ఒకే రోజు 313 ఎకరాలు.. 15 వేల మొక్కలు

ABN , First Publish Date - 2022-06-26T05:03:48+05:30 IST

ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటడంలో వనపర్తి జిల్లా రికార్డు నమోదు చేసింది.

ఒకే రోజు 313 ఎకరాలు.. 15 వేల మొక్కలు
చిట్యాలలో ఆయిల్‌ పామ్‌ మొక్క నాటి నీరు పోస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

- ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటడంతో రికార్డు నమోదు చేసిన వనపర్తి జిల్లా 


వనపర్తి అర్బన్‌, జూన్‌ 25 : ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటడంలో వనపర్తి జిల్లా రికార్డు నమోదు చేసింది. జిల్లా వ్యాప్తంగా శనివారం ఒక్క రోజే 313 ఎకరాల్లో 15 వేల మొక్కలు నాటారు. ఆత్మకూర్‌ మండలంలో 88.17 ఎకరాలు, పెబ్బేరు 42.77, కొత్తకోట 38.77, వనపర్తి 37.60, పాన్‌గల్‌ 30.64, అమరచింత 20.47, గోపాల్‌పేట 17, మదనాపురం 15, పెద్దమందడి 14, శ్రీరంగాపూర్‌ 4.57, రేవల్లి 4.57 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటారు. వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో ముష్టి బాలీశ్వర్‌ 5 ఎకరాల పొలంలో జరిగిన సామూహిక ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణతోనే అధిక ఆదాయం సంపాదించవచ్చు అని అన్నారు. రైతులు సంప్రదాయ సాగు నుంచి బయటకు రావాలని, ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతుకు నికర ఆదాయం వస్తుందన్నారు. దేశంలో బైబ్యాక్‌ గ్యారంటీ పాలసీ ఉన్న ఒకే ఒక పంట ఆయిల్‌ పామ్‌ అని, రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రతి ఏటా రూ. 80 వేల కోట్ల విలువైన వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నామని, 79 క్షేత్ర పర్యటనల ద్వారా 8460 మంది రైతులకు ఆయిల్‌ పామ్‌ సాగు ఇతర విషయాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. వరి మినహా అన్ని రకాల పంటలను ఆయిల్‌ పామ్‌లో అంతర పంటలుగా సాగు చేయవచ్చని, నూనె, పప్పు గింజల సాగు వైపు రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు.   

Updated Date - 2022-06-26T05:03:48+05:30 IST