30% మందే

ABN , First Publish Date - 2021-01-24T06:10:28+05:30 IST

కరోనా కేసులు బాగా తగ్గిపోయాయి, కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది, మాస్క్‌ ధరించకపోయినా ఏమీ కాదులే అన్న భావన చాలామందిలో కనిపిస్తున్నది.

30% మందే

గ్రామీణ ప్రాంతంలో మాస్క్‌ వినియోగం మరీ తక్కువ


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)


కరోనా కేసులు బాగా తగ్గిపోయాయి, కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది, మాస్క్‌ ధరించకపోయినా ఏమీ కాదులే అన్న భావన చాలామందిలో కనిపిస్తున్నది. గ్రామీణ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల, పాడేరు, అరకులోయ కేంద్రాల్లో ఉదయం సుమారు గంటపాటు వాహనాలపై ప్రయాణించే వారిని, పాదచారులను పరిశీలించగా...65 నుంచి 80 శాతం మంది వరకు మాస్క్‌లు ధరించలేదు. మాస్క్‌లు ధరించిన వారిలో కూడా కొందరు కిందకు దించేశారు. మాస్క్‌ ధరించని వారిలో ఎక్కువ మంది యువతీ యువకులు కనిపించారు. ఇక దుకాణాల్లో సరకులు, సామగ్రి కొనుగోలు చేయడానికి వచ్చేవారు, దుకాణాల్లో పనిచేస్తున్న వారిలో అత్యధికులు మాస్క్‌లు ధరించడం లేదు. షాపుల బయట మాత్రం ‘నో మాస్క్‌...నో ఎంట్రీ’ అంటూ కరపత్రాలు అతికించారు. కానీ పాటించడం లేదు. భౌతిక దూరం నిబంధన ఎక్కడా కానరావడం లేదు.


- అనకాపల్లిలో సంతబయలు ప్రాంతంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు దాదాపు 500 మంది రాకపోకలు సాగించారు. వీరిలో 300 మందికిపైగా మాస్క్‌లు లేవు.

- నర్సీపట్నం అబీద్‌ సెంటర్‌ రోడ్డులో ఉదయం పది నుంచి 11 గంటల వరకు దాదాపు వెయ్యి మందిని పరిశీలించగా 800 మంది వరకు మాస్క్‌లు ధరించలేదు. 

- పాయకరావుపేట గౌతమ్‌ సెంటర్‌లో ఉదయం 9.40 గంటల నుంచి 10.40 గంటల వరకు సుమారు 2,700 మంది రాకపోకలు సాగించారు. వీరిలో సగంమంది సుమారు...1,440 మంది మాత్రమే మాస్క్‌లు ధరించారు. వీరిలో కూడా కొంతమంది మాస్క్‌ను కిందకు దించారు.

- ఎలమంచిలి పట్టణంలోని దిమిలి రోడ్డు జంక్షన్‌లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సుమారు 2400 మంది రాకపోకలు సాగించారు. వీరిలో సుమారు 1460 మంది మాత్రమే మాస్క్‌లు ధరించారు. 

- పాడేరు పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో పరిశీలన జరపగా...ప్రతి పది మందిలో ఇద్దరు ఇద్దరు మాత్రమే మాస్క్‌ పెట్టుకున్నారు. దుకాణాలకు వస్తున్న కొనుగోలుదారులు సైతం మాస్క్‌లు ధరించడం లేదు.

- చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద మెయిన్‌ రోడ్డుపై ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 103 మందిని పరిశీలించగా 68 మంది మాస్క్‌లు ధరించలేదు.

- మాడుగుల మూడు జంక్షన్‌లో ఉదయం పది నుంచి 11 గంటల వరకు 150 మంది రాకపోకలు సాగించగా 90 మంది మాస్క్‌లు ధరించలేదు. వీరిలో అత్యధికులు యువత వున్నారు.  

- అరకులోయ పట్టణంలోని మయూరి జంక్షన్‌ వద్ద ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సుమారు 150 మందిని పరిశీలించగా 80 మంది మాస్కు పెట్టుకోలేదు. మిగిలిన వారిలో 30 మంది మాస్కును మెడకు అలంకారప్రాయంగా మార్చారు. 

Updated Date - 2021-01-24T06:10:28+05:30 IST