ఆశ..నిరాశ..అతీగతీ లేని నూతన పింఛన్లు

ABN , First Publish Date - 2020-07-06T11:18:21+05:30 IST

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసరా పింఛన్‌ అర్హత వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

ఆశ..నిరాశ..అతీగతీ లేని నూతన పింఛన్లు

వయో పరిమితి కుదించాక 3 వేల దరఖాస్తులు

‘సెర్ప్‌’ వద్దే నిలిచిన మంజూరు పత్రాలు

ఎదురుచూస్తున్న 3వేల మంది లబ్ధిదారులు


వరంగల్‌ సిటీ, జూలై 5: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసరా పింఛన్‌ అర్హత వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 57 ఏళ్లు నిండిన వారు పింఛన్‌కు అర్హులేనని స్పష్టం చేసింది. దీంతో నగరంలో 3వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది జరిగి సుమారు 18 నెలలు గడుస్తున్నా ఇంతవరకు అతీగతీ లేదు. దరఖాస్తుదారులు బల్దియా కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. అధికారులేమో ఇంకా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదంటున్నారు. దీంతో సర్కార్‌పై విమర్శలు వస్తున్నాయి.


‘ఆసరా’ పింఛన్‌ కోసం నెలల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న పండుటాకులపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. వయో వృద్ధులే కాదు ఆసరాలో ఇతరా విభాగాల లబ్ధిదారులు కూడా సర్కార్‌పై మండిపడుతున్నారు. పింఛన్‌ మంజూరైందన్న మాటే కాని 18 నెలలుగా పింఛన్‌ చేతికి రాకపోవడంపై బాధితులు నిరాశ చెందుతున్నారు. పింఛన్‌ కోసం బల్దియా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 


ఎన్నికలు ముగిశాయి...పింఛన్లు నిలిచాయి..

2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఆసరా పింఛన్లను రూ.2016కు పెంచుతూ హామీ ఇచ్చింది. డిసెంబర్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తిరిగి అధికారంలోకి వచ్చింది. కొత్తగా దరఖాస్తు చేసి అర్హత పొందిన వారు నెల నెలా రూ.2016 పింఛన్‌ చేతికి అందుతుందని సంబరపడ్డారు. పెంచిన పింఛన్‌ ప్రకారం రూ.3016 పొందవచ్చని దివ్యాంగులు ఆశపడ్డారు. కానీ వారి ఆశ నిరాశగానే మిగులుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం  ఇప్పటికీ పెదవి విప్పడం లేదు. 


‘సెర్ప్‌’ వద్దే నిలిచిన పత్రాలు..

జీడబ్ల్యూఎంసీ పరిధిలో 3వేలకు పైగా కొత్త దరఖాస్తుదారుల వివరాలను అధికారులు విచారించి హైదరాబాద్‌ సెర్ప్‌కు పెంపారు. సెర్ప్‌ కూడా వారికి పింఛన్లు మంజూరు చేసింది. కానీ విషయం అక్కడికే పరిమితమైంది. దీంతో ఇంకెంత కాలం వేచి ఉండాలనే ప్రశ్నలు లబ్ధిదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

 

విచారణ దశలో 1500లకు పైగా దరఖాస్తులు ...

నేటికీ బల్దియా వద్ద మరో 1500లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. విచారణ పూర్తి చేసి దరఖాస్తులను డీఆర్‌డీవోకు పంపించడంలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. డీఆర్‌డీవో నుంచి హైదారబాద్‌ సెర్ప్‌కు వెళ్లాలి. అక్కడ ఆమోద ముద్ర పడాలి. మంజూరైన వారికే ఇప్పటికీ దిక్కులేకపోగా, ఇక విచారణ దశలోనే ఉన్న వారికి పింఛన్‌ అందాలంటే ఎంత కాలం పడుతుందో వేచి చూడాలి. 


కార్పొరేటర్లపై ఒత్తిడి..

స్మార్ట్‌సిటీ, అమృత్‌, సీఎం ఆస్యూరెన్స్‌ అంటూ వేల కోట్ల నిధుల గురించి చెబుతున్న పాలకవర్గం కొత్త పింఛన్ల  విషయాన్ని మాత్రం ప్రస్తావించడం లేదనే విమర్శలు పెల్లుబికుతున్నాయి. కొందరు అధికార కార్పొరేటర్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పింఛన్‌ అర్హత పొందిన వారు డివిజన్లలో పదే పదే ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్‌ మంజూరైనా డబ్బులు ఎందుకు రావడం లేదంటూ నిలదీస్తున్నారని కార్పొరేటర్లు చెబుతున్నారు. మరో 9 నెలలు అయితే బల్దియా ఎన్నికలు. ఈ తరుణంలో ఒత్తిడి పెరుగుతోందని, ఇది నష్టం  కలిగించే పరిణమమని ఆవేదన చెందుతున్నారు. 

Updated Date - 2020-07-06T11:18:21+05:30 IST