హేర్‌ మండలం బీబీపేట, ఖనాపూర్‌(కె), ఇందిరానగర్‌, కృష్ణాపూర్‌, కల్హేర్‌, మార్డి, ఫతేపూర్‌ గ్రామాల్లోని 4100 ఎకరాలకు, అలాగే ఎడమ కాల్వ నుంచి సిర్గాపూర్‌ మండలం బొక్క్‌సగామ్‌, అంతర్గామ్‌, కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మార్దండ, తిమ్మానగర్‌ గ్రామాల్లో 1018 ఎకరాలకు నీరందిస్తున్నారు. ఇక పిట్లం మండలంలోని మార్దాండ, తిమ్మానగర్‌ గ్రామాల్లోని 718 ఎకరాలకైతే యాసంగిలోనూ సాగుకు నీళ్లు వదులుతున్నారు. ప్రాజెక్టు కుడి కాలువ్వ వద్ద ఉన్న అత్యవసర కాల్వ నుంచి సుల్తానాబాద్‌, గోసాయిపల్లి గ్రామాల్లోని 60 ఎకరాలకు రెండు పంటలలోనూ నీళ్లు ఇస్తున్నారు.

  కర్ణాటకలోని ఔరాద్‌ ప్రాంతంలోని గుడిపల్లి గుట్టల్లో నల్లవాగు ప్రారంభమువుతున్నది. కొండలు, గుట్టల నుంచి కంగ్టి మండలం మీదుగా సిర్గాపూర్‌ మండలానికి ఈ వాగు నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ వాగుపై సిర్గాపూర్‌ మండలంలో ప్రాజెక్టు నిర్మించినందున నల్లవాగు పేరు వచ్చింది. 0.6టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన ఈ ప్రాజెక్టును 52 ఏళ్ల కిందట 1969లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగుకు నీళ్లు ఇస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల యేటా ఈ ప్రాంతంలో వచ్చే వర్షాలకు తోడు కర్ణాటక నుంచి వరదలతో నల్లవాగు నిండి, అలుగుపొంగి ప్రవహిస్తున్నది. ఇలా ప్రతివర్షాకాలం సీజన్‌లో మూడు, నాలుగు సార్లు అలుగు పొంగి దిగువకు ప్రవహించి మంజీర ద్వారా గోదావరిలో కలిసిపోతున్నాయి. 


అడ్డుకట్టకు ప్రత్యామ్నాయాలు

నల్లవాగు ప్రాజెక్టు ఎత్తు పెంచితే సుమారు 4 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయవచ్చు. ఫలితంగా వృథాగా వెళుతున్న నీటికి అడ్డుకట్ట వేసే వీలుంటున్నది. ఎత్తుపెంచడం వల్ల సిర్గాపూర్‌ మండలంలోని కొన్ని గ్రామాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడి చర్యలు చేపట్టవచ్చు. అలా కాకుండా ప్రాజెక్టు కుడి వైపు మీది ప్రాంతంలో అలుగు నిర్మించి, కాల్వ(వాగు) ఏర్పాటు చేస్తే ఉమ్మడి నల్లవాగు మండలంలోని పదమూడు గ్రామాల్లోని సుమారు 5వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చు. ఈ కాల్వ ఎత్తైన ప్రాంతంలో ఉండనున్నందున కాల్వకు అనుసంధానంగా ఫీడర్‌ చానళ్ల ఏర్పాటు చేసుకుని, గ్రావిటీ ద్వారా సాగునీళ్లు పొందవచ్చు. అలాగే ఈ ప్రాంతంలో సాగుకు పోనూ మిగిలిన నీళ్లు నిజాంసాగర్‌లో కలవనున్నాయి. ఆ ప్రాంత రైతులకు కూడా ఉపయోగపడుతున్నాయి. దివంగత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2007లో నల్లవాగు ప్రాంత ఎమ్మెల్యేలు సురేశ్‌షెట్కార్‌, గంగారం, బాజిరెడ్డి గోవర్ధన్‌లు కలిసి నల్లవాగు వృథా నీటికి అడ్డుకట్ట వేసి, సాగుకు వినియోగించాలని ఆయనను కోరారు.  వైఎస్‌ ఆదేశాలతో అధికార యంత్రాంగం రూ.86 కోట్ల అంచనాలతో ప్రతి పాదనలు సిద్ధం చేసింది. ఆతర్వాత జరిగిన పరిణామాలతో ఈ ప్రతిపాదన కాస్త అటకెక్కింది. 


పూడికతీత అవసరం

1478 అడుగుల డెడ్‌ స్టోరేజీతో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టం 1493 అడుగులే. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థం 0.6 టీఎంసీలే. అయితే ప్రాజెక్టు నిర్మాణమైన 1969నుంచి ఇప్పటి వరకు పూడిక తీయనే లేదు. దాంతో పూడిక పెరిగి, ప్రాజెక్టులో నీటి నిల్వ స్టోరేజీ కూడా తగ్గిపోయినట్టు నీటిపారుదల అధికారులే అంగీకరిస్తున్నారు. అందువల్ల ఈ ప్రాజెక్టులో పూడిక తీయడంతో పాటు వృథాగా వెళ్లే నీటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతాంగం కోరుతున్నది.

Updated Date - 2022-07-07T05:28:13+05:30 IST